Hyderabad Metro Trains : హైదరాబాద్ మెట్రో పై మహాలక్ష్మి ఎఫెక్ట్- తగ్గిన మహిళా ప్రయాణికుల సంఖ్య-hyderabad mahalakshmi free travel in rtc bus scheme effects women passengers drop in metro train ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Metro Trains : హైదరాబాద్ మెట్రో పై మహాలక్ష్మి ఎఫెక్ట్- తగ్గిన మహిళా ప్రయాణికుల సంఖ్య

Hyderabad Metro Trains : హైదరాబాద్ మెట్రో పై మహాలక్ష్మి ఎఫెక్ట్- తగ్గిన మహిళా ప్రయాణికుల సంఖ్య

HT Telugu Desk HT Telugu
Mar 16, 2024 10:04 PM IST

Hyderabad Metro Trains : మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుంది ప్రభుత్వం. అయితే మహాలక్ష్మి ఎఫెక్ట్ హైదరాబాద్ మెట్రోపై పడింది. మహిళలు బస్సు ప్రయాణాలకే మొగ్గుచూపడంతో మెట్రోలో మహిళ ప్రయాణికుల సంఖ్య తగ్గుతోంది.

 హైదరాబాద్ మెట్రో పై మహాలక్ష్మి ఎఫెక్ట్
హైదరాబాద్ మెట్రో పై మహాలక్ష్మి ఎఫెక్ట్

Hyderabad Metro Trains : హైదరాబాద్ మెట్రో రైళ్లపై (Hyderabad Metro) మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్ పడింది. నిత్యం కిక్కిరిసే ప్రయాణికులతో పరుగులు పెట్టే మెట్రోలో మహిళా ప్రయాణికుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది.హైదరాబాద్ సిటీ బస్సులో(City Buses) మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తేవడంతో మధ్యతరగతి మహిళలు, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులు మెట్రో నుంచి సిటీ బస్సులోకి మారారు. దీంతో గత ఏడాది 5.5 లక్షలు దాటిన మెట్రో మహిళా ప్రయాణికులు ప్రస్తుతం 4.8 లక్షలు నుంచి 4.9 లక్షలు మధ్య నమోదు అయినట్లు ఎల్ అండ్ టీ అధికారులు వెల్లడించారు.

మెట్రోలో 5-10 శాతం తగ్గిన మహిళా ప్రయాణికులు

ఏటా మెట్రోలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా......ఈ ఏడాది మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme)కారణంగా మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గు ముఖం పట్టినట్లు మెట్రో (Hyderabad Metro)అధికారులు పేర్కొన్నారు. నగరంలోని మూడు ప్రధాన కారిడార్ లలో మెట్రోలు ప్రతిరోజు 1034 ట్రిప్పులు తిరుగుతున్నాయి. రద్దీ తీవ్రత ఎక్కువగా ఉన్న నాగోల్ - రాయదుర్గం, ఎల్బీనగర్- మియాపూర్ రూట్ లలో ప్రతి మూడు నిమిషాలకు ఒక మెట్రో అందుబాటులో ఉంది. ఇక జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ రూట్లో మాత్రం ప్రయాణికులు సంఖ్య కాస్త తక్కువ ఉండడంతో ఈ రూట్లో ప్రతీ 15 నిమిషాలకు ఒకటి చొప్పున నడుస్తున్నాయి. డిసెంబర్ 9వ తేదీన నుంచి ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమల్లోకి రావడంతో మహిళా ప్రయాణికులు తగ్గారు. ఈ ఏడాది ఆరున్నర లక్షలు ప్రయాణికులు మెట్రోలో ప్రయాణం చేస్తారని అధికారులు అంచనా వేయగా...... అందుకు భిన్నంగా మహాలక్ష్మి కారణంగా సుమారు 5 నుంచి 10 శాతం ప్రయాణికులు తగ్గడం గమనార్హం.

గత ఏడాది రికార్డ్ స్థాయిలో ప్రయాణికుల రాకపోకలు

గత సంవత్సరం జులై మొదటి వారంలో రికార్డు స్థాయిలో 5.10 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేశారు. హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) చరిత్రలో మొట్టమొదటిసారి ప్రయాణికుల సంఖ్య 5 లక్షల దాటింది. రహదారుల పైన వాహనాలు రద్దీ, కాలుష్యం తదితర కారణాలు దృశ్య నగరవాసులు మెట్రోకు ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. మరో వైపు వేగంగా, ఎలాంటి ఆటంకాలు లేని విధంగా పూర్తి ఏసీ సదుపాయంతో ప్రయాణం అందజేయడంతో ఎక్కువగా మెట్రో రైల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపే వారు.కేవలం నగరవాసులే కాకుండా పర్యాటకులు, వివిధ పనుల రీత్యా హైదరాబాద్ కు వచ్చిన వాళ్లు సైతం మెట్రోలోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. గత ఏడాది లెక్కల ప్రకారం..... మియాపూర్ - ఎల్బీనగర్(Miyapur LB Nagar) కార్డినర్ లో ప్రతిరోజు 2.6 లక్షల మంది ప్రయాణించగా....నాగోల్ - రాయదుర్గం కారిడార్ లో 2.25 లక్షల మంది రాకపోకలు సాగించారు. జూబ్లీహిల్స్ బస్ స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వరకు రోజుకు 25,000 మంది ప్రయాణం చేశారు. కానీ మహాలక్ష్మి పథకం కారణంగా ఈ మూడు కారిడార్ లలో కలిపి కేవలం ఇప్పుడు 30 వేల మందికి పైగా మహిళలు సిటీ బస్సులోకి మారినట్లు మెట్రో అధికారులు తెలిపారు.

వర్క్ ఫ్రమ్ హోం కూడా ఒక కారణమే

ప్రత్యేకంగా ఈ రెండు నెలల్లోనే ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని ఎల్ అండ్ టీ (L&T)అధికారులు అంటున్నారు. మహాలక్ష్మి పథకంతో పాటు మరికొన్ని అంశాలు కూడా అందుకు కారణం కావచ్చు అన్నారు. నగరంలో మెట్రో రైళ్లను ప్రారంభించినప్పటి నుంచి ఐటీ కారిడార్ లకు రాకపోకలు సాగించే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు(Software Employees) మెట్రో సేవలను గణనీయంగా వినియోగించుకున్నారు. క్రమంగా విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు మెట్రోలో ప్రయాణం మొదలుపెట్టారు. ప్రస్తుతం ప్రతిరోజు 1.40 లక్షల మంది సాఫ్ట్ వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు(IT Employees) మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. కానీ కొన్ని సంస్థలు ఇంకా వారికి వర్క్ ఫ్రమ్ హోం(Work From Home) కొనసాగిస్తున్నాయి. దీంతో చాలామంది ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారు. ఈ కారణంగా మెట్రోలో ప్రయాణం చేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరినాటికి సుమారు మెట్రో(Hyderabad Metro) ప్రయాణికుల సంఖ్య 6.7 లక్షలకు చేరుకోవచ్చని అంచనాల వేగా వివిధ కారణాల వల్ల అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా