IND vs BAN: చెన్నై టెస్టులో రోహిత్ శర్మ చెత్త రికార్డ్.. 11 ఏళ్ల టెస్టు కెరీర్‌లో ఇలా నాలుగోసారి-india captain rohit sharma suffers rare twin failure in chennai test ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Ban: చెన్నై టెస్టులో రోహిత్ శర్మ చెత్త రికార్డ్.. 11 ఏళ్ల టెస్టు కెరీర్‌లో ఇలా నాలుగోసారి

IND vs BAN: చెన్నై టెస్టులో రోహిత్ శర్మ చెత్త రికార్డ్.. 11 ఏళ్ల టెస్టు కెరీర్‌లో ఇలా నాలుగోసారి

Galeti Rajendra HT Telugu
Sep 20, 2024 07:06 PM IST

Rohit Sharma in Chennai Test: చెపాక్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో ఫెయిలయ్యాడు. 11 ఏళ్లలో టెస్టు కెరీర్‌లో హిట్ మ్యాన్ ఇలా సింగిల్ డిజిట్ స్కోరుకే రెండు ఇన్నింగ్స్‌ల్లో వెనుదిరగడం ఎన్నోసారి తెలుసా?

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (AFP)

IND vs BAN Chennai Test: బంగ్లాదేశ్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డ్ నెలకొల్పాడు. మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటింగ్‌లో ఫెయిలైన రోహిత్ శర్మ.. సింగిల్ డిజిట్ స్కోరుకే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పెవిలియన్‌కి చేరిపోయాడు. 2013 నుంచి టెస్టులు ఆడుతున్న రోహిత్ శర్మ ఇలా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటైపోవడం ఇది నాలుగో సారి మాత్రమే.

సింగిల్ డిజిట్‌కే వరుసగా రెండోసారి

తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చిన రోహిత్ శర్మ.. రెండో ఇన్నింగ్స్‌లో తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో జాకీర్ హసన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దాంతో అభిమానులకి నిరాశ తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 19 బంతుల్లో 6 పరుగులు చేసిన రోహిత్ .. రెండో ఇన్నింగ్స్‌లో 7 బంతుల్లో 5 పరుగులు చేశాడు.

2015లో గాలెలో శ్రీలంకపై, 2015లో ఢిల్లీలో దక్షిణాఫ్రికాపై, 2023లో సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఇలా సింగిల్ డిజిట్ స్కోరుకి రోహిత్ శర్మ ఔటయ్యాడు.

ఇంగ్లాండ్‌తో ఈ ఏడాది మార్చిలో చివరిగా టెస్టు మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ.. ఆ మ్యాచ్‌లో సెంచరీ (103) నమోదు చేశాడు. అంతేకాదు ఆ సిరీస్‌లో 400 పరుగులు కూడా చేశాడు. కానీ బంగ్లాదేశ్ జట్టుపై ఈ హిట్‌మ్యాన్ విఫలమడంతో.. టీమిండియా మేనేజ్‌మెంట్‌లో కంగారు మొదలైంది. ఈ ఏడాదిలోనే ఆస్ట్రేలియాతో కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉండటంతో మళ్లీ రోహిత్ శర్మ గాడిన పడాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.

మెరుగైన ఆధిక్యంలోకి భారత్

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజైన శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది.

క్రీజులో శుభమన్ గిల్ (33 బ్యాటింగ్: 64 బంతుల్లో 4x4), రిషబ్ పంత్ (12 బ్యాటింగ్: 13 బంతుల్లో 1x4, 1x6) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు 376 పరుగులకి ఆలౌట్ అవగా.. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్ టీమ్ 149 పరుగులకే ఆలౌటైంది. దాంతో టీమిండియాకి 227 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవరాల్‌గా శుక్రవారం ఆట ముగిసే సమయానికి 81/3తో నిలిచిన టీమిండియా 308 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.