Rohit Sharma: నంబర్ వన్ ర్యాంకు - రోహిత్ శర్మ తీరని కల ఇదొక్కటేనటా!
Rohit Sharma: టీమిండియా దిగ్గజ ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకరు. వన్డేలతో పాటు టెస్టులు, టీ20ల్లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో నిలవలేకపోయాడు.
Rohit Sharma: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ప్లేస్‌ను సొంతం చేసుకోవడం ఏ క్రికెటర్‌కు అయినా గర్వకారణంగా ఉంటుంది. ఫార్మెట్ ఏదైనా నంబర్ వన్ ప్లేస్‌లో ఉండే కిక్కే వేరు. ఈ నంబర్ వన్ ప్లేస్‌లో నిలవడం కోసం ప్రతి క్రికెటర్ కష్టపడుతుంటాడు. స్టార్ ప్లేయర్లకు నంబర్ వన్ ర్యాంకింగ్ దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
టీమిండియా దిగ్గజ ఆటగాడు కోహ్లి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 1258 రోజుల పాటు నంబర్ వన్ ర్యాంకులో నిలిచాడు. 2017 నుంచి 2021లో వరకు నాలుగేళ్ల పాటు నంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగాడు. సచిన్, ధోనీ నుంచి గిల్ వరకు టీమిండియా నుంచి చాలా మంది బ్యాట్స్‌మెన్స్, బౌలర్స్ వివిధ ఫార్మెట్స్‌లో నంబర్ వన్ ర్యాంకులో నిలిచి రికార్డ్ క్రియేట్ చేశారు.
రోహిత్ కల తీరలేదు...
టీమ్ ఇండియా ప్రజెంట్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా నంబర్ వన్ ర్యాంకు దక్కించుకోలేదు. టెస్టులు, వన్డేలతో పాటు టీ20లలో కూడా రోహిత్ నంబర్ వన్ ప్లేస్‌లో నిలవలేకపోయాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు, పదివేలకు పైగా పరుగులు…అది కూడా అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను పూర్తిచేసిన ప్లేయర్‌గా రికార్డులు...అన్ని ఉన్నా రోహిత్‌కు మాత్రం నంబర్ వన్ ర్యాంకు అందని ద్రాక్షగానే మిగిలింది.
టెస్టులు, టీ20ల్లో కూడా ఎప్పుడూ రోహిత్ నంబర్ వన్ ర్యాంకును చేరుకోలేకపోయాడు. ఇంటర్‌నేషనల్ క్రికెట్‌లో మూడు ఫార్మెట్స్ కలిపి 400లకుపైగా మ్యాచులు ఆడి నంబర్ వన్ ర్యాంకు దక్కించుకోలేకపోయిన క్రికెటర్లలో ఒకరిగా రోహిత్ శర్మ నిలిచాడు.
యువరాజ్ కూడా...
రోహిత్ శర్మ తో పాటు ఈ జాబితాలో టీమిండియా నుంచి యువరాజ్ సింగ్, హర్భజన్‌సింగ్ కూడా ఉన్నారు. యువరాజ్ సింగ్ వన్డే ప్రపంచకప్‌తో పాటు టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆల్‌రౌండర్‌గా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాల్ని తెచ్చిపెట్టాడు.
అద్భుతమైన రికార్డులు ఉన్నా కెరీర్‌లో ఒక్కసారి కూడా నంబర్ వన్ ర్యాంకుకు చేరుకోలేకపోయాడు. టీమిండియా తరఫున 236 వన్డేలు, 103 టెస్ట్‌లు ఆడిన స్పిన్నర్ హర్భజన్ సింగ్ నంబర్ వన్ కల మాత్రం తీరకుండానే కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. కనీసం ఆల్‌రౌండర్ల జాబితాలో కూడా హర్భజన్ ఈ ఘనతను చేరుకోలేకపోయాడు.
రోహిత్ శర్మతో పాటు...
వన్డే, టెస్టులతో పాటు టీ20లు కలిపి నాలుగు వందలకుపైగా మ్యాచ్‌లు ఆడి కూడా కనీసం ఒక్కసారి కూడా నంబర్ వన్ ర్యాంకు చేరుకోని క్రికెటర్లలో రోహిత్ శర్మతో పాటు మరికొందరు ఫారిన్ క్రికెటర్లు ఉన్నారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ మూడు ఫార్మెట్స్ కలిపి 450 మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఏ ఫార్మెట్‌లో అతడు నంబర్ వన్ ర్యాంకు అందుకోలేకపోయాడు. టేలర్‌తో పాటు ముష్పికర్ రహిమ్ (458 మ్యాచ్‌లు), షోయబ్ మాలిక్ (446 మ్యాచ్‌లు) కూడా నాలుగు వందలకుపై ఇంటర్‌నేషనల్ మ్యాచ్‌లు ఆడిన నంబర్ వన్ ర్యాంకు మాత్రం వారికి కలగానే మిగిలింది.
టాపిక్