Akash Deep: రోహిత్ శర్మ లాంటి కెప్టెన్‌ని నేను ఇప్పటి వరకు చూడలేదు, యంగ్ ఫాస్ట్ బౌలర్ ప్రశంసలు
Rohit Sharma Captaincy: బంగ్లాదేశ్‌తో చెపాక్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. కాన్పూర్‌లో రెండో టెస్టుకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మపై ఇటీవల భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ ఫాస్ట్ బౌలర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
India vs Bangladesh 2nd Test: యంగ్ ప్లేయర్లని జట్టులోకి తీసుకుని వారికి తగిన అవకాశాలను ఇస్తూ కెరీర్ తొలినాళ్లలో వారిలో ఆత్మవిశ్వాసం నింపడంలో కెప్టెన్ రోహిత్ శర్మ దిట్ట. 2022లో భారత జట్టు పగ్గాలు అందుకున్న 37 ఏళ్ల రోహిత్ శర్మ.. టీమ్‌లోని యువ క్రికెటర్లకి అన్నయ్యలా మారిపోయాడు.
ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ తాజాగా రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘రోహిత్ భయ్యా సారథ్యంలో ఆడటం నా అదృష్టం. అతను చాలా డిఫరెంట్ కెప్టెన్. ప్లేయర్లని అర్థం చేసుకునే అతని లాంటి కెప్టెన్‌ను నేను ఇప్పటి వరకు చూడలేదు’’ అని దేశవాళీలో సుదీర్ఘకాలంగా బెంగాల్ టీమ్‌కి ఆడుతున్న ఆకాశ్ దీప్ వెల్లడించాడు.
రోహిత్ భయ్యా చాలా సాప్ట్
టీమ్‌లోని యంగ్ ప్లేయర్లతో పాటు సీనియర్లని కూడా రోహిత్ శర్మ సోదరుడిలా జాగ్రత్తగా చూసుకుంటాడట. టీమిండియా ప్రాక్టీస్ సెషన్, జట్టు శిబిరంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఒక కెప్టెన్‌గా అతను సృష్టించాడని, దాంతో యంగ్ ప్లేయర్లు కూడా ఈజీగా టీమ్‌తో కలిసిపోతున్నారని ఆకాశ్ దీప్ చెప్పుకొచ్చాడు.
‘‘ఇప్పటి వరకు నా కెరీర్‌లో అత్యుత్తమ కెప్టెన్ అంటే రోహిత్ శర్మనే. చాలా కూల్‌గా, నింపాదిగా ఉండే వ్యక్తి అతను ప్రతి ఆటగాడి విషయంలోనూ చాలా సాప్ట్‌గా ఉంటాడు. ఏదైనా సమస్య ఎదురైనా స్నేహితుడిలా, సోదరుడిలా అతను డీల్ చేసే విధానం చూస్తే ఆశ్చర్యపోతారు’’ అని ఆకాశ్ దీప్ గుర్తు చేసుకున్నాడు.
నోబాల్‌తో వికెట్ చేజారగానే
ఈ బెంగాల్ పేసర్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేశాడు. కానీ ఆ బంతి నోబాల్‌గా తేలడంతో టీమిండియాకి వికెట్ చేజారింది. అయినప్పటికీ రోహిత్ శర్మ వచ్చి మాటతో ఆత్మవిశ్వాసం నింపి భరోసా కల్పించినట్లు ఈ 27 ఏళ్ల యంగ్ పేసర్ వెల్లడించాడు.
‘‘నో బాల్ తర్వాత రోహిత్ భయ్యా నా దగ్గరికి వచ్చి భరోసా కల్పించాడు. ఆ నో బాల్‌ను వదిలేసి గేమ్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు. కానీ ఒక బౌలర్‌గా ఆ ఘటనను అంత సులువుగా మర్చిపోలేను' అని ఆకాశ్ చెప్పుకొచ్చాడు.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో బంతితో ఆకాశ్ దీప్ ఆశ్చరకర ప్రదర్శనని కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్‌ని కట్టడి చేశాడు. దాంతో ఈ నెల 27 నుంచి కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండో టెస్టులోనూ అతనికి చోటు దక్కింది.
ఆకాశ్ వేసింది 11 ఓవర్లే
బంగ్లాదేశ్‌పై చెపాక్ టెస్టులో ఆకాశ్ దీప్‌పై ఒత్తిడి పడకుండా రోహిత్ శర్మ జాగ్రత్త తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 5 ఓవర్లే అతనితో బౌలింగ్ చేయించాడు. అయినప్పటికీ ఆ 5 ఓవర్లలోనే 19 పరుగులిచ్చి 2 వికెట్లని ఈ యంగ్ పేసర్ పడగొట్టాడు.
రెండో ఇన్నింగ్స్‌లో ఆకాశ్ వేసింది కేవలం 6 ఓవర్లు మాత్రమే. పిచ్ స్పిన్నర్లకి అనుకూలంగా మారడంతో ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, సిరాజ్‌తో పదేసి ఓవర్ల చొప్పున బౌలింగ్ చేయించిన రోహిత్ శర్మ.. అశ్విన్‌తో 21, జడేజాతో 16 ఓవర్లు వేయించాడు. ఓవరాల్‌గా చెపాక్ టెస్టులో ఆకాశ్ దీప్ వేసింది 11 ఓవర్లు మాత్రమే. అయినప్పటికీ తన పేస్‌తో ఈ యంగ్ పేసర్ ఆకట్టుకున్నాడు.