SRH vs PBKS: ఉప్పల్‍లో దుమ్మురేపిన సన్‍రైజర్స్ హైదరాబాద్.. అదరగొట్టిన అభిషేక్.. పంజాబ్‍పై సూపర్ గెలుపు
SRH vs PBKS IPL 2024: సన్‍రైజర్స్ హైదరాబాద్ మరోసారి గర్జించింది. ఇప్పటికే ఈ సీజన్ ప్లేఆఫ్స్ చేరిన ఆ జట్టు చివరి లీగ్ మ్యాచ్‍లోనూ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్‌పై సూపర్ విక్టరీ కొట్టింది.
SRH vs PBKS: ఐపీఎల్ 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగించింది. దూకుడైన ఆటతో మరోసారి దుమ్మురేపింది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన సన్‍రైజర్స్ తన చివరి లీగ్ మ్యాచ్‍లోనూ పంజాబ్ కింగ్స్‌పై అలవోక విజయం సాధించింది. హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో నేడు (మే 19) జరిగిన మ్యాచ్‍లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో పంజాబ్‍పై విజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఐదు బంతులు మిగిల్చి అలవోకగా గెలిచింది సన్‍రైజర్స్.
ఆడుతూ పాడుతూ.. మళ్లీ అభిషేక్ అదుర్స్
215 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‍రైజర్స్ హైదరాబాద్ అలవోకగా ఆడుతూ పాడుతూ ఛేదించింది. 19.1 ఓవర్లలోనే 6 వికెట్లకు 215 పరుగులు చేసి విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ (0) తొలి బంతికే పంజాబ్ పేసర్ అర్షదీప్ బౌలింగ్‍లో బౌల్డ్ అయి.. గోల్డెన్ డక్ కావటంతో హైదరాబాద్‍కు షాక్ తగిలింది. అయితే, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి వెంటనే దూకుడుగా ఆడారు. పంజాబ్ బౌలర్లను హిట్టింగ్‍తో ఓ ఆటాడుకున్నారు. అభిషేక్ శర్మ 28 బంతుల్లోనే 66 పరుగులతో సూపర్ హాఫ్ సెంచరీ చేశాడు. 5 ఫోర్లు, 6 సిక్స్‌లు బాదేసి దుమ్మురేపాడు. భారీ హిట్టింగ్‍తో చెలరేగాడు. 18 బంతుల్లోనే 33 పరుగులతో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించిన రాహుల్ త్రిపాఠి ఐదో ఓవర్లో ఔటయ్యాడు. ఆ తర్వాత కూడా అభిషేక్.. పంజాబ్ బౌలర్లను షేక్ ఆడించాడు. దీంతో 8.1 ఓవర్లలోనే హైదరాబాద్ 100 మార్కును చేరింది.
అదరగొట్టిన క్లాసెన్, నితీశ్
అభిషేక్ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడాడు. అయితే, 11వ ఓవర్లో ఔటయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి రెచ్చిపోయారు. క్లాసెన్ 26 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 పరుగులు చేశాడు. నితీశ్ 25 బంతుల్లో 1 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేసి మెప్పించాడు. వీరిద్దరూ దూకుడుతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. అయితే.. గెలుపుకు సమీపమైన తరుణంలో నితీశ్, క్లాసెన్ ఔటయ్యారు. చివర్లో అబ్దుల్ సమాద్ (11 నాటౌట్) నిలిచాడు. మొత్తంగా సన్‍రైజర్స్ హైదరాబాద్ అలవోకగా విజయం సాధించేసింది.
పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ , హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా.. హర్‍ప్రీత్ బ్రార్, శశాంక్ సింగ్ చెరొకటి దక్కించుకున్నారు.
రాణించిన ప్రభ్‍సిమ్రన్
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 214 పరుగులు చేసింది. ప్రభ్‍సిమ్రన్ సింగ్ (45 బంతుల్లో 71 పరుగులు; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శకతంతో ఆకట్టుకోగా.. అథర్వ తైడే (27 బంతుల్లో 46 పరుగులు) రాణించాడు. రాలీ రూసో (24 బంతుల్లో 49 పరుగులు) దూకుడుగా ఆడినా కాస్తలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. జితేశ్ శర్మ (15 బంతుల్లో 32 పరుగులు) చివర్లో వేగంగా ఆడటంతో పంజాబ్‍కు మంచి స్కోరు దక్కింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, విజయకాంత్ తలా ఓ వికెట్ తీశారు.
అయితే, ఈ భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ 19.1 ఓవర్లలోనే ఛేదించి దుమ్మురేపింది. మరోసారి తన బ్రాండ్ దూకుడైన ఆటతో ఆద్యంతం పైచేయి సాధించింది.
రెండో ప్లేస్ పక్కా కావాలంటే..
సన్‍రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‍లో లీగ్ దశలో 14 మ్యాచ్‍ల్లో 8 గెలిచి.. ఐదు ఓడింది. ఓ మ్యాచ్ రద్దయింది. దీంతో హైదరాబాద్ 17 పాయింట్లతో పాయింట్లతో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్‍కు చేరింది. అయితే, కోల్‍కతా నైట్‍రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య నేడు ఈ సీజన్ చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‍లో రాజస్థాన్ ఓడిపోతే హైదరాబాద్‍కు రెండో ప్లేస్ పక్కా అవుతుంది.
ఇక, ఈ సీజన్‍లో 14 మ్యాచ్‍ల్లో 5 గెలిచి.. 9 ఓడింది పంజాబ్ కింగ్స్. ఆ జట్టు లీగ్ దశలోనే ఎలిమినేట్ అయిపోయింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.