IPL 2024 MI vs GT: చివరి 5 ఓవర్లలో 43 రన్స్ చేయలేక ఓడిన ముంబై ఇండియన్స్.. ఉత్కంఠ పోరులో గుజరాత్ గెలుపు
Mumbai Indians vs Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో ముంబై ఇండియన్స్ (MI) జట్టుకు పరాజయం ఎదురైంది. ఐపీఎల్ 2024లో ఆ జట్టు నిరాశాజనకంగా మొదలుపెట్టింది. గుజరాత్ బౌలర్లు చివర్లో అద్భుతంగా రాణించి.. ముంబైను అడ్డుకున్నారు.
MI vs GT - IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ జట్టు తమ తొలి మ్యాచ్‍లో ఓటమి పాలైంది. ఈ సీజన్‍లో హార్దిక్ పాండ్యా పూర్తిస్థాయిలో ముంబై కెప్టెన్సీ చేపట్టగా.. తొలిపోరులో ఆ జట్టు పరాజయం చూసింది. కొత్త కెప్టెన్ శుభ్‍మన్ గిల్ సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు (మార్చి 24) జరిగిన మ్యాచ్‍లో గుజరాత్ టైటాన్స్ జట్టు 6 పరుగుల తేడాతో ముంబై జట్టుపై విజయం సాధించింది.
ఓ దశలో ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ సునాయాసంగా గెలిచేలా కనిపించింది. గెలుపు కోసం చివరి ఐదు ఓవర్లలో 43 రన్స్ చేయాల్సి ఉండగా.. ముంబై చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. అయితే, ఆ దశలో ముంబై బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేశారు గుజరాత్ టైటాన్స్ బౌలర్లు మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, స్పెన్సర్ జాన్సన్, ఉమేశ్ యాదవ్. వికెట్లు తీయడంతో పాటు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ముంబై బ్యాటర్లు తంటాలు పడ్డారు. చివరికి ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (45) రాణించాడు. ముంబై బౌలర్లలో జస్‍ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. గెలార్డ్ కోట్జీకి రెండు వికెట్లు దక్కాయి.
రోహిత్ రాణించినా..
లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 రన్స్ చేసింది. స్టార్ బ్యాటర్, ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (29 బంతుల్లో 43 పరుగులు)తో పాటు డేవిడ్ బ్రెవిస్ (46) రాణించినా మిలిగిన బ్యాటర్లు విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, స్పెన్సెర్స్ జాన్సన్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. రషీద్ ఖాన్ 4 ఓవర్లలో కేవలం 23 రన్స్ ఇచ్చి రాణించాడు. ఓటమి తప్పదనుకున్న దశలో ముంబై బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేసి జట్టును గెలిపించారు జీటీ బౌలర్స్.
చివరి ఐదు ఓవర్లు సాగాయిలా..
లక్ష్యఛేదనలో 15 ఓవర్లకు 126/3 వద్దకు ముంబై ఇండియన్స్ చేరింది. గెలుపునకు ముంబై చివరి 5 ఓవర్లలో 43 రన్స్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో 16వ ఓవర్ వేసిన గుజరాత్ పేసర్ మోహిత్ శర్మ.. బ్రెవిస్‍ను ఔట్ చేసి.. కేవలం 4 పరుగులే ఇచ్చాడు. ఆ తర్వాత 17వ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన రషీద్ ఖాన్.. 3 పరుగులే ఇచ్చి ఆకట్టుకున్నాడు. టిమ్ డేవిడ్, తిలక్ వర్మను కట్టడి చేశాడు. 18వ ఓవర్లో మోహిత్ శర్మ 9 పరుగులు ఇచ్చినా.. చివరి బంతికి టిమ్ డేవిడ్‍ను ఔట్ చేసి.. ముంబైని దెబ్బ కొట్టాడు. 19వ ఓవర్లో గుజరాత్ పేసర్ స్పెన్సర్స్ జాన్సన్ తిలక్ వర్మ, కోట్జీని పెవిలియన్‍కు పంపాడు. ఆ ఓవర్లో 8 రన్స్ ఇచ్చాడు.
చివరి ఓవర్లో ముంబైకు 19 రన్స్ అవసరం కాగా.. గుజరాత్ బౌలర్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్‍కు దిగాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలి రెండు బంతులకు సిక్స్, ఫోర్ బాదటంతో ముంబైలో ఆశలు మళ్లీ పెరిగాయి. అయితే, ఆ తర్వాతి బంతికే హార్దిక్‍ను ఉమేశ్ ఔట్ చేశాడు. ఆ తర్వాతి బాల్‍కే చావ్లా కూడా పెవిలియన్ చేరాడు. తదుపరి రెండు బంతులకు రెండు పరుగులే రావటంతో గుజరాత్ విజయం సాధించింది. చివరో ఐదు ఓవర్లలో ముంబైను కట్టడి చేసి గిల్ సేన గెలిచింది.
హార్దిక్‍కు ప్రేక్షకుల నుంచి ‘బూ’
ఐపీఎల్ 2024 సీజన్ కోసం రోహిత్ శర్మను తప్పించి జట్టుకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‍ను చేసింది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ. అందులోనూ గత రెండు సీజన్లు గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన పాండ్యా.. ఈ సీజన్ కోసం మళ్లీ తన పాత ఫ్రాంచైజీ ముంబైకి వెళ్లాడు. ఈ కారణాలతో ఈ మ్యాచ్‍లో ప్రేక్షకులు అసంతృప్తి చూపించారు. టాస్ సమయంతో పాటు హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసినప్పుడు.. బ్యాటింగ్‍కు వచ్చిన సమయంలో స్టేడియంలోని కొందరు ప్రేక్షకులు ‘బూ’ అని అరిచారు. దీంతో కాస్త నిరాశగా హార్దిక్ కనిపించాడు.