WTC Final: “ఈసారి ఆ తప్పు చేయకూడదు”: టీమ్ఇండియాకు ఎంఎస్‍కే ప్రసాద్ వార్నింగ్-mks prasad warning to team india ahead of wtc final about final xi ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc Final: “ఈసారి ఆ తప్పు చేయకూడదు”: టీమ్ఇండియాకు ఎంఎస్‍కే ప్రసాద్ వార్నింగ్

WTC Final: “ఈసారి ఆ తప్పు చేయకూడదు”: టీమ్ఇండియాకు ఎంఎస్‍కే ప్రసాద్ వార్నింగ్

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‍కు ముందు టీమ్ఇండియాకు హెచ్చరికలు జారీ చేశారు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‍కే ప్రసాద్. 2021 ఫైనల్ అప్పుడు చేసిన తప్పును ఇప్పుడు చేయొద్దని సూచించారు.

ఎంఎస్‍కే ప్రసాద్ (HT Photo)

WTC Final: ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న భారత ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన ఇండియా - ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లండ్‍లోని లండన్ ఓవల్‍లో ఈ ఫైనల్ మొదలుకానుంది. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు ముందు టీమ్‍ఇండియాకు ఓ హెచ్చరిక జారీ చేశారు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‍కే ప్రసాద్. 2021లో న్యూజిలాండ్‍తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా చేసిన తప్పును టీమిండియా ఇప్పుడు చేయకూడదని సూచించారు. తుదిజట్టు ఎంపిక విషయంలో ఎంఎస్‍కే ఈ వార్నింగ్ ఇచ్చారు. వివరాలివే..

ఓవల్‍లో వాతావరణ పరిస్థితులను గమనించి తుది జట్టు గురించి మ్యాచ్ రోజే నిర్ణయించుకోవాలని ఎంఎస్‍కే ప్రసాద్ సూచించారు. 2021 డబ్ల్యూటీసీ ఫైనల్ అప్పుడు తుది జట్టును ముందే ప్రకటించి, అందులో ఇద్దరు స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాను తీసుకున్నామని, వాతావరణం మారినా మ్యాచ్ రోజు జట్టును మార్చకపోవడం మైనస్ అయిందని చెప్పారు. అందుకే ఈసారి తుది జట్టును ముందే ఎంపిక చేసుకోకుండా.. మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు పరిస్థితులను బట్టి సెలెక్ట్ చేసుకోవాలని సూచించారు.

ఆస్ట్రేలియాతో ఇప్పుడు జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‍లో ఓవల్ పిచ్ స్పిన్‍కు అనుకూలించే అవకాశం ఉన్నా.. పరిస్థితులను బట్టి మ్యాచ్‍ తొలి రోజే నిర్ణయం తీసుకోవాలని ఎంఎస్‍కే సూచించారు.

“మేం ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను (2021లో) తుది జట్టులో ఎంపిక చేశాం. అయితే ఆ తర్వాత వర్షం కురిసింది. మేం మా ప్లాన్‍ను మార్చుకోవాల్సింది. అయితే, ఎలానో అదే తుదిజట్టుతో బరిలోకి దిగాం. అయితే అది గతం. ఓవల్‍లో ఉండే పరిస్థితులపై అంతా ఆధారపడి ఉంటుంది. పిచ్, వాతావరణ పరిస్థితులే ముఖ్యం. ఐదు రోజులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. అందుకే ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చేయకూడదు. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించాలి” అని ఎంఎస్‍కే ఓ ఇంటర్వ్యూలో అన్నారు. 2021లో ఎంఎస్‍కే ప్రసాద్ చీఫ్ సెలెక్టర్‌గా ఉన్నారు.

పంత్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం

భారత టెస్టు క్రికెట్‍లో రిషబ్ పంత్ చేసినట్టు మరే వికెట్ కీపర్ కూడా ఇంతవరకు చేయలేదని ఎంఎస్‍కే ప్రసాద్ అన్నారు. టెస్టుల్లో అతడి స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లో పంత్ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో ఎన్నో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‍ను గెలిపించాడు. యాక్సిడెంట్ గాయాల నుంచి పంత్ ప్రస్తుతం కోలుకుంటుండగా.. ప్రస్తుతం వికెట్ కీపర్లుగా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ ఉన్నారు. అయితే, తుది జట్టులో కేఎస్ భరత్‍కే ఛాన్స్ దక్కే అవకాశం ఉందని ఎంఎస్‍కే అన్నారు.

“సూటిగా చెప్పాలంటే భరత్‍ను ఎంపిక చేయాలి. ముఖ్యంగా విదేశీ గడ్డపై రిషబ్ పంత్ స్థానాన్ని భర్తీ చేయాలంటే చాలా కష్టం. ఇంగ్లండ్, సౌత్ఆఫ్రికా, ఆస్ట్రేలియా మూడు దేశాల్లో ఏ భారత వికెట్ కీపర్ కూడా టెస్టు సెంచరీలు చేయలేదు” అని ఎంఎస్‍కే ప్రసాద్ అన్నారు.

2021 డబ్ల్యూటీసీ ఫైనల్‍లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ అనే మలుపులు తిరుగగా.. చివరికి కోహ్లీసేన పరాజయం పాలైంది.

సంబంధిత కథనం