Mumbai Indians: ముంబై ఇండియన్స్ టీమ్‌లో ఏం జరుగుతోంది? రోహిత్, బుమ్రా సీరియస్ టాక్.. హార్దిక్ ఏమో అలా..
Mumbai Indians: ముంబై ఇండియన్స్ టీమ్ లో ఏం జరుగుతోందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రోహిత్ శర్మ, బుమ్రా మధ్య సీరియస్ టాక్ జరుగుతుండగా హార్దిక్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుండటం గమనార్హం.

Mumbai Indians: ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్సీ మార్పు నుంచి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా గుజరాత్ టైటన్స్ చేతుల్లో తొలి మ్యాచ్ ఓడిపోవడంతో ఆ జట్టుపై సోషల్ మీడియాలో మరిన్ని విమర్శలు వెల్లువెత్తున్నాయి. మ్యాచ్ లో, ఆ తర్వాత డగౌట్ లో రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్యా మధ్య సీరియస్ గా నడిచిన చర్చ.. దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండగా.. అసలు వాళ్ల టీమ్ లో ఏం జరుగుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ముంబై ఇండియన్స్ జట్టులో గొడవలు?
ముంబై ఇండియన్స్ టీమ్ గతేడాది రోహిత్ శర్మను పక్కన పెట్టి గుజరాత్ టైటన్స్ నుంచి తీసుకొచ్చిన హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. అప్పటి నుంచీ ఆ జట్టుపై అభిమానులు గుర్రుగానే ఉన్నారు. హార్దిక్ కు కెప్టెన్సీ వాళ్లకు అస్సలు ఇష్టం లేదు. గుజరాత్ తో మ్యాచ్ లో అహ్మదాబాద్ స్టేడియంలో వేల మంది ఫ్యాన్స్ అతన్ని హేళన చేశారు.
ఆ తర్వాత మ్యాచ్ సందర్భంగా, మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్, హార్దిక్, బుమ్రా మధ్య జరిగిన వాదనల వీడియోలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముంబై జట్టులో గొడవలు ముదురుతున్నాయని, ఒక కుటుంబం ఇప్పుడు ముక్కలు అవుతోందన్న కామెంట్స్ చేస్తూ ఈ వీడియోలను అభిమానులు షేర్ చేస్తున్నారు. మ్యాచ్ సందర్భంగా రోహిత్, బుమ్రా మాట్లాడుతుండగా.. హార్దిక్ ఏమీ పట్టనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత తనను హగ్ చేసుకోవడానికి వచ్చిన హార్దిక్ ను వారిస్తూ రోహిత్ అతనికి క్లాస్ పీకుతున్నట్లుగా మాట్లాడిన వీడియో కూడా వైరల్ అయింది. ఇక ఇప్పుడు డగౌట్ లో రోహిత్, బుమ్రా మధ్య ఓ సీరియస్ టాక్ నడుస్తున్న వీడియో తెరపైకి వచ్చింది. ఇతర ముంబై ఇండియన్స్ ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్ ఉండగానే బుమ్రాతో రోహిత్ ఆవేశంగా మాట్లాడటం ఇందులో చూడొచ్చు.
గుజరాత్ కెప్టెన్‌తో హార్దిక్
మరోవైపు వీళ్ల మాటలు పట్టనట్లు హార్దిక్ పాండ్యా మాత్రం గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దగ్గరికి వెళ్లిపోయాడు. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ముంబై క్యాంప్ లో ఏదో జరుగుతోంది.. రోహిత్‌కు, హార్దిక్ కు పడటం లేదన్న వార్తలు వస్తున్నాయి. 12 సీజన్లుగా ఐపీఎల్ తొలి మ్యాచ్ లోనే ఓడిపోతున్న ముంబై ఇండియన్స్ ఈసారి కూడా ఆ రికార్డును కొనసాగించింది.
నిజానికి ఈ మ్యాచ్ లో 36 బంతుల్లో 48 పరుగులు అవసరమైన సమయంలో.. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. ఆ సమయంలో ఎంఐ గెలవడం ఖాయమనుకున్నా.. చివరికి 6 పరుగులతో ఓటమి తప్పలేదు. అయితే మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా చేసిన కొన్ని తప్పిదాలు రోహిత్ శర్మను ఆగ్రహానికి గురి చేసినట్లు ఈ వీడియోలు చూస్తే అర్థమవుతోంది.
నిజంగా వాళ్ల మధ్య జరిగిన చర్చ ఏంటన్నది మాత్రం బయటకు రాలేదు. కానీ అభిమానులు మాత్రం ఎవరికి తోచినట్లుగా వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే హార్దిక్ మాత్రం ఈ ఓటమిని లైట్ తీసుకుంటున్నాడు. ఓడింది ఒక్క మ్యాచే.. ఇంకా 13 మ్యాచ్ లు ఉన్నాయంటూ అతడు మ్యాచ్ తర్వాత కామెంట్ చేశాడు. మరి ముంబై ఇండియన్స్ పుంజుకుంటుందా?