Sunrisers Hyderabad Key Bowlers: సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆ ముగ్గురు బౌలర్లపైనే అందరి కళ్లు..-sunrisers hyderabad key bowlers pat cummins bhuvaneshwar kumar mayank markande srh key players ipl 2024 news ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sunrisers Hyderabad Key Bowlers: సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆ ముగ్గురు బౌలర్లపైనే అందరి కళ్లు..

Sunrisers Hyderabad Key Bowlers: సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆ ముగ్గురు బౌలర్లపైనే అందరి కళ్లు..

Hari Prasad S HT Telugu
Mar 22, 2024 03:00 PM IST

Sunrisers Hyderabad Key Bowlers: ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ముగ్గురు బౌలర్లు కీలకంగా మారారు. వాళ్లు రాణిస్తే.. ఈసారి హైదరాబాద్ కు తిరుగుండదు.

సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆ ముగ్గురు బౌలర్లపైనే అందరి కళ్లు..
సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆ ముగ్గురు బౌలర్లపైనే అందరి కళ్లు..

Sunrisers Hyderabad Key Bowlers: ఐపీఎల్ 2024 కోసం కొత్త లుక్, కొత్త కెప్టెన్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. శనివారం (మార్చి 23) కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. గతేడాది చేదు అనుభవం నేపథ్యంలో ఈసారి కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో టీమ్ ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ విజయావకాశాలను ప్రభావితం చేయగలిగే ముగ్గురు బౌలర్లు ఎవరో చూడండి.

భువనేశ్వర్ కుమార్ - నమ్మదగిన పేసర్

టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కొన్నేళ్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నమ్మదగిన పేస్ బౌలర్ గా ఉన్నాడు. నిజానికి ఈ ఫ్రాంఛైజీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, ఒక ఇన్నింగ్స్ లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన రికార్డులు కూడా భువీ పేరిటే ఉన్నాయి.

పవర్ ప్లేలో భువనేశ్వర్ చాలా కీలకం. గతంలో తనపై ఉంచిన నమ్మకాన్ని అతడెప్పుడూ వమ్ము చేయలేదు. గతేడాది సన్ రైజర్స్ పాయింట్ల టేబుల్లో చివరి స్థానంలో నిలిచినా.. భువనేశ్వర్ మాత్రం ఈ ఫ్రాంఛైజీ తరఫున టాప్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. మొత్తంగా 16 వికెట్లు తీసుకున్నాడు. కొన్నాళ్లుగా ఇండియన్ టీమ్ కు దూరంగా ఉన్నా.. డొమెస్టిక్ క్రికెట్ లో రాణిస్తూనే ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 11 వికెట్లు తీశాడు. ఈ సీజన్లోనూ ఎస్ఆర్‌హెచ్ తరఫున అతడే కీలకం కానున్నాడు.

మయాంక్ మార్కండే - యువ స్పిన్ మాంత్రికుడు

గతేడాది సన్ రైజర్స్ తరఫున మయాంక్ మార్కండే రాణించాడు. 10 మ్యాచ్ లలో 12 వికెట్లు తీశాడు. ఎకానమీ కూడా 7.89గా ఉంది. 26 ఏళ్ల ఈ యువ లెగ్ స్పిన్నర్ చాలా కీలకం కానున్నాడు. మరో లెగ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ తో కలిసి సన్ రైజర్స్ స్పిన్ బౌలింగ్ భారాన్ని మయాంక్ మోయనున్నాడు.

ఈ మధ్య జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ, విజయ్ హజారే ట్రోఫీల్లో మయాంక్ రాణించాడు. పంజాబ్ తరఫున బరిలోకి దిగిన మయాంక్.. విజయ్ హజారే ట్రోఫీలో 9 వికెట్లు తీశాడు.

ప్యాట్ కమిన్స్ - రాత మారుస్తాడా?

ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ ఎన్నో ఆశలతో ఏకంగా రూ.20.5 కోట్లు పెట్టి ప్యాట్ కమిన్స్ ను కొనుగోలు చేసింది. ఏడెన్ మార్‌క్రమ్ ను కాదని అతనికే కెప్టెన్సీ అప్పగించింది. గతేడాది ఆస్ట్రేలియాను వరల్డ్ కప్ లో విజేతగా నిలిపిన కమిన్స్.. తన కెప్టెన్సీ మాయతో సన్ రైజర్స్ రాత కూడా మారుస్తాడన్న నమ్మకంతో అభిమానులు ఉన్నారు.

ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ ఐపీఎల్ 42 మ్యాచ్ లలో 45 వికెట్లు తీశాడు. ఈ మెగా లీగ్ లో అతని రికార్డు అంత గొప్పగా లేకపోయినా.. గత ఏడాది కాలంలో ఆస్ట్రేలియా టీమ్ తరఫున కెప్టెన్, ప్రధాన పేస్ బౌలర్ గా అతడు రాణిస్తున్న తీరు సన్ రైజర్స్ లో ఆశలు రేపుతోంది.

ఈ ముగ్గురు బౌలర్లే కాకుండా.. ఫాస్టెస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, లెఫ్టామ్ పేస్ బౌలర్ నటరాజన్, లెగ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ లాంటి బౌలర్లతో సన్ రైజర్స్ బౌలింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉందని చెప్పొచ్చు.

Whats_app_banner