IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే.. క్వాలిఫయర్-1లో హైదరాబాద్-ipl 2024 playoffs schedule match dates venues srh vs kkr rr vs rcb ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే.. క్వాలిఫయర్-1లో హైదరాబాద్

IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే.. క్వాలిఫయర్-1లో హైదరాబాద్

Chatakonda Krishna Prakash HT Telugu
May 20, 2024 06:44 AM IST

IPL 2024 Playoffs Schedule : ఐపీఎల్ 2024 సీజన్‍లో ప్లేఆఫ్స్ సమరం జరగనుంది. కోల్‍కతా, హైదరాబాద్, రాజస్థాన్, బెంగళూరు ప్లేఆఫ్స్ చేరాయి. ఈ నాలుగు జట్ల మధ్య ప్లేఆఫ్స్ పోరు ఉండనుంది. ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇక్కడ చూడండి.

IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే.. క్వాలిఫయర్-1లో హైదరాబాద్
IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే.. క్వాలిఫయర్-1లో హైదరాబాద్

IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 సీజన్‍లో ప్లేఆఫ్స్ పోరు జరగనుంది. లీగ్ దశ మ్యాచ్‍లు పూర్తయ్యాయి. ఒక్క రోజు గ్యాప్ తర్వాత మే 21 నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్‍లు మొదలుకానున్నాయి. లీగ్ దశలో చివరిదైన కోల్‍కతా నైట్‍రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఆదివారం (మే 19) వర్షం వల్ల రద్దయింది. ఆదివారం మధ్యాహ్నం మ్యాచ్‍లో పంజాబ్‍పై సన్‍రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. మొత్తంగా హైదరాబాద్ పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని దక్కించుకొని అదరగొట్టింది.

yearly horoscope entry point

ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్‌కు కోల్‍కతా నైట్‍రైడర్స్, సన్‍రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అడుగుపెట్టాయి. మిగిలిన ఆరు జట్లు ఎలిమినేట్ అయిపోయాయి. కోల్‍కతా టాప్‍ ప్లేస్‍తో ప్లేఆఫ్స్‌లో అడుగుపెడితే రెండో ప్లేస్‍ను హైదరాబాద్ దక్కించుకుంది. రాజస్థాన్, బెంగళూరు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్స్ చేరాయి.

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే

  • క్వాలిఫయర్ 1 - మే 21 - కోల్‍కతా నైట్‍రైడర్స్ vs సన్‍రైజర్స్ హైదరాబాద్ - అహ్మదాబాద్‍లో
  • ఎలిమినేటర్ - మే 22 - రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - అహ్మదాబాద్‍లో
  • క్వాలిఫయర్ 2 - మే 24 - క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు vs ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు - చెన్నైలో..
  • ఫైనల్ - మే 26 - క్వాలిఫయర్ 1 విజేత vs క్వాలిఫయర్ 2 విజేత

ప్లేఆఫ్స్‌లో క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుండగా.. క్వాలిఫయర్ 2, ఫైనల్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనున్నాయి.

టాప్-2లో ఉన్న కోల్‍కతా నైట్‍రైడర్స్, సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్లేఆఫ్స్‌లో రెండు అవకాశాలు ఉంటాయి. క్వాలిఫయర్ 1లో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరవచ్చు. ఒకవేళ ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2లో మరో అవకాశం ఉంటుంది. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న రాజస్థాన్, బెంగళూరుల్లో ఏ జట్టు ఫైనల్ చేరాలన్నా రెండు మ్యాచ్‍లు గెలవాలి. ఎలిమినేటర్‌లో ఓడిన జట్టు నిష్క్రమిస్తుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన టీమ్ మళ్లీ క్వాలిఫయర్ 2 ఆడి గెలిస్తేనే ఫైనల్ చేరుతుంది.

ప్లేఆఫ్స్ జట్ల పాయింట్లు ఇలా..

ఈ ఐపీఎల్ 2024 సీజన్ అంతా దుమ్మురేపిన కోల్‍కతా నైట్‍రైడర్స్ లీగ్ దశ పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచింది. 14 మ్యాచ్‍ల్లో 9 గెలిచి, 3 ఓడగా.. రెండు రద్దయ్యాయి. దీంతో 20 పాయింట్లతో టాప్‍లో నిలిచింది. సన్‍రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్‍ల్లో 8 గెలిచి, ఐదు ఓడగా.. ఈ మ్యాచ్ క్యాన్సల్ అయింది. దీంతో 17 పాయింట్లతో (నెట్‍ రన్‍రేట్ 0.414)తో రెండో ప్లేస్ దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ కూడా 8 గెలుపు, 5 ఓటములు, ఓ మ్యాచ్ రద్దుతో 17 పాయింట్లు (0.273) దక్కించుకున్నా నెట్‍ రన్‍రేట్ తక్కువగా ఉండటంతో మూడో ప్లేస్‍లో నిలిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 14 మ్యాచ్‍ల్లో ఏడు గెలిచి.. ఏడు ఓడి ప్లేఆఫ్స్ చేరింది. చివర్లో వరుసగా ఆరు మ్యాచ్‍లు గెలిచి.. అనూహ్యంగా ప్లేఆఫ్స్ చేరింది.

టోర్నీ ఆరంభంలో తొలి తొమ్మిది మ్యాచ్‍ల్లో 8 గెలుపులతో రాజస్థాన్ రాయల్స్ దుమ్మురేపింది. అయితే, తర్వాతి ఐదు మ్యాచ్‍ల్లో వరుసగా నాలుగు ఓడగా.. చివరి మ్యాచ్ రద్దయింది. దీంతో మూడో ప్లేస్‍తో ప్లేఆఫ్స్ చేరింది. ఆదివారం జరిగిన మ్యాచ్‍లో పంజాబ్‍పై సన్‍రైజర్స్ హైదరాబాద్ నాలుగు వికెట్ల తేడాతో భారీ లక్ష్యాన్ని ఛేదించి దుమ్మురేపింది. రెండో ప్లేస్‍కు వెళ్లి.. క్వాలిఫయర్-1లో అడుగుపెట్టింది.

Whats_app_banner