Pat Cummins - IPL 2024 Auction: ఐపీఎల్‍లో చరిత్ర సృష్టించిన ప్యాట్ కమిన్స్.. వేలంలో ఆ మార్క్ దాటిన తొలి ప్లేయర్‌గా..
Pat Cummins - IPL 2024 Auction: ఐపీఎల్ వేలం చరిత్రలోనే తొలిసారి రూ.20కోట్ల మార్క్ దాటిన ఆటగాడిగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. 2024 సీజన్ కోసం జరిగిన వేలంలో అతడికి రూ.20.50కోట్ల ధర దక్కింది. వివరాలివే..
Pat Cummins - IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించాడు ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ ఆల్‍రౌండర్ ప్యాట్ కమిన్స్. ఐపీఎల్ వేలం హిస్టరీలో రూ.20కోట్ల మార్క్ దాటిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ 2024 సీజన్ కోసం నేడు (డిసెంబర్ 19) జరిగిన వేలంలో ప్యాట్ కమిన్స్‌ను సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఏకంగా రూ.20.50 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్‍లో ఓ ఆటగాడు రూ.20కోట్ల మార్క్ చేరడం ఇదే తొలిసారి.
ఐపీఎల్ 2024 సీజన్ కోసం జరిగిన ఈ వేలంలో రూ.2కోట్ల బేస్ ధరతో ప్యాట్ కమిన్స్ అడుగుపెట్టాడు. ఇతడి కోసం ముందుగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా పోటీకి వచ్చింది. ఆ తర్వాత సన్‍రైజర్స్ హైదరాబాద్ ఎంటర్ అయింది. అనంతరం బెంగళూరు, హైదరాబాద్ మధ్య కమిన్స్ కోసం హోరాహోరీ బిడ్డింగ్ జరిగింది. చివరికి రూ.20.50 కోట్లకు సన్‍రైజర్స్ హైదరాబాద్ అతడిని దక్కించుకుంది.
ఇప్పటి వరకు ఐపీఎల్‍లో ఖరీదైన ఆటగాడిగా ఇంగ్లండ్ ఆల్‍రౌండర్ సామ్ కరన్ ఉన్నాడు. 2023 సీజన్ కోసం అతడిని పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లకు దక్కించుకుంది. అయితే, ఇప్పుడు ప్యాట్ కమిన్స్ అతడిని దాటేశాడు రూ.20.50కోట్లతో జాక్‍పాట్ కొట్టాడు కమిన్స్. అయితే, 2024 సీజన్ కోసం జరిగిన ఈ వేలంలోనే రూ.24.75కోట్లకు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌ను కోల్‍కతా నైట్ రైడర్స్ (KKR) కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు.
ఈ ఏడాది కమిన్స్ సారథ్యంలో వన్డే ప్రపంచకప్ సాధించింది ఆస్ట్రేలియా. 2024 ఐపీఎల్ సీజన్‍లో అతడిని హైదరాబాద్ జట్టు కెప్టెన్ చేసే అవకాశం ఉంది.
2024 సీజన్‍కు కోల్‍కతా నైట్ రైడర్స్ (KKR) ప్యాట్ కమిన్స్ ను రిటైన్ చేసుకోకుండా.. వేలానికి రిలీజ్ చేసింది. దీంతో అతడు వేలానికి వచ్చాడు. 2020లో కోల్‍కతా నైట్ రైడర్స్ (KKR) కమిన్స్‌ను రూ.15.50కోట్లకు దక్కించుకుంది. ఆ తర్వాత రిలీజ్ చేసి 2022 వేలంలో రూ.7.25 కోట్లకే అతడని దక్కించుకుంది. ఇప్పుడు 2024 సీజన్ కోసం సన్‍రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.20.50 కోట్లకు కమిన్స్‌ను కొనుగోలు చేసింది.
ఐపీఎల్‍లో ఇప్పటి వరకు 42 మ్యాచ్‍లు ఆడిన ప్యాట్ కమిన్స్ 8.54 ఎకానమీతో 45 వికెట్లు తీశాడు. కొన్ని మ్యాచ్‍ల్లో బ్యాటింగ్‍లోనూ మెరుపులు మెరిపించాడు. ఐపీఎల్ 2022 సీజన్‍లో ముంబై ఇండియన్స్ టీమ్‍పై కేకేఆర్ తరఫున కమిన్స్ 14 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ఈ ఏడాది ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఆస్ట్రేలియా జట్టు టెస్టు ప్రపంచ ఛాంపియన్‍షిప్ టైటిల్‍ను కైవసం చేసుకుంది. వన్డే ప్రపంచకప్ టైటిల్‍ను కూడా సొంతం చేసుకుంది. అలాగే, యాషెస్ సిరీస్‍ను రిటైన్ చేసుకుంది.
ఇక, 2024 సీజన్ కోసం జరిగిన వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‍ను సన్‍రైజర్స్ హైదరాబాద్ రూ.6.8 కోట్లకు దక్కించుకుంది. శ్రీలంక స్పిన్ ఆల్‍రౌండర్ వానిందు హసరంగను రూ.1.5 కోట్లకు తీసుకుంది.