Ind vs Ban 3rd T20: ఉప్పల్లో ఇండియా, బంగ్లాదేశ్ మూడో టీ20 మ్యాచ్.. టికెట్ల రేట్లు, అమ్మకం వివరాలు ఇవే
Ind vs Ban 3rd T20: ఉప్పల్లో మరోసారి ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరగబోతోంది. ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరగబోయే మూడో టీ20 కోసం టికెట్ల రేట్లు ఎలా ఉన్నాయి? టికెట్ సేల్స్ ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి? వంటి వివరాలు ఇక్కడ చూడండి.
Ind vs Ban 3rd T20: ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరగబోయే మూడో టీ20 కోసం హైదరాబాద్ లోని ఉప్పల్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ కోసం శనివారం (అక్టోబర్ 5) నుంచే టికెట్ల అమ్మకాలు ప్రారంభం కానున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు వెల్లడించారు.
ఉప్పల్లో ఇండియా, బంగ్లాదేశ్ మూడో టీ20
ఉప్పల్ స్టేడియంలో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ అక్టోబర్ 12న జరగనుంది. దసరా రోజే జరగబోయే ఈ మ్యాచ్ కోసం శనివారం (అక్టోబర్ 5) నుంచి టికెట్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
ఈ మ్యాచ్ టికెట్లు పేటీఎం ఇన్‌సైడర్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మధ్యాహ్నం 12.30 గంటలకు టికెట్ సేట్స్ ప్రారంభమవుతాయని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు వెల్లడించారు.
టికెట్ల ధరలు ఇలా..
ఉప్పల్లో జరగబోయే ఇండియా, బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ కోసం టికెట్ల ధరలను కూడా నిర్ణయించారు. ఈ మ్యాచ్ కు కనీస టికెట్ ధర రూ.750. ఇక గరిష్ఠంగా రూ.15 వేల టికెట్లు కూడా ఉన్నాయి. ఇక శనివారం (అక్టోబర్ 5) ఆన్‌లైన్లో టికెట్లను కొనుగోలు చేసిన వాళ్లు ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు జింఖానా గ్రౌండ్ లో ఫిజికల్ టికెట్లను తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ టికెట్లు తీసుకోవచ్చు. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డుతోపాటు ఆన్లైన్ టికెట్ ప్రింటౌట్ చూపిస్తే టికెట్లు ఇస్తారు. ఈ మ్యాచ్ కు కేవలం ఆన్‌లైన్ లోనే టికెట్లు అమ్ముతున్నామని, బయట కౌంటర్ల ద్వారా ఉండబోదని కూడా హెచ్‌సీఏ అధ్యక్షుడు స్పష్టం చేశారు.
టీ20 మ్యాచ్‌కు భారీ భద్రత
ఇక ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరగబోయే టీ20 మ్యాచ్ కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం (అక్టోబర్ 4) ఉప్పల్ స్టేడియంలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు భద్రతా ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. డీసీపీలు, ఏసీపీలు, జీహెచ్ఎంసీ, ఫైర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ మ్యాచ్ నిర్వహణ సజావుగా జరగడానికి అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సందర్భంగా సుధీర్ బాబు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇదొక గొప్ప అవకాశం అని, ఎన్ని సవాళ్లు ఎదురైనా ఈ మ్యాచ్ కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
ఇప్పటికే బంగ్లాదేశ్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మూడు టీ20ల సిరీస్ ఆదివారం (అక్టోబర్ 6) నుంచి ప్రారంభం కానుంది. సిరీస్ లో భాగంగా జరగబోయే చివరిదైన మూడో టీ20 హైదరాబాద్ లో జరగనుంది.