Pbks vs RR: ప్లేఆఫ్స్ ముంగిట రాజస్థాన్ తడబాటు - వరుసగా నాలుగో ఓటమి - పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిన సంజూ సేన
Pbks vs RR: ప్లేఆఫ్స్ ముందు వరుసగా నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌ను పంజాబ్ కింగ్స్ ఐదు వికెట్లు తేడాతో చిత్తుగా ఓడించింది.

Pbks vs RR: ఐపీఎల్ 2024 ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయింది రాజస్థాన్ రాయల్స్. ముంబై, చెన్నై వంటి బలమైన జట్లను చిత్తుగా ఓడించింది. అందరి కంటే ముందుగా పదహారు పాయింట్లు సాధించింది. రాజస్థాన్ దూకుడు చూస్తే అలవోకగా ప్లేఆఫ్స్ చేరుకోవడమే కాకుండా ఫైనల్ కూడా వెళుతుందని అభిమానులు భావించారు. సీన్ కట్ చేస్తే వరుసగా నాలుగో ఓటమితో ప్లేఆఫ్స్ బెర్తును ఇప్పటికీ ఖరారు చేసుకోలేదు. బుధవారం పంజాబ్ కింగ్స్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్.
సింపుల్ టార్గెట్...
రాజస్థాన్ విధించిన 145 పరుగుల సింపుల్ టార్గెట్‌ను మరో ఏడు బాల్స్ మిగిలుండగానే పంజాబ్ కింగ్స్ ఛేదించింది. ఈజీ టార్గెట్‌ను ఛేదించడంలో పంజాబ్ టాప్ ఆర్డర్ తడబడటంతో మ్యాచ్ ఆసక్తిగా మారేలా కనిపించింది. పంజాబ్ ఓపెనర్లు బెయిర్ స్టో (14 రన్స్), ప్రభ్ సిమ్రాన్ (6 రన్స్) తక్కువ పరుగులకే ఔటయ్యారు. ఈ సీజన్‌లో పరుగుల వరద పారించిన శశాంక్ సింగ్ డకౌట్ కావడం, హిట్టర్ రూసో కూడా 22 పరుగులకే వెనుదిరగడంతో 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పంజాబ్ కష్టాల్లో పడింది.
కెప్టెన్సీ ఇన్నింగ్స్...
ఈ తరుణంలో సామ్ కరన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌కు విజయాన్ని అందించాడు. రాజస్థాన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. జితేన్ శర్మ (22 రన్స్), అశుతోష్ శర్మ (17 పరుగులు)లతో కలిసి పంజాబ్‌ను సామ్ కరన్ గెలుపు బాట పట్టించాడు. చివరి వరకు క్రీజులో ఉన్న సామ్‌కరన్ 41 బాల్స్‌లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 145 పరుగుల టార్గెట్‌ను 18.5 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి ఛేదించింది పంజాబ్. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. బౌల్ట్‌కు ఓ వికెట్ దక్కింది.
రియాన్ పరాగ్...అశ్విన్ మినహా...
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 144 పరుగులు మాత్రమే చేసింది. రియాన్ పరాగ్, అశ్విన్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ దారుణంగా విఫలమయ్యారు. పరాగ్ 34 బాల్స్‌లో ఆరు ఫోర్లతో 48 రన్స్ చేయగా...అశ్విన్ 19 బాల్స్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 రన్స్ చేశారు. పంజాబ్ బౌలర్ల విజృంభణతో రాజస్థాన్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ అందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరుకున్నారు. పంజాబ్ బౌలర్లలో సామ్‌కరన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
నాలుగో ఓటమి...
ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న పంజాబ్‌కు ఈ విజయం ఊరటనిచ్చింది. మరోవైపు రాజస్థాన్‌కు వరుసగా నాలుగో ఓటమి ఇది. పాయింట్స్ టేబుల్‌లో పదహారు పాయింట్లతో రాజస్థాన్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఒక్క మ్యాచ్‌లో విజయం సాధిస్తే మిగిలిన టీమ్‌లతో సంబంధం లేకుండా రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. కానీ ఆ గెలుపు మాత్రం రాజస్థాన్‌కు దక్కడం లేదు. చివరి లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతాతో రాజస్థాన్ తలపడనుంది. ఆ మ్యాచ్‌లోనే గెలిస్తే రాజస్థాన్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన రాజస్థాన్ ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. కానీ రెండో స్థానంలో నిలవడం మాత్రం కష్టమవుతుంది.