Riyan Parag No Ball: టీమిండియా బౌలర్ ఓవరాక్షన్‌పై అంపైర్ సీరియస్, నో బాల్‌గా ప్రకటించి బంగ్లాదేశ్‌కి ఫ్రీ హిట్
India vs Bangladesh T20 Controversy: బంగ్లాదేశ్‌పై రెండో టీ20లో భారత్ జట్టు గెలుపు లాంఛనమైన తర్వాత పార్ట్ టైమ్ బౌలర్లకి బౌలింగ్ చేసే ఛాన్స్‌ను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చాడు. కానీ.. రియాన్ పరాగ్ వింత యాక్షన్‌తో శిక్ష ఎదుర్కొన్నాడు.
టీమిండియా రైజింగ్ స్టార్ రియాన్ పరాగ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఢిల్లీలో జరిగిన రెండో టీ20లో వింత బౌలింగ్ యాక్షన్‌తో అంపైర్‌కి కోపం తెప్పించిన రియాన్ పరాగ్.. శిక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఏం జరిగిందంటే?
మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 221 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ తడబడి ఆరంభంలోనే వరుసగా వికెట్లు చేజార్చుకుంది. దాంతో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పార్ట్ టైమ్ బౌలర్లకి కూడా బౌలింగ్ చేసే ఛాన్స్ ఇచ్చాడు.
ఏ మ్యాచ్‌లో బౌలింగ్ చేసినా.. రియాన్ పరాగ్ చాలా వింతగా ట్రై చేస్తుంటాడు. అతని బౌలింగ్ యాక్షన్‌తో పాటు రనప్ కూడా క్రీజులోని బ్యాటర్‌ను తికమకకి గురి చేస్తుంటుంది. అలానే ఢిల్లీ టీ20లోనూ శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ స్టయిల్‌లో రియాన్ పరాగ్ బౌలింగ్ చేయాలని ట్రై చేశాడు. కానీ ఈ క్రమంలోనే అతను ఒక తప్పిదం చేశాడు.
ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో నాలుగో బంతిని మలింగ బౌలింగ్ శైలిలో విసరడానికి ప్రయత్నించాడు. దాంతో క్రీజులోని బంగ్లాదేశ్ బ్యాటర్ మహ్మదుల్లా కూడా కాస్త తికమకకి గురయ్యాడు. పేసర్ తరహాలో రనప్‌తో వచ్చిన రియాన్ పరాగ్.. బంతి విసిరే క్రమంలో ఒక పాదాన్ని వికెట్ల పక్కన ఉన్న క్రీజు వెలుపల ఉంచాడు. దాంతో వెంటనే అంపైర్ ఆ బంతిని బ్యాక్ ఫుట్ నో-బాల్‌గా ప్రకటించాడు.
ఫ్రీ హిట్ బాల్ కూడా వేస్ట్ చేసిన బంగ్లా
నోబాల్ కావడంతో బంగ్లాదేశ్‌కి ఫ్రీ హిట్ ఛాన్స్ లభించినా.. ఆ బంతిని మహ్మదుల్లా కనీసం హిట్ చేయలేకపోయాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి మెహిదీ హసన్ మిరాజ్ వికెట్ తీసిన రియాన్ పరాగ్.. ఒక వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.
భారత్ జట్టులో మొత్తం ఏడుగురు మ్యాచ్‌లో బౌలింగ్ చేయగా.. అందరికీ వికెట్లు దక్కడం గమనార్హం. భారత క్రికెట్ చరిత్రలో ఒక ఫార్మాట్ లో ఒక ఇన్నింగ్స్‌లో ఏడుగురు భారత బౌలర్లు వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి.
రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీంఇండియా నితీశ్ రెడ్డి, రింకు సింగ్ హాఫ్ సెంచరీలు బాదడంతో 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులే చేయగలిగింది. దాంతో 86 పరుగుల తేడాతో విజయం సాధించి భారత్ జట్టు మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో నిలిచింది. ఇక మిగిలిన ఆఖరి టీ20 మ్యాచ్ హైదరాబాద్‌లో శనివారం జరగనుంది.