Rohit Sharma Holi celebrations: ముంబై ఇండియన్స్ టీమ్మేట్స్‌తో రోహిత్ శర్మ హోలీ సెలబ్రేషన్స్ చూశారా?
Rohit Sharma Holi celebrations: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. తన టీమ్మేట్స్ తో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Rohit Sharma Holi celebrations: హోలీ పండుగను దేశమంతా ఘనంగా జరుపుకుంది. పిల్లలు, పెద్దలంతా రంగుల్లో మునిగి తేలారు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ టీమ్ కూడా ఘనంగా హోలీని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆ టీమ్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీమ్మేట్స్ తో కలిసి ఈ రంగుల పండగను ఎంజాయ్ చేశాడు.
రోహిత్ హోలీ సెలబ్రేషన్స్
రోహిత్ శర్మ పూర్తిగా రంగుల్లో మునిగిపోయి తన టీమ్మేట్స్ పైకి ఓ పైపుతో నీళ్లు చిమ్ముతున్న వీడియోను ముంబై ఇండియన్స్ సోమవారం (మార్చి 25) షేర్ చేసింది. ఈ సందర్భంగా తన వీడియో తీస్తున్న వ్యక్తిపైకి కూడా అలాగే నీళ్లు చిమ్మడంతో అతని మొబైల్ కాస్తా పూర్తిగా తడిసిపోయింది. ఇదే విషయాన్ని చెబుతూ ముంబై ఫ్రాంఛైజీ అందరికీ హోలీ విషెస్ చెప్పింది.
"అందరికీ హ్యాపీ హోలీ. కానీ అడ్మిన్ మాత్రం తన మొబైల్ రిపెయిర్ చేయించుకోవాల్సిందే" అనే క్యాప్షన్ తో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ అధికారిక ఎక్స్ అకౌంట్ ఈ వీడియోను షేర్ చేసింది. ముంబై టీమ్మేట్స్ తోపాటు రోహిత్ భార్య, కూతురు కూడా ఈ హోలీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అతని భార్య రితికా కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ ఫొటోలను షేర్ చేసింది.
ఆదివారమే (మార్చి 24) ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ సీజన్లో తన తొలి మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. అయితే గుజరాత్ టైటన్స్ చేతుల్లో ఆరు పరుగులతో ఓడిపోయింది. ఆ ఓటమిని త్వరగానే మరచిపోయిన టీమ్.. హోలీ వేడుకల్లో మునిగి తేలింది. ముంబై ఇండియన్స్ షేర్ చేసిన వీడియోలో రోహిత్ మాత్రమే కనిపించాడు. కెప్టెన్ హార్దిక్, మిగిలిన టీమ్మేట్స్ ఎవరూ కనిపించలేదు.
జీటీ వర్సెస్ ఎంఐ
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి దిగిపోయిన తర్వాత తొలిసారి ఓ సాధారణ ప్లేయర్ లాగా గుజరాత్ టైటన్స్ తో తొలి మ్యాచ్ ఆడాడు రోహిత్ శర్మ. ఈ మ్యాచ్ లో అతడు 29 బంతుల్లోనే 43 రన్స్ చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ తో కలిసి మూడో వికెట్ కు 77 పరుగులు జోడించి తన టీమ్ ను విన్నింగ్ పొజిషన్ లో నిలిపాడు. కానీ మిడిలార్డర్ వైఫల్యంతో ముంబై ఇండియన్స్ కు ఓటమి తప్పలేదు.
గత 12 సీజన్లుగా తొలి మ్యాచ్ లోనే ఓడిపోయే ఆనవాయితీని ఆ టీమ్ కొనసాగిస్తోంది. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తొలి మ్యాచ్ లోనే ఓడిపోవడం మాత్రం హార్దిక్ పాండ్యాను విమర్శల పాలు చేసింది. ఇందులో అతడు చేసిన తప్పిదాల వల్లే టీమ్ ఓడిపోయిందని మాజీ క్రికెటర్లు విమర్శించారు. చివరి ఓవర్లో 19 పరుగులు అవసరమైన సమయంలో సిక్స్, ఫోర్ తో హార్దిక్ మొదలు పెట్టినా.. తర్వాత అతడు ఔటవడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.
ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్ ను బుధవారం (మార్చి 27) సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలోనే జరగనుంది. ఈ సీజన్లో నగరంలో జరగబోయే తొలి ఐపీఎల్ మ్యాచ్ ఇదే.