CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్-royal challengers bengaluru reaches ipl 2024 playoffs after win over chennai super kings rcb vs csk ms dhoni ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Csk Vs Rcb: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

Chatakonda Krishna Prakash HT Telugu
Published May 19, 2024 12:21 AM IST

CSK vs RCB IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ చేరింది. చివరి లీగ్ మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి బెంగళూరు అదరగొట్టింది. వరుసగా ఆరో విజయం సాధించి ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది.

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నైకు నిరాశ
CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నైకు నిరాశ (PTI)

CSK vs RCB IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లేఆఫ్స్ చేరింది. డూ ఆర్ డై మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK)పై సమీకరణాలు అన్నీ సాధించి బెంగళూరు అదరగొట్టింది. వరుసగా ఆరో విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఈ సీజన్‍లో తొలి 8 మ్యాచ్‍ల్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచిన ఆర్సీబీ.. ఆశలు అడుగంటిన తరుణంలో వరుసగా ఆరు విజయాలతో సత్తాచాటింది. ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా నేడు (మే 18) తన చివరి లీగ్ మ్యాచ్‍లో బెంగళూరు 27 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్‍లో 18 పరుగుల తేడాతో గెలువాల్సి ఉండగా.. ఆర్సీబీ 27 రన్స్ తేడాతో విక్టరీ కొట్టింది. సీఎస్కే కంటే మెరుగైన నెట్‍ రన్‍రేట్ సాధించింది. చెన్నైకు నిరాశ ఎదురై సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది.

ఇప్పటికే కోల్‍కతా నైట్‍రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‍రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరగా.. నాలుగో ప్లేస్‍ను బెంగళూరు ఖరారు చేసుకుంది. దీంతో ఈ సీజన్‍లో ఈ నాలుగు జట్లు ప్లేఆఫ్స్ ఆడనున్నాయి.

కట్టడి చేసిన ఆర్సీబీ.. ధోనీ, జడేజా అద్భుతంగా పోరాడినా..

219 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ తడబడింది. ప్లేఆఫ్స్ చేరాలంటే అవసరమైన 201 పరుగులు కూడా చేయలేకపోయింది. 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్లకు 191 పరుగులకే పరిమితం అయింది. చివర్లో చెన్నై దిగ్గజ ప్లేయర్ ఎంఎస్ ధోనీ 13 బంతుల్లో 25 పరుగులతో పోరాడాడు. 3 ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. ప్లేఆఫ్స్ చేరాలంటే చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. తొలి బంతికి భారీ సిక్స్ కొట్టినా.. తదుపరి బంతికి క్యాచౌట్ అయ్యాడు. రవీంద్ర జడేజా 22 బంతుల్లో 42 పరుగులు (నాటౌట్) పోరాడాడు. అయితే చెన్నైకు పరాజయం తప్పలేదు. 201 పరుగుల మార్క్ దాటలేక ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది ఐదుసార్లు చాంపియన్ చెన్నై.

బెంగళూరు బౌలర్లలో యశ్ దయాళ్ రెండు వికెట్లు తీశాడు. ఒత్తిడిలో చివరి ఓవర్ వేసి.. తొలి బంతికి సిక్స్ ఇచ్చినా ఆ తర్వాత ధోనీని ఔట్ చేశాడు. చెన్నైను కట్టడి చేశాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్, మహమ్మద్ సిరాజ్, లూకీ ఫెర్గ్యూసన్, కామెరూన్ గ్రీన్ చెరో వికెట్ తీశారు.

రచిన్ ఒక్కడే..

219 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (0) తొలి బంతికే గోల్డెన్ డకౌట్ కాగా.. రచిన్ రవీంద్ర (37 బంతుల్లో 61 పరుగులు; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత అర్ధ సెంచరీ చేశాడు. అజింక్య రహానే (33) కాసేపు నిలువగా.. డారిల్ మిచెల్ (4), శివమ్ దూబే (7), మిచెల్ సాంట్నర్ (3) విఫలమయ్యారు. రచిన్ రనౌట్ కావడం చెన్నైకు భారీ ఎదురుదెబ్బగా మారింది. సాంట్నర్ క్యాచ్‍ను ఆర్సీబీ కెప్టెన్ పాఫ్ డుప్లెసిస్ అద్బుతంగా అందుకున్నాడు. చివర్లో ధోనీ, జడేజా పోరాడినా ఫలితం లేకపోయింది. చెన్నై ఓటమి పాలై.. ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది.

అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (39 బంతుల్లో 54 పరుగులు; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శకతంతో రాణించగా..  స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 47 పరుగులు; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), రజత్ పాటిదార్ (23 బంతుల్లో 41 పరుగులు; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కామెరూన్ గ్రీన్ (17 బంతుల్లో 38 పరుగులు నాటౌట్) రాణించారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు, తుషార్ దేశ్‍పాండే, మిచెల్ సాంట్నర్ తలా ఓ వికెట్ తీశారు.

ప్లేఆఫ్స్‌కు బెంగళూరు.. చెన్నై ఎలిమినేట్

ఈ సీజన్‍లో బెంగళూరు, చెన్నై లీగ్ దశ మ్యాచ్‍లు ముగిశాయి. బెంగళూరు 14 మ్యాచ్‍ల్లో ఏడు గెలిచింది. 0.459 నెట్‍రన్ రేట్ సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానాన్ని ఫిక్స్ చేసుకొని ప్లేఆఫ్స్ చేరింది. చెన్నై కూడా 14 మ్యాచ్‍ల్లో ఏడు గెలిచినా.. ఆర్సీబీ కంటే తక్కువ నెట్ రన్‍రేట్ (0.392) ఉండటంతో ఐదో స్థానానికి పరిమితమై ఎలిమినేట్ అయింది. 

Whats_app_banner