Samshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు-bomb threat to shamshabad airport followed by another mail asking for forgiveness ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Samshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

Samshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

HT Telugu Desk HT Telugu
Aug 29, 2023 11:39 AM IST

Samshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ వచ్చిన మెయిల్ భద్రతా సిబ్బందిని ఉరుకులు పెట్టించింది.ఎయిర్‌పోర్ట్‌ అణువణువున క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మతిస్థిమితం లేని తన కుమారుడు మెయిల్ చేశాడంటూ మరో మెయిల్ రావడంతో అదికారులు ఖంగుతిన్నారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు (ఫైల్)
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు (ఫైల్) (REUTERS)

Samshabad Airport: శంషాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. సోమవారం ఉదయం కస్టమర్‌ సపోర్ట్‌ మెయిల్ ఐడీకి వచ్చిన మెయిల్‌తో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఈ విషయాన్నిఎయిర్‌ పోర్ట్ భద్రతా సిబ్బంది దృష్టికి తీసుకు వెళ్లడంతో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఎయిర్‌పోర్ట్‌లో బాంబు పెట్టామని.. సాయంత్రం 7 గంటలకు అది పేలుతుందంటూ సోమవారం ఉదయం 11.50 గంటలకు ఓ వ్యక్తి కంట్రోల్‌ రూమ్‌కు మెయిల్‌ పంపాడు. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు ఎయిర్‌పోర్టు మొత్తం తనిఖీలు నిర్వహించారు. ఎయిర్‌పోర్టులో దిగిన విమానాల లగేజీ, ప్యాసింజర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరకు ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకున్నారు.

బెదిరింపు మెయిల్ వచ్చిన కొద్దిసేపటికి మరో ఐడీతో ఎయిర్‌పోర్టు అధికారులకు ఇంకో మెయిల్‌ వచ్చింది. పొరపాటు జరిగిందని.. తన కుమారుడు ఫోన్‌తో ఆడుకుంటూ మెయిల్‌, సందేశాలు పెట్టాడని అజ్ఞాత వ్యక్తి అందులో పేర్కొన్నారు. తనను క్షమించాలంటూ కోరాడు. దీనిపై స్థానిక పోలీసులకు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. మెయిల్‌ ఆధారంగా సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ల్యూట్‌@జీమెయిల్‌ నుంచి ఎయిర్‌ పోర్ట్ కస్టమర్‌ సపోర్ట్‌ మెయిల్ ఐడీకి సందేశాలు వచ్చినట్టు గుర్తించారు. అగంతకులు పంపిన మెయిల్స్ పశ్చిమ బెంగాల్‌ ప్రాంతం నుంచి వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుల్ని గుర్తించే ప్రయత్నాలు కొనసాగిస్తామని ఎయిర్‌పోర్ట్ పోలీసులు స్పష్టం చేశారు.

Whats_app_banner