Hardik Pandya: లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ మరో వివాదం
Hardik Pandya: ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగతోనూ హార్దిక్ పాండ్యాకు పడటం లేదా? సన్ రైజర్స్ తో మ్యాచ్ తర్వాత తనను హగ్ చేసుకోవడానికి వచ్చిన మలింగను హార్దిక్ పక్కకు తోసేసిన వీడియో వైరల్ అవుతోంది.
Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయినప్పటి నుంచీ హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేనట్లుంది. సొంత ఫ్రాంఛైజీ అభిమానులే అతన్ని హేళన చేస్తున్నారు. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓటములు, తన ఆటతీరు అంతంతమాత్రంగా ఉండటం.. రోహిత్ తో పడటం లేదన్న వార్తలు.. వీటి మధ్య తాజాగా బౌలింగ్ కోచ్ మలింగను పక్కకు తోసేసిన వీడియో కూడా తెరపైకి వచ్చింది.
హార్దిక్ పాండ్యా వెర్సెస్ మలింగ
హార్దిక్ పాండ్యాను సోషల్ మీడియాలో అభిమానులు గట్టిగానే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అతడు ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూసి మరీ ట్రోల్ చేస్తున్నారు. హార్దిక్ చేసే ప్రతి తప్పును వెతికే పనిలో ఉన్నారు. తాజాగా సన్ రైజర్స్ చేతుల్లో దారుణమైన ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగతోనూ అతనికి పడటం లేదన్నట్లుగా ఓ వీడియో తెరపైకి వచ్చింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత తనను హగ్ చేసుకోవడానికి వచ్చిన మలింగను హార్దిక్ పట్టించుకోకుండా పక్కకు తోసేస్తూ వెళ్లిపోయినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. దీంతో మలింగ కూడా అతనికి దూరంగా వెళ్లిపోయాడు. ఇక మరో వ్యక్తి షేర్ చేసిన వీడియో చూసినా హార్దిక్, మలింగ మధ్య ఏదో గట్టిగానే నడుస్తోందన్నట్లుగా అనిపిస్తుంది. అందులో బ్యాటింగ్ కు సిద్ధమవుతూ హార్దిక్ ప్యాడ్స్ కట్టుకొని రెడీగా ఉన్నాడు.
డగౌట్ లో అతని వెనుక ముంబై ఇండియన్స్ కోచ్ లు మలింగ, పొలార్డ్ కుర్చీలపై కూర్చొని ఉన్నారు. హార్దిక్ ను చూసి పొలార్డ్ లేస్తూ ఇక్కడ కూర్చోవాల్సిందిగా అడిగాడు. కానీ పక్కనే ఉన్న మలింగ అతన్ని వారిస్తూ.. నేను వెళ్లిపోతానంటూ హార్దిక్ కు ముఖం చాటేస్తూ వెళ్లిపోయాడు. ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హార్దిక్.. ఇదేనా మర్యాద?
ఈ రెండు వీడియోలు చూసిన తర్వాత హార్దిక్ పాండ్యాపై అభిమానులు మరింత మండిపడుతున్నారు. ఇప్పటికే రోహిత్ ను తప్పించి అతనికి కెప్టెన్సీ ఇవ్వడంపై గుర్రుగా ఉన్న వాళ్లకు వరుసగా పాండ్యా చేసే తప్పిదాలు కనిపిస్తున్నాయి. రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోవడం, అందులో కెప్టెన్ గా హార్దిక్ తీసుకున్నతప్పుడు నిర్ణయాలు, రెండో మ్యాచ్ లో చెత్త బ్యాటింగ్, ఇప్పుడు మలింగతో అనుచిత ప్రవర్తన.. ఇవన్నీ చూసిన ఫ్యాన్స్ హార్దిక్ ను మరింత డిఫెన్స్ లోకి నెట్టేస్తున్నారు.
మరోవైపు సన్ రైజర్ష్ తో మ్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్ రెండుగా చీలిపోయిందని, రోహిత్, హార్దిక్ వర్గాలుగా ప్లేయర్స్ విడిపోయారనీ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2024లో రానున్న మ్యాచ్ లు హార్దిక్ కు మరింత సవాలుగా మారనున్నాయి. ఫీల్డ్ లో రోహిత్ రోహిత్ అనే అరుపులు, తనను హేళన చేస్తూ కామెంట్స్ ను హార్దిక్ ఇప్పటి వరకూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఇలా ఎన్నాళ్లు నెట్టుకు రాగలడన్నది మాత్రం చూడాలి.
గత రెండు సీజన్లుగా ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఆశించిన మేర లేదు. ఈ సీజన్లోనూ వరుసగా రెండు ఓటములతో ప్రారంభించింది. ఇక్కడి నుంచి టీమ్ మళ్లీ గాడిలో పడటం అన్నది పెద్ద సవాలే.