Rohit Sharma: కాన్పూర్ టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మని నోరెళ్లబెట్టేలా చేసిన భారత ఫాస్ట్ బౌలర్.. ఊహించని రీతిలో వికెట్-team india fast bowler akash deep persuades unconvinced rohit sharma to opt for drs ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma: కాన్పూర్ టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మని నోరెళ్లబెట్టేలా చేసిన భారత ఫాస్ట్ బౌలర్.. ఊహించని రీతిలో వికెట్

Rohit Sharma: కాన్పూర్ టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మని నోరెళ్లబెట్టేలా చేసిన భారత ఫాస్ట్ బౌలర్.. ఊహించని రీతిలో వికెట్

Galeti Rajendra HT Telugu
Sep 27, 2024 01:44 PM IST

Bowler Akash Deep: భారత కెప్టెన్ రోహిత్ శర్మ‌కి డీఆర్‌ఎస్ విషయంలో చెప్పుకోదగ్గ సక్సెస్ రేట్ లేదు. దాంతో రివ్యూ తీసుకోవడంలో కాస్త తటపటాయిస్తుంటాడు. కాన్పూర్ టెస్టులో రోహిత్ శర్మని డీఆర్‌ఎస్ కోసం బలవంతం పెట్టిన యంగ్ బౌలర్.. వికెట్‌ దక్కించుకున్నాడు.

ఇస్లాం వికెట్ దక్కిన తీరుతో నోరెళ్లబెట్టిన రోహిత్ శర్మ
ఇస్లాం వికెట్ దక్కిన తీరుతో నోరెళ్లబెట్టిన రోహిత్ శర్మ (X)

భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతోంది. తొలి రోజైన శుక్రవారం ఆటలో భారత ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ తొలి సెషన్‌లోనే అద్భుత ప్రదర్శన కనబర్చాడు.

గురువారం రాత్రి రాత్రి కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకోగా.. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ యంగ్ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్.. తొలి సెషన్‌లోనే బంగ్లాదేశ్ ఓపెనర్ల వికెట్లు పడగొట్టాడు.

బౌలింగ్ చేసిన ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్

మ్యాచ్‌లో తాను వేసిన తొలి ఓవర్లోనే ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఓపెనర్ జకీర్ హసన్ వికెట్‌‌ను ఆకాశ్ దీప్ పడగొట్టాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ ఇస్లాంను కూడా నాటకీయంగా ఆకాశ్ దీప్ ఔట్ చేశాడు. వాస్తవానికి ఇస్లాంను తొలుత అంపైర్ ఔట్ ఇవ్వలేదు. కానీ.. ఆకాశ్ దీప్ బలవంతంతో కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్‌ఎస్ తీసుకోగా.. అంపైర్ తన నిర్ణయం మార్చుకోక తప్పలేదు.

మ్యాచ్ 13వ ఓవర్‌లో రౌండ్ ద వికెట్ బౌలింగ్ చేసిన ఆకాశ్ దీప్.. స్ట్రయిల్ డెలివరీని సంధించాడు. ఆ బంతిని ప్లిక్ చేసేందుకు ఇస్లాం ప్రయత్నించాడు. కానీ.. బంతి అతని బ్యాట్‌కి దొరకకుండా నేరుగా వెళ్లి ఫ్యాడ్‌ను తాకింది. దాంతో ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం ఆకాశ్‌తో పాటు భారత్ జట్టు ఫీల్డర్లు అప్పీల్ చేశారు.

పట్టువదలని ఆకాశ్ దీప్.. రోహిత్‌ను ఒప్పించి

కానీ ఆ అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించాడు. బంతి కచ్చితంగా వికెట్లపైకి వెళ్తోందని ధీమా వ్యక్తం చేసిన ఆకాశ్ దీప్.. రివ్యూ తీసుకోవాల్సిందిగా కెప్టెన్ రోహిత్ శర్మని కోరాడు. కానీ.. రోహిత్ మాత్రం బంతి లెగ్ స్టంప్ అవలకి వెళ్తోందని ఆకాశ్‌కి సమాధానమిస్తూ డీఆర్‌ఎస్‌కి నిరాకరించాడు. అదే సమయంలో పంత్ కూడా ఆకాశ్‌కి మద్దతుగా నిలిచాడు.

ఆకాశ్ దీప్ ఆత్మవిశ్వాసంతో చెప్పడంతో రోహిత్ శర్మ అయిష్టంగానే డీఆర్‌ఎస్ కోరాడు. రీప్లేలో బంతి బ్యాట్‌కి తాకలేదని తేలడంతో పాటు.. లెగ్ స్టంప్‌ను గీరాటేసేలా కనిపించింది. దాంతో నమ్మలేకపోయిన రోహిత్ శర్మ గట్టిగా అరిచి సంబరాలు చేసుకుంటూ.. ఆకాశ్ దీప్‌ని అభినందిస్తూ హత్తుకున్నాడు.

షమీ స్థానంలో ఛాన్స్ కొట్టేసిన ఆకాశ్

వాస్తవానికి కాన్పూర్ టెస్టులో భారత్ ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దిగుతుందని వార్తలు వచ్చాయి. కానీ మ్యాచ్‌కి ముందు రోజు.. అంటే గురువారం రాత్రి వర్షం కురవడంతో.. మూడో పేసర్‌ని రోహిత్ శర్మ కొనసాగించాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో కూడా ఆకాశ్ దీప్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు.

ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఈ బెంగాల్ బౌలర్ టీమ్ఇండియాలోకి అరంగేట్రం చేశాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గాయంతో టీమ్‌కి దూరమవడంతో ఆకాశ్ దీప్‌కి అవకాశం లభించింది. భారత్ జట్టు నెక్ట్స్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లను ఆడనుంది.

Whats_app_banner