Team India Records: ఒక్క రోజులోనే టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా బ్రేక్ చేసిన రికార్డులు ఇవే.. కాన్పూర్‌లో గెలుస్తుందా?-team india creates many records on day 4 of kanpur test against bangladesh rohit sharma yashasvi jaiswal kl rahul ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India Records: ఒక్క రోజులోనే టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా బ్రేక్ చేసిన రికార్డులు ఇవే.. కాన్పూర్‌లో గెలుస్తుందా?

Team India Records: ఒక్క రోజులోనే టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా బ్రేక్ చేసిన రికార్డులు ఇవే.. కాన్పూర్‌లో గెలుస్తుందా?

Hari Prasad S HT Telugu
Sep 30, 2024 09:05 PM IST

Team India Records: ఒక్క రోజులోనే టీమిండియా టెస్టు క్రికెట్ లో ఎన్నో రికార్డులను తిరగరాసింది. బంగ్లాదేశ్ తో రెండో టెస్టు డ్రాగా ముగియడం ఖాయం అనుకుంటున్న వేళ టీ20 స్టైల్లో ఆడి మ్యాచ్ కు జీవం పోయడంతోపాటు పలు రికార్డులను కూడా ఇండియన్ టీమ్ సొంతం చేసుకుంది.

ఒక్క రోజులోనే టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా బ్రేక్ చేసిన రికార్డులు ఇవే.. కాన్పూర్‌లో గెలుస్తుందా?
ఒక్క రోజులోనే టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా బ్రేక్ చేసిన రికార్డులు ఇవే.. కాన్పూర్‌లో గెలుస్తుందా? (AFP)

Team India Records: బంగ్లాదేశ్ తో కాన్పూర్ లో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా నాలుగో రోజు చెలరేగిపోయింది. ఆడుతున్నది టెస్టా, టీ20యా అన్న అనుమానం కలిగేలా మన బ్యాటర్లు చెలరేగిన వేళ ఎన్నో రికార్డులు సొంతమయ్యాయి. డ్రా ఖాయం అనుకుంటున్న సమయంలో ఇప్పుడు టీమిండియా విజయంపై అభిమానులు ఆశలు రేగుతున్నాయి.

నాలుగో రోజు టీమిండియా రికార్డులు ఇవీ

బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో టీమిండియా అనూహ్యంగా చెలరేగి మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం మార్చేసింది. ఈ క్రమంలో రోహిత్ సేన క్రియేట్ చేసిన రికార్డులు ఏంటో చూడండి.

- టెస్టు క్రికెట్ లో ఇండియా ఒకే రోజు ఫాస్టెస్ట్ 50, 100, 150, 200 రికార్డులను సొంతం చేసుకోవడం విశేషం. ఇండియన్ టీమ్ కేవలం 18 బంతుల్లోనే 50 పరుగుల మార్క్ అందుకుంది. ఇది టెస్టుల్లో ఓ టీమ్ సాధించిన ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు. గతంలో 26 బంతులతో ఇంగ్లండ్ పేరిట ఈ రికార్డు ఉండేది. రోహిత్, యశస్వి జోడీ ఈ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది.

- ఇక టెస్టు క్రికెట్ లో ఫాస్టెస్ట్ 100 రికార్డు కూడా నమోదైంది. ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ కేవలం 10.1 ఓవర్లలోనే ఆ మార్క్ అందుకుంది. గతంలో వెస్టిండీస్ పై ఇండియన్ టీమే 12.2 ఓవర్లలో నమోదు చేసిన రికార్డు మెరుగైంది.

- టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 150, 200 స్కోర్లు కూడా నమోదయ్యాయి. టీమిండియా 18.2 ఓవర్లలో 150, 24.2 ఓవర్లలో 200 స్కోర్లను అందుకోవడం విశేషం. గతంలో ఆస్ట్రేలియా 29.1 ఓవర్లలో 200 చేయగా.. ఇండియా ఇప్పుడు అంతకు సుమారు 5 ఓవర్ల ముందే ఆ మార్క్ చేరుకుంది.

- రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ జోడీ తొలి వికెట్ కు 55 పరుగులు జోడించింది. టెస్టు క్రికెట్ లో కనీసం 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన వాళ్లలో అత్యంత వేగంగా అంటే ఓవర్ కు 14.34 పరుగులతో ఈ జోడీ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. గతంలో ఇంగ్లండ్ జోడీ బెన్ డకెట్, బెన్ స్టోక్స్ 11.86 సగటుతో 87 రన్స్ చేసింది.

టీమిండియా గెలుస్తుందా?

కాన్పూర్ టెస్టులో తొలి రోజు 35 ఓవర్లు మాత్రమే సాధ్యమైంది. తర్వాత రెండు, మూడు రోజుల్లో ఒక్క బంతి కూడా పడలేదు. దీంతో ఈ మ్యాచ్ డ్రా అవడం ఖాయమని భావించారు.

అయితే నాలుగో రోజు టీమిండియా ఆడిన తీరుతో మ్యాచ్ పై గెలుపు ఆశలు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 233 రన్స్ కు ఆలౌట్ కాగా.. ఇండియన్ టీమ్ వేగంగా 285 పరుగులు చేసి 52 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 26 పరుగులు చేసింది. ఇప్పటికీ 26 పరుగులు వెనుకబడే ఉంది. ఐదో రోజు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.