Gavaskar on Ashwin: రోహిత్.. అశ్విన్‌కు టీమ్‌ను లీడ్ చేసే అవకాశం ఇవ్వు: గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Gavaskar on Ashwin: ఇంగ్లండ్ తో మూడో టెస్టులో టీమిండియా విజయం దాదాపు ఖాయమని భావిస్తున్న మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నాలుగో టెస్టులో టీమ్ ను లీడ్ చేసే అవకాశం అశ్విన్ కు ఇవ్వాలని రోహిత్ ను కోరడం గమనార్హం.
Gavaskar on Ashwin: టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ తో సిరీస్ లో విజయాల్లో అశ్విన్ పోషిస్తున్న పాత్ర, చివరి టెస్టులో అరుదైన మైలురాయి అందుకోబోతుండటానికి గౌరవంగా అతనికి నాలుగో టెస్టులో ఫీల్డ్ లోకి టీమ్ ను లీడ్ చేసే అవకాశం ఇవ్వాలని రోహిత్ ను కోరడం విశేషం. ఇంగ్లండ్ తో ధర్మశాలలో జరగబోయే ఐదో టెస్టు అశ్విన్ కు 100వ టెస్ట్ కానుంది.
100వ టెస్టులో అశ్విన్‌కు అరుదైన గౌరవం
అశ్విన్ కు ఇంగ్లండ్ తో సిరీస్ ప్రత్యేకంగా మారింది. ఈ సిరీస్ లోనే అతడు 500 టెస్టు వికెట్లు పూర్తి చేశాడు. ఇంగ్లండ్ పై 100 వికెట్లు తీసిన ఏకైక ఇండియన్ బౌలర్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు ధర్మశాలలో తన 100వ టెస్ట్ ఆడబోతున్నాడు. దీంతో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ సలహా ఇచ్చాడు. ఫీల్డ్ లోకి అశ్విన్ టీమ్ ను లీడ్ చేసే అవకాశం ఇవ్వాలని సన్నీ చెబుతున్నాడు.
మూడో రోజు ఆట తర్వాత అశ్విన్ తో గవాస్కర్ మాట్లాడాడు. "ఇండియా రేపు (సోమవారం) గెలుస్తుంది. ధర్మశాలకు వెళ్తుంది. అక్కడ రోహిత్ టీమ్ ను లీడ్ చేసే అవకాశం నీకు ఇస్తాడని ఆశిస్తున్నాను. ఇండియన్ క్రికెట్ కు ఇన్నాళ్లుగా నువ్వు అందించిన సేవలకు అది మంచి గౌరవం అవుతుంది" అని అశ్విన్ తో గవాస్కర్ అన్నాడు. దీనిపై అశ్విన్ స్పందించాడు.
"సన్నీ భాయ్.. మీరు చాలా ఉదారంగా మాట్లాడారు. నేను ఇలాంటి వాటి గురించి ఆలోచించను. వాటన్నింటినీ దాటి వచ్చేశాను. జట్టులో ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. ఇది ఎన్నాళ్లు సాగితే నేను అంత సంతోషంగా ఉంటాను" అని అశ్విన్ అనడం గమనార్హం.
అశ్విన్ అరుదైన ఘనత
టెస్టుల్లో 100 మ్యాచ్ లు ఆడటం అనేది చాలా అరుదుగా దక్కే అవకాశం. ఇప్పుడు ధర్మశాలలో జరగబోయే చివరి టెస్టు అశ్విన్ కు 100వ టెస్ట్ కానుంది. ఈ ఘనత సాధించబోతున్న 14వ ఇండియన్ క్రికెటర్ గా అశ్విన్ నిలవనున్నాడు. రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్ట్ అతనికి 99వ టెస్ట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసుకొని దీనిని మరుపురానిదిగా మలచుకున్నాడు.
ఈ మ్యాచ్ లో టీమ్ విజయంపైనే తాను దృష్టి సారించినట్లు అశ్విన్ స్పష్టం చేశాడు. ఇక్కడే సిరీస్ గెలవాలని, ఆ విజయంలో తాను పాలుపంచుకోవడం తన వ్యక్తిగత మైలురాళ్ల కంటే ఎంతో గొప్ప విషయం అవుతుందని అశ్విన్ అన్నాడు. నిజానికి గవాస్కర్ చెప్పినట్లు అశ్విన్ 100వ టెస్టులో రోహిత్ ఇలాంటి గౌరవం ఇవ్వడం సముచితమే అవుతుంది.
ఇండియన్ క్రికెట్ కు అశ్విన్ అందించిన సేవలను అలాంటివి. లెజెండరీ అనిల్ కుంబ్లే తర్వాత టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న ఇండియన్ బౌలర్ అశ్విన్. దశాబ్దానికిపైగా ఇండియన్ క్రికెట్ పై చెరగని ముద్ర వేసిన అశ్విన్ ఇప్పుడు 100వ టెస్టు అనే మరో మైలురాయిని అందుకోబోతున్నాడు.