SRH vs MI: ఉప్పల్లో రికార్డుల హోరు.. ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్-srh vs mi scorecard records galore sunrisers hyderabad beat mumbai indians in record breaking match ipl 2024 news ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Srh Vs Mi: ఉప్పల్లో రికార్డుల హోరు.. ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్

SRH vs MI: ఉప్పల్లో రికార్డుల హోరు.. ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్

Hari Prasad S HT Telugu
Mar 27, 2024 11:29 PM IST

SRH vs MI: రికార్డులు హోరెత్తిన వేళ ఉప్పల్లో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు, అత్యధిక సిక్స్‌లు నమోదైన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 31 పరుగులతో గెలిచింది.

ఉప్పల్లో రికార్డుల హోరు.. ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
ఉప్పల్లో రికార్డుల హోరు.. ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ (AP)

SRH vs MI: ఉప్పల్ స్టేడియంలో పరుగుల సునామీలో మునిగిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ఏకంగా 523 పరుగులు నమోదయ్యాయి. మొత్తంగా 38 సిక్స్ లు బాదారు. ఈ రికార్డుల మ్యాచ్ లో సన్ రైజర్స్ 31 పరుగులతో గెలిచి ఐపీఎల్ 2024లో బోణీ చేసింది. తొలి మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతుల్లో ఓడినా.. సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్ లోనే కళ్లు చెదిరే విజయం సాధించారు.

yearly horoscope entry point

వణికించిన ముంబై ఇండియన్స్

కళ్ల ముందు 278 పరుగుల భారీ లక్ష్యం కనిపిస్తున్నా ముంబై ఇండియన్స్ వెనకడుగు వేయలేదు. చివరి వరకూ పోరాడుతూనే ఉంది. చివరికి 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు చేయడం విశేషం. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ లో తిలక్ వర్మ 34 బంతుల్లోనే 64 రన్స్ చేశాడు. చివర్లో టిమ్ డేవిడ్ కూడా 22 బంతుల్లో 42 పరుగులతో వణికించాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (12 బంతుల్లో 26), ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 34) కళ్లు చెదిరే ఆరంభం ఇవ్వగా.. మిడిలార్డర్ బ్యాటర్లు చివరి వరకూ పోరాడారు. అయితే కొండంత లక్ష్యానికి ముంబై 31 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

సన్ రైజర్స్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముంబై బ్యాటర్లను కట్టడి చేశాడు. అతడు 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, జైదేవ్ ఉనద్కట్, షాబాజ్ అహ్మద్ భారీగా పరుగులు ఇచ్చినా.. చివరికి ముంబైని కలిసికట్టుగా కట్టడి చేయడంలో విజయవంతమయ్యారు. ముంబై ఇన్నింగ్స్ లో 20 సిక్స్ లు ఉన్నాయి. అంతకు ముందు సన్ రైజర్స్ 18 సిక్స్ లు బాదారు.

రికార్డుల హోరు

ఉప్పల్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగులు (523), అత్యధిక సిక్స్ లు (38) నమోదైన మ్యాచ్ ఇదే. ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్ లో 500 స్కోరు దాటడం కూడా ఇదే తొలిసారి. సన్ రైజర్స్ హైదరాబాద్ 277 పరుగులతో లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేయగా.. ముంబై ఇండియన్స్ దానిని చేజ్ చేసినంత పని చేసి చివరికి 246 రన్స్ దగ్గర ఆగిపోయింది.

అంతకుముందు సన్ రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. హెన్రిచ్ క్లాసెన్ కేవలం 34 బంతుల్లో 80, అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63, ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 రన్స్ చేశారు. అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. సన్ రైజర్స్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును క్రియేట్ చేశాడు.

అంతకు కొన్ని నిమిషాల ముందు 18 బంతుల్లో హాఫ్ సెంచరీతో.. ట్రావిస్ హెడ్ క్రియేట్ చేసిన రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు. మొత్తంగా సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో 18 సిక్స్ లు నమోదు కావడం విశేషం. ఇక 19 ఫోర్లు కూడా ఉన్నాయి. మొత్తంగా ఫోర్లు, సిక్స్ ల రూపంలోనే సన్ రైజర్స్ 184 పరుగులు చేసింది.

Whats_app_banner