IND vs BAN 3rd T20: ఆఖరి మ్యాచ్ కోసం హైదరాబాద్‌కి ఒకే విమానంలో భారత్, బంగ్లాదేశ్ ప్లేయర్లు, కానీ వేర్వేరు హోటల్స్
India vs Bangladesh 3rd T20: ఆఖరి టీ20 మ్యాచ్ కోసం భారత్, బంగ్లాదేశ్ ప్లేయర్లు హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. భారత్ గడ్డపై వరుసగా రెండు టెస్టులు, రెండు టీ20లు ఆడి టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్.. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా పోటీనిస్తుందేమో చూడాలి.
భారత్, బంగ్లాదేశ్ మధ్య సిరీస్ చరమాంకానికి చేరుకుంది.సెప్టెంబరు 19 నుంచి ఇప్పటికే రెండు టెస్టులు, రెండు టీ20లు ఆడిన ఈ రెండు జట్లు.. ఆఖరి టీ20 మ్యాచ్‌ను హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడబోతున్నాయి. ఈ మేరకు ఇరు జట్ల ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ హైదరాబాద్‌కి చేరుకున్నారు.
ఇప్పటికే జరిగిన మ్యాచ్‌లు.. ఫలితాలు
సెప్టెంబరు 19 నుంచి చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించిన భారత్ టెస్టు జట్టు.. ఆ తర్వాత సెప్టెంబరు 27 నుంచి కాన్పూర్‌లో జరిగిన రెండో టెస్టులోనూ 7 వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో రెండు టెస్టుల సిరీస్ 2-0తో భారత్ సొంతమైంది.
అనంతరం అక్టోబరు 6న తొలి టీ20 మ్యాచ్‌కి గ్వాలియర్ ఆతిథ్యం ఇవ్వగా.. ఆ మ్యాచ్‌లో భారత్ జట్టు అలవోకగా 7 వికెట్ల తేడాతో గెలిచింది. రెండు రోజుల క్రితం ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లోనూ భారత్ జట్టు 86 పరుగుల తేడాతో గెలిచి మూడు టీ20ల సిరీస్‌లో ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో ఉంది.
ఆ ఇద్దరిలో ఒకరికి రెస్ట్
ఉప్పల్‌లో శనివారం (అక్టోబరు 12) రాత్రి 7 గంటలకి ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది. వాస్తవానికి ఇప్పటికే సిరీస్‌ను చేజిక్కించుకున్న భారత్ జట్టుకి ఇది నామమాత్రపు మ్యాచ్. అయినప్పటికీ బంగ్లాదేశ్ టీమ్‌ను తేలిగ్గా తీసుకుని సొంతగడ్డపై చేదు అనుభవాన్ని ఎదుర్కొనేందుకు టీమిండియా సిద్ధంగా లేదు.
టీమ్‌లో ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి. కానీ.. జట్టు కూర్పు దెబ్బతినే విధంగా ఉండదని టీమిండియా మేనేజ్‌మెంట్ సంకేతాలు ఇచ్చింది. ఫాస్ట్ బౌలర్లు మయాంక్ యాదవ్ లేదా అర్షదీప్ సింగ్‌లో ఒకరికి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే ఆ నిర్ణయం తీసుకోనుంది.
ఒకే విమానంలో వచ్చినా
ఢిల్లీ నుంచి ఒకే విమానంలో భారత్, బంగ్లాదేశ్ ప్లేయర్లు హైదరాబాద్‌కి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న ప్లేయర్లకి భారత్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ భద్రత నడుమ టీమ్స్‌ను వేర్వేరు హోటల్స్‌కి తరలించారు. భారత్ క్రికెటర్లకి పార్క్ హయత్, బంగ్లాదేశ్ ప్లేయర్లకి తాజ్ కృష్ణా హోటల్‌లో బసని ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ టీ20తో భారత్ గడ్డపై బంగ్లాదేశ్ పర్యటన ముగియనుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ఆడినా.. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన బంగ్లాదేశ్ చివరి టీ20లో ఎలా ఆడుతుందో చూడాలి. ఇదే బంగ్లాదేశ్ టీమ్ సరిగ్గా రెండు నెలల క్రితం పాకిస్థాన్ టీమ్‌ను దాని సొంతగడ్డపైనే రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో చిత్తు చేయడం గమనార్హం.