Mumbai Indians Rift: రెండుగా చీలిపోయిన ముంబై ఇండియన్స్ టీమ్.. రోహిత్, హార్దిక్ మధ్య విభేదాలు!
Mumbai Indians Rift: ముంబై ఇండియన్స్ టీమ్ రెండుగా చీలిపోయిందా? రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలకు పడటం లేదా? తాజాగా జాగరణ్ లో వచ్చిన రిపోర్ట్ సంచలనం రేపుతోంది.
Mumbai Indians Rift: ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. నిజానికి గతేడాది రోహిత్ శర్మను పక్కన పెట్టి హార్దిక్ కు కెప్టెన్సీ ఇచ్చినప్పటి నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓటములతో జట్టులో విభేదాలు మరో స్థాయికి చేరాయని, ప్లేయర్స్ గా రెండుగా చీలిపోయారని జాగరణ్ న్యూస్ తన రిపోర్టులో వెల్లడించింది.
ముంబై ఇండియన్స్‌కు ఏమైంది?
సన్ రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో బుధవారం (మార్చి 27) ఎదురైన దారుణ పరాభవం ముంబై ఇండియన్స్ టీమ్ ను మరింత కుంగదీసింది. తొలి మ్యాచ్ లో ఓటమితోనే హార్దిక్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. స్టార్ బౌలర్ బుమ్రాను సరిగా వాడుకోవడం లేదని మాజీలు విమర్శించారు. రెండో మ్యాచ్ లోనూ అతడు అదే తప్పిదం చేశాడు.
దీంతో ఐపీఎల్ చరిత్రలోనే సన్ రైజర్స్ అత్యధిక స్కోరు చేసి ముంబై పరువు తీసింది. దీనికితోడు ఈ మ్యాచ్ లో మిగతా బ్యాటర్లందరూ 200 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేయగా.. కెప్టెన్ హార్దిక్ మాత్రం 120 స్ట్రైక్ రేట్ తో రన్స్ చేయడాన్ని చాలా మంది తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ రోహిత్, హార్దిక్ వర్గాలు విడిపోయిందంటూ జాగరణ్ న్యూస్ రిపోర్ట్ వెలువరించడం సంచలనం రేపుతోంది.
రోహిత్ శర్మ vs హార్దిక్ పాండ్యా
ఇప్పటికీ టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ.. తన ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని మాత్రం హార్దిక్ కు ఇవ్వడంపై అసంతృప్తిగా ఉన్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా టీమ్ లో విభేదాలు, చీలిక కూడా అందులో నుంచి వచ్చిందే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ముంబై ఇండియన్స్ లోని బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలాంటి ప్లేయర్స్ రోహిత్ శర్మ వైపు.. ఇషాన్ కిషన్ తోపాటు పలువురు ఇతర ప్లేయర్స్ హార్దిక్ పాండ్యా వైపు ఉన్నట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. జట్టులో ఈ చీలిక వాళ్ల ఆటతీరుపైనా ప్రభావం చూపుతుందన్న ఆందోళన అభిమానుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే సన్ రైజర్స్ దెబ్బకు ముంబై బౌలర్లు హడలెత్తిపోయారు.
బుమ్రాకు రెండు మ్యాచ్ లలోనూ తొలి ఓవర్ ఇవ్వకపోవడం, తర్వాత కూడా అతన్ని సరిగా వినియోగించుకోకపోవడం ముంబై కొంప ముంచిందన్న అభిప్రాయంతో అభిమానులతోపాటు మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై రోజురోజుకూ విమర్శలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అతన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఐపీఎల్లో ఐదు టైటిల్స్ తో ఓ రేంజ్ క్రేజ్ ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుకు ఇప్పుడీ పరిస్థితి ఎవరూ ఊహించనిదే. అందులోనూ ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ రోహిత్, హార్దిక్ మధ్య ఇలాంటి విభేదాలు జట్టుకు అస్సలు మంచిది కాదు. ఇదే కొనసాగితే గత రెండు సీజన్లలాగే ఈ సీజన్ లోనూ ముంబై ప్రదర్శన దారుణంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీనికి ఆ ఫ్రాంఛైజీ ఎలా చెక్ పెడుతుందో చూడాలి.