Bhuvneshwar Kumar: నేనున్నానంటూ సెలెక్టర్లకు గుర్తు చేసిన భువనేశ్వర్.. ఆ టోర్నీలో ఐదు వికెట్లతో సత్తా-bhuvneshwar kumar returns red ball cricket after six years takes five wickets ahead of india vs england test series ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Bhuvneshwar Kumar: నేనున్నానంటూ సెలెక్టర్లకు గుర్తు చేసిన భువనేశ్వర్.. ఆ టోర్నీలో ఐదు వికెట్లతో సత్తా

Bhuvneshwar Kumar: నేనున్నానంటూ సెలెక్టర్లకు గుర్తు చేసిన భువనేశ్వర్.. ఆ టోర్నీలో ఐదు వికెట్లతో సత్తా

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 12, 2024 09:32 PM IST

Bhuvneshwar Kumar: ఆరేళ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‍లో పునరాగమనం చేసిన భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. అదరగొట్టాడు. రీఎంట్రీ మ్యాచ్‍లోనే ఐదు వికెట్లతో సత్తాచాటాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య సొంతగడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ముందు ఈ అద్భుత ప్రదర్శన చేశాడు భువీ.

భువనేశ్వర్ కుమార్ (Photo: Twitter)
భువనేశ్వర్ కుమార్ (Photo: Twitter)

Bhuvneshwar Kumar: సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఒకప్పడు టీమిండియా బౌలింగ్ దళంలో కీలకంగా ఉండేవాడు. భారత్ తరఫున 21 టెస్టులు ఆడిన భువీ 63 వికెట్లు దక్కించుకున్నాడు. 2014లో లార్డ్స్ మైదానంలో ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్‍పై భారత్ చిరస్మరణీయ విజయంలో భువనేశ్వర్ కీలకపాత్ర పోషించాడు. 2018 దక్షిణాఫ్రికా పర్యటన టెస్టుల్లోనూ 10 వికెట్లను తీశాడు. స్వింగ్‍తో బ్యాటర్లకు చెమటలు పట్టించటంలో భువీ దిట్ట. భారత్ తరపున 121 వన్డేల్లో 141 వికెట్లు, 87 టీ20ల్లో 90 వికెట్లను భువనేశ్వర్ దక్కించున్నాడు. భారత్‍ను చాలా మ్యాచ్‍ల్లో గెలిపించాడు.

అయితే, ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్‌కు టీమిండియాలో చోటు దక్కడం లేదు. భారత్ తరఫున చివరగా 2022 నవంబర్‌లో వన్డే ఆడాడు భువీ. ఇక టెస్టుల విషయానికి వస్తే 2018లో చివరగా ఆడాడు. ఆ తర్వాతి నుంచి భారత టెస్టు జట్టులో చోటు దక్కలేదు. అయితే, ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ తరఫున దేశవాళీ రంజీ ట్రోఫీలో అడుగుపెట్టాడు భువీ. ఆరేళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‍లో బరిలోకి దిగాడు. లాంగ్ గ్యాప్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్‍లోకి వచ్చినా.. తొలి రోజే ఐదు వికెట్లతో అదరగొట్టాడు.

రంజీ ట్రోఫీలో భాగంగా ఎలైట్ గ్రూప్‍లో ఉత్తర ప్రదేశ్, బెంగాల్ మధ్య నేడు (జనవరి 12) మ్యాచ్ మొదలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగిన ఉత్తర ప్రదేశ్ 60 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత బెంగాల్ బ్యాటింగ్‍కు దిగింది. ఉత్తర ప్రదేశ్ తరఫున బౌలింగ్‍కు దిగిన భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లతో సత్తాచాటాడు. 13 ఓవర్లు వేసి 5 వికెట్లు పడగొట్టాడు.

తొలి రోజు ముగిసే సరికి బెంగాల్ 5 వికెట్లకు 95 పరుగులు చేసి.. 35 రన్స్ ఆధిక్యంలో నిలిచింది. ఐదు వికెట్లను తీసింది భువనేశ్వర్ కుమారే. ఆరేళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్ బరిలోకి దిగిన భువీ.. ఐదు వికెట్లతో మెరిపించాడు.

భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జనవరి 25న మొదలుకానుంది. ఈ తరుణంలో రంజీలో ఐదు వికెట్లతో భువీ సత్తాచాటాడు. దీంతో టెస్టు క్రికెట్‍కు తాను కూడా ఉన్నానని భారత సెలెక్టర్లకు భువీ గుర్తు చేశాడు. షమీ గాయపడటంతో ఇంగ్లండ్‍తో తొలి రెండు టెస్టులకు దూరం కావడం ఖాయంగా మారింది. అలాగే, భారత యువ బౌలర్లు కూడా టెస్టుల్లో అంతగా ప్రభావం చూపలేకున్నారు. ఈ తరుణంలో భువీని సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారేమో చూడాలి.

నెటిజన్ల స్పందన ఇదే

స్వింగ్ కింగ్ భువీ ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆరేళ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‍ బరిలోకి దిగిన భువనేశ్వర్ ఐదు వికెట్లతో సత్తాచాటాడని, అతడి స్వింగ్‍లో ఏ మాత్రం పదును తగ్గలేదని కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా టెస్టు జట్టుకు భువీని తీసుకోవాలని సెలెక్టర్లను డిమాండ్ చేస్తున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్ లాంటి బౌలర్ల కంటే టెస్టుల్లో భువనేశ్వర్ కుమార్ చాలా బెస్ట్ అని కొందరు ట్వీట్లు చేశారు.

Whats_app_banner