IND vs AUS 2024: టీమిండియాకి ఊహించని దెబ్బ.. ఆస్ట్రేలియాతో ఒక టెస్టుకి రోహిత్ శర్మ దూరం?-indian skipper rohit sharma may miss first test of border gavaskar trophy in australia ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus 2024: టీమిండియాకి ఊహించని దెబ్బ.. ఆస్ట్రేలియాతో ఒక టెస్టుకి రోహిత్ శర్మ దూరం?

IND vs AUS 2024: టీమిండియాకి ఊహించని దెబ్బ.. ఆస్ట్రేలియాతో ఒక టెస్టుకి రోహిత్ శర్మ దూరం?

Galeti Rajendra HT Telugu
Oct 11, 2024 05:28 AM IST

Rohit Sharma News: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టులను భారత్ జట్టు ఆడనుంది. కానీ ఇందులో ఒక టెస్టు మ్యాచ్‌కి రోహిత్ శర్మ దూరంగా ఉండబోతున్నట్లు బీసీసీఐ తెలిపింది.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (AFP)

ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్టు సిరీస్ ముంగిట భారత్ జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నవంబరులో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఆడటానికి ఆస్ట్రేలియా గడ్డపైకి వెళ్లనున్న భారత్ టెస్టు జట్టు అక్కడ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనుంది. కానీ.. ఈ సిరీస్‌లో ఒక టెస్టుకి తాను అందుబాటులో ఉండనని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి రోహిత్ శర్మ సమాచారం అందించాడు.

రెండింటిలో ఒకటికి దూరం

నవంబర్ 22 నుంచి పెర్త్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్‌కి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండనున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ శర్మ పెర్త్ టెస్టుకి అందుబాటులో ఉండడని తెలుస్తోంది.

ఒకవేళ పెర్త్ టెస్టు ఆడితే అడిలైడ్‌ వేదికగా డిసెంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే రెండో మ్యాచ్‌కి దూరమవుతాడని బీసీసీఐ చెప్పుకొచ్చింది. కానీ స్పష్టమైన కారణాల్ని మాత్రం వెల్లడించలేదు. అయితే.. తొలి రెండు టెస్టుల్లో ఒక్క మ్యాచ్ మాత్రం రోహిత్ శర్మ ఆడడు అని క్లారిటీగా తేలిపోయింది.

2014-15 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ కంగారూలకి చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ ఆరంభ మ్యాచ్‌లకి దూరమవడం భారత్ జట్టుకి ఇబ్బందే.

ఓపెనర్లుగా ఎవరు?

సిరీస్ ప్రారంభానికి ముందే వ్యక్తిగత సమస్యలు ఒకవేళ పరిష్కారమైతే అతడు మొత్తం ఐదు టెస్టులు ఆడగలడు. రాబోయే రోజుల్లో దీని గురించి మాకు మరింత సమాచారం అందుతుంది అని బీసీసీఐ తెలిపింది.

ఇటీవల బంగ్లాదేశ్‌ను రెండు టెస్టుల సిరీస్‌లో 2-0తో చిత్తు చేసిన భారత్ టెస్టు జట్టు.. అక్టోబరు 16 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. ఈ మేరకు ఇప్పటికే న్యూజిలాండ్ టెస్టు జట్టుని కూడా ప్రకటించారు.

ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడకపోతే అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకోవచ్చు. అయితే.. ఓపెనర్లు శుభమన్ గిల్, యశస్వి జైశ్వాల్ ఆడే అవకాశం ఉంది. ఈ ఇద్దరిలో ఒకరిని తప్పించాలనుకుంటే అప్పుడు కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా ఆడించొచ్చు.

భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ పూర్తి షెడ్యూల్

మొదటి టెస్టు: నవంబర్ 22-26 (పెర్త్ స్టేడియం, పెర్త్)

రెండో టెస్టు: డిసెంబర్ 6-10 (అడిలైడ్ ఓవల్, అడిలైడ్)

మూడో టెస్టు: డిసెంబర్ 14-18 (గబ్బా, బ్రిస్బేన్)

నాలుగో టెస్టు: డిసెంబర్ 26-30 (మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్‌బోర్న్)

ఐదో టెస్టు: జనవరి 3-7 (సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ)

టెస్టు టీమ్ ప్రకటన ఆలస్యం

ఆస్ట్రేలియాతో సిరీస్‌ కోసం కాస్త ఆలస్యంగానే భారత్ జట్టుని బీసీసీఐ ప్రకటించనుంది. ఇంకా న్యూజిలాండ్‌తో తలపడే జట్టునే బీసీసీఐ ప్రకటించలేదు. ప్రస్తుతం భారత టీ20 జట్టు బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడుతుండగా.. టెస్టు టీమ్ విశ్రాంతి తీసుకుంటోంది.

Whats_app_banner