Uppal IPL Match Metro Extended : ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్, అర్ధరాత్రి వరకూ మెట్రో సేవలు పొడిగింపు
Uppal IPL Match Metro Extended : ఉప్పల్ స్టేడియంలో ఇవాళ సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరగనుంది. క్రికెట్ ఫ్యాన్స్ కోసం హైదరాబాద్ మెట్రో సేవలను పొడిగించింది. అర్ధరాత్రి వరకూ మెట్రో రైళ్లు నడపనున్నారు.
Uppal IPL Match Metro Extended : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో బుధవారం రాత్రి సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ (SRH Vs MI)మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ను వీక్షించే ప్రేక్షకుల కోసం టీఎస్ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సుల ఏర్పాటు చేసింది. అలాగే హైదరాబాద్ మెట్రో సేవలను(Hyderabad Metro) పొడిగించారు. ఉప్పల్ మార్గంలో ఇవాళ మెట్రో రైళ్లు నిర్ణీత సమయానికి మించి నడుస్తాయని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఉప్పల్ మార్గంలో చివరి రైలు అర్ధరాత్రి 12.15 గంటలకు బయలుదేరి 1.10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని స్పష్టం చేశారు. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్లలో మాత్రం నిర్ణీత సమయం వరకే ప్రవేశానికి అనుమతి ఇస్తామని చెప్పారు. ఇతర స్టేషన్లలో ఎగ్జిట్‌లు అందుబాటులో ఉంటాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.
టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగే సన్ రైజర్స్ హైదరాబాద్ - ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్(SRH Vs MI IPL Match) నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు(TSRTC Buses) ఏర్పాటు చేసింది. క్రికెట్ అభిమానుల కోసం హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతుంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై తిరిగి రాత్రి 11:30 గంటల వరకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయని టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులను క్రికెట్ అభిమానులు వినియోగించుకొని మ్యాచ్‌ను వీక్షించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
బుధవారం సాయంత్రం ఉప్పల్ స్టేడియం చుట్టు ప్రక్కల ట్రాఫిక్ ఆంక్షలు(Uppal Traffic Diversions) ఉంటాయని రాచకొండ సీపీ తరుణ్ జోషి చెప్పారు. భారీ వాహనాలకు అనుమతిలేదన్నారు. మొత్తం 4 వేల కార్లు, 6 వేల ద్విచక్క వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు చేశామన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు సీపీ తరుణ్ జోషి ప్రకటించారు. ఉప్పల్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఉన్న ఉప్పల్ స్టేడియంలో బుధవారం సాయంత్రం ఏడున్నర నుంచి ఐపీఎల్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్టు(Traffic Diverstions) వెల్లడించారు. చెంగిచర్ల, బోడుప్పల్, ఫిర్జాదిగూడ నుంచి ఉప్పల్ స్టేడియం వైపు వచ్చే వాహనాలను టయోటా షో రూమ్-హెచ్‌ఎండీఏ భాగ్యత్ రోడ్డులోకి దారి మళ్లిస్తారు. ఈ వాహనాలు హెచ్‌ఎండీఏ భాగ్యత్-నాగోల్ మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఎల్‌బీ నగర్-నాగోల్-ఉప్పల్ మీదుగా వెళ్లే భారీ వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్ దిగువున టర్న్ తీసుకుని హెచ్‌ఎండీఏ లే ఔట్, బోడుప్పల్, చెంగిచర్ల క్రాస్ రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుందని సీపీ తెలిపారు. తార్నాక నుంచి వచ్చే వాహనాలు హబ్సిగూడ క్రాస్ రోడ్డు నుంచి నాచారం, చర్లపల్లి ఐఓసీఎల్ వైపు వెళ్లాలని తెలిపారు.
ఈ వస్తువులను అనుమతించరు
ఐపీఎల్ మ్యాచ్ కోసం మొత్తం 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో 39 వేల సీటింగ్ కెపాసిటీ ఉందని పేర్కొన్నారు. బుధవారం రాత్రి జరిగే ఈ మ్యాచ్ కోసం స్టేడియం వద్ద 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. స్టేడియం లోపల, వెలుపల భారీగా పోలీసుల బందోబస్తు ఉంటుందన్నారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ల్యాప్ ట్యాప్, బ్యానర్స్, లైటర్స్, బైనాక్యులర్స్, సిగరెట్లు నిషేధమని సీపీ చెప్పారు. కేవలం బ్లూటూత్స్ మాత్రమే అనుమతిస్తామన్నారు. ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో షీ టీమ్స్ (She Teams)మఫ్టీలో ఉంటాయని, ఆకతాయిల పనిపెట్టేందుకు సిద్ధంగా ఉంటారని సీపీ తరుణ్ జోషి(CP Tarun Joshi) తెలిపారు. ఆక్టోపస్ టీమ్స్ కూడా బందోబస్తులో ఉన్నాయని స్పష్టం చేశారు. బుధవారం 3 గంటల ముందు నుంచి మాత్రమే స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తామన్నారు.
సంబంధిత కథనం