India Tour of Australia Schedule: ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే.. మళ్లీ డేనైట్ టెస్ట్
India Tour of Australia Schedule: ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా ఈ ఏడాది చివర్లో అక్కడికి వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్ రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత మళ్లీ డేనైట్ టెస్ట్ కూడా ఉండటం విశేషం.
India Tour of Australia Schedule: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలిసారి ఐదు టెస్టుల సిరీస్ గా జరగబోతోంది. అంతేకాదు ఆస్ట్రేలియాతో 32 ఏళ్ల తర్వాత టీమిండియా తొలిసారి ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు ఇండియన్ టీమ్ వెళ్లనుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ మంగళవారం (మార్చి 26) రిలీజైంది.
ఆస్ట్రేలియాలో ఇండియా షెడ్యూల్ ఇదే
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగబోతోందని ఈ మధ్యే వెల్లడించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. తాజాగా సిరీస్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా నవంబర్ 22న పెర్త్ లో ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. ఇక ఈ సిరీస్ లో ఓ డేనైట్ టెస్ట్ కూడా షెడ్యూల్ చేశారు. ఈ మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ లో జరుగుతుంది.
మార్చి, 2022 తర్వాత ఈ ఏడాది డిసెంబర్ లో తొలిసారి ఇండియా ఓ డేనైట్ టెస్ట్ ఆడబోతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మూడు టెస్టు సిరీస్ లను టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు టెస్టు సిరీస్ లు, ఇండియాలో మరో సిరీస్ గెలిచింది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రస్తుతం ఇండియా దగ్గరే ఉంది.
యాషెస్‌లాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ
చాలా రోజులుగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగు టెస్టులే జరుగుతున్నాయి. తొలిసారి దీనిని ఐదు టెస్టులకు పెంచారు. 2018-19లో ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లిన ఇండియన్ టీమ్ తొలిసారి కోహ్లి కెప్టెన్సీలో 2-1తో సిరీస్ గెలిచింది. తర్వాత 2020-21లోనూ 2-1తో వరుసగా రెండో సిరీస్ సొంతం చేసుకుంది. 2014-15 నుంచి ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా ఒక్క టెస్ట్ సిరీస్ లోనూ ఇండియాను ఓడించలేకపోయింది.
అయితే గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్లో మాత్రం ఇండియాను దెబ్బ తీసింది. అంతేకాదు 2023లోనే వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ టీమిండియాను ఓడించింది. ఇక ఇప్పుడు 1991-92 తర్వాత తొలిసారి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. పదేళ్లుగా ఇండియాపై టెస్ట్ సిరీస్ గెలవలేకపోయిన ఆస్ట్రేలియా.. ఈసారి స్వదేశంలో షాకివ్వాలని చూస్తోంది. మరి ఈసారైనా టీమిండియా దూకుడును అడ్డుకుంటుందా లేక మనోళ్లే హ్యాట్రిక్ సాధిస్తారా చూడాలి.
ఆస్ట్రేలియాలో టీమిండియా షెడ్యూల్ ఇదీ
తొలి టెస్టు - నవంబర్ 22 నుంచి 26 వరకు - పెర్త్
రెండో టెస్ట్ (డేనైట్ టెస్ట్) - డిసెంబర్ 6 నుంచి 10 వరకు - అడిలైడ్
మూడో టెస్ట్ - డిసెంబర్ 14 నుంచి 18 వరకు - బ్రిస్బేన్ గబ్బా స్టేడియం
నాలుగో టెస్ట్ (బాక్సింగ్ డే టెస్ట్) - డిసెంబర్ 26 నుంచి 30 వరకు- మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్
ఐదో టెస్ట్ (న్యూఇయర్ టెస్ట్)- జనవరి 3 నుంచి 7 వరకు - సిడ్నీ క్రికెట్ గ్రౌండ్