Team India Record: భారత్ 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఫస్ట్ టైమ్.. ఒక్కటి ఎక్కువైంది!
IND vs BAN 1st Test Records: భారత్ టెస్టు జట్టు గత 92 ఏళ్లుగా ఊరిస్తున్న టెస్టు రికార్డ్‌ని ఎట్టకేలకి సగర్వంగా అందుకుంది. బంగ్లాదేశ్‌పై చెపాక్ టెస్టులో గెలిచిన టీమిండియా.. టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతని సొంతం చేసుకుంది.
India vs Bangladesh 1st Test Records: బంగ్లాదేశ్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న టీమిండియా.. 92 ఏళ్లుగా ఊరిస్తున్న ఓ అరుదైన రికార్డ్‌ని అందుకుంది. మ్యాచ్‌లో 515 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ టీమ్ ఈరోజు తొలి సెషన్‌లోనే 234 పరుగులకి ఆలౌటైంది.
తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టిన వెటరన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.ఇక రెండో టెస్టు మ్యాచ్ సెప్టెంబరు 27 నుంచి కాన్పూర్ వేదికగా జరగనుంది.
92 ఏళ్లుగా నిరీక్షణ
1932 నుంచి టెస్టు క్రికెట్ ఆడుతున్న భారత్ జట్టు ఈ 92 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఈరోజు వరకు 580 టెస్టులు ఆడింది. ఇందులో 179 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 178 టెస్టుల్లో ఓడిపోయింది. ఇక మిగిలిన 223 మ్యాచ్‌ల్లో ఒకటి టై.. మిగిలిన 222 డ్రాగా ముగిశాయి. అయితే.. ఈ 92 ఏళ్లలో కనీసం ఒక్కసారి కూడా టెస్టుల్లో ఓటముల కంటే ఎక్కువ విజయాల్ని భారత్ నమోదు చేయలేకపోయింది.
ఈరోజు చెపాక్‌లో 179వ టెస్టు విజయాన్ని అందుకున్న టీమిండియా ఆ రికార్డ్‌ని అందుకుంది. ఓవరాల్‌గా టెస్టుల్లో ఓటముల కంటే విజయాల్ని ఎక్కువ నమోదు చేయాలన్న భారత్ 9 దశాబ్దాల కల ఎట్టకేలకి నెరవేరింది.
నాలుగు జట్ల సరసన సగర్వంగా భారత్
టెస్టుల్లో ఓటముల కంటే విజయాలు ఎక్కువ ఉన్న అరుదైన రికార్డ్‌లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ మాత్రమే ఉంగా.. తాజాగా ఆ లిస్ట్‌లో భారత్ కూడా చోటు దక్కించుకుంది. ఈ రికార్డ్‌లో ఆస్ట్రేలియా టాప్‌లో ఉంది. ఆ జట్టు ఇప్పటి వరకు 866 టెస్టులు ఆడగా.. ఇందులో 414 గెలుపు, 232 ఓటములు ఉన్నాయి. ఈ లిస్ట్‌లో ఇంగ్లాండ్ టీమ్ 397 విజయాలు, 325 ఓటములతో రెండో స్థానంలో ఉంది. ఆ టీమ్ ఇప్పటి వరకు 1077 టెస్టులు ఆడటం విశేషం.
ఈ లిస్ట్‌లో దక్షిణాఫ్రికా టీమ్ 179 గెలుపు, 161 ఓటములతో మూడో స్థానంలో ఉంది. సఫారీల జట్టు ఇప్పటి వరకు 466 టెస్టులు ఆడింది. పాకిస్థాన్ కూడా ఈ రికార్డ్‌లో నాలుగో స్థానంలో ఉంది. అయితే.. ఆ జట్టు గెలుపు, ఓటముల వ్యత్యాసం చాలా తక్కువగానే ఉంది. 458 టెస్టులు ఆడిన పాక్ 148 మ్యాచ్‌ల్లో గెలిచి, 144 టెస్టుల్లో ఓడింది.
టీమిండియా నెక్ట్స్ సిరీస్‌లు
భారత్ జట్టు ఈ ఏడాదిలో బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు (సెప్టెంబరు 27న, కాన్పూర్) ఆడిన తర్వాత. అక్టోబరు-నవంబరు నెలలో మూడు టెస్టులు, ఆస్ట్రేలియాతో ఆ దేశ గడ్డపైనే ఈ ఏడాది నవంబరు నుంచి ఐదు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. కాబట్టి ఈ రికార్డ్‌లో కొనసాగాలంటే భారత్ జట్టు కాన్పూర్ టెస్టుతో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై కూడా సత్తాచాటాల్సి ఉంటుంది.