Old City Metro Rail Project : పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన - ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తామన్న సీఎం రేవంత్-cm revanth laying foundation stone for the construction of old city metro rail project at falaknuma ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Old City Metro Rail Project : పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన - ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తామన్న సీఎం రేవంత్

Old City Metro Rail Project : పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన - ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తామన్న సీఎం రేవంత్

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 08, 2024 07:50 PM IST

Old City Metro Rail Project News: పాతబస్తీ మెట్రోరైలు ప్రాజెక్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

పాతబస్తీ మెట్రోకి శంకుస్థాపన
పాతబస్తీ మెట్రోకి శంకుస్థాపన

Old City Metro Rail Project: పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టు(Old City Metro Rail Project) శుక్రవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) మాట్లాడుతూ.. కులీ కుతుబ్ షాహీ నుంచి నిజాం వరకు నగర అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. హైదరాబాద్ నగర(Hyderabad City) ప్రతిష్టను నిలబెట్టడానికే మేం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళుతున్నామని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. మిగతా సమయంలో అభివృద్ధిపైనే తమ దృష్టి ఉంటుందన్నారు.

“ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఇది ఒరిజినల్ హైదరాబాద్ సిటీ. ఒరిజినల్ సిటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు మేం కృషి చేస్తున్నాం. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. ఇందుకోసం ఇప్పటికే లండన్ థెమ్స్ నగరాన్ని అక్బరుద్దీన్ తో కలిసి సందర్శించాం. పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో ఫెజ్-2 ను తీసుకొస్తున్నాం. ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవర్ పల్లి నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణ చేయనున్నాం. చాంద్రాయణగుట్టలో మెట్రో జంక్షన్ ను(Hyderabad Metro) ఏర్పాటు చేయబోతున్నాం. చంచల్ గూడ జైలును తరలించి విద్యార్థుల కోసం పాఠశాల, కళాశాలలు నిర్మిస్తాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్ సిటీలోప్రతీ గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మైనారిటీల కోసం 4శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేశారు. రాష్ట్రంలో పదేళ్లపాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని కామెంట్స్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని పునరుద్ఘాటించారు. గండిపేట నుంచి నగరంలోని 55కి.మీ ల పరిధిలో మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.

పాతబస్తీ మెట్రోకు(Old City Metro Rail) శంకుస్థాపన చేయడంతో మెట్రో రెండో దశకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు అయింది. ఫలక్ నుమా నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంద్రాయణ గుట్ట వరకు మెట్రోను పొడిగించి అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ చేపట్టబోతుంది.  అలాగే నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు అక్కడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో అందుబాటులోకి రానుంది. ఈ రూట్ లో చాంద్రయాణగుట్ట అతిపెద్ద ఇంటర్ చేంజ్ స్టేషన్ గా ఏర్పడనుంది.  తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మెట్రో రెండో దశలో మొత్తం 70 కిలోమీటర్ల మార్గం నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో అధికారులు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు.

మరోవైపు ఎయిర్ పోర్టు(Shamshabad Airport)మార్గంలో అధికారులు భూసార పరీక్షలు నిర్వహించి మెట్రో అలైన్మెంట్ ను ఎంపిక చేశారు. 29 కిలోమీటర్ల ఈ రూట్ లో భూసేకరణపై తాజాగా దృష్టి సాధించారు. మూడు నెలల్లో పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో రెండో దశకు రూ.18,900 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాంకులు, జైకా లాంటి సంస్థల నుంచి రుణాలు పొందేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.  మెట్రో నిర్మాణం ఒప్పందం ప్రకారం కేంద్రం 35% నిధులు ఇవ్వాల్సి ఉండగా..... 20% నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చునుంది. మిగతా మొత్తాన్ని రుణాల రూపంలో సేకరిస్తారు. హైదరాబాద్ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి...... అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే ఆయన మూసీని అభివృద్ధి చేయాలని సంకల్పించారు.