Hyderabad Metro : పాతబస్తీలో మెట్రో పరుగులు, ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలాక్ నుమా వరకు 5.5 కిలోమీటర్లు మెట్రో మార్గాన్ని రెండో దశలో చేపట్టనున్నారు.
Hyderabad Metro : హైదరాబాద్ పాతబస్తీ మెట్రోకు(Oldcity Metro) ముహూర్తం ఖరారైంది. ఈనెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఫలక్ నుమా వద్ద శంకుస్థాపన చేయనున్నారు. మొదటి దశలో జూబ్లీహిల్స్ బస్ స్టేషన్ నుంచి ఫలక్ నుమా వరకు చేపట్టిన మెట్రో ఎంజీబీఎస్ వరకే పరిమితం అయిందని మిగిలిన ఎంజీబీఎస్ నుంచి ఫలాక్ నుమా వరకు 5.5 కిలోమీటర్లు మెట్రో మార్గాన్ని ప్రస్తుతం చేపట్టినట్టు హైదరాబాద్ మెట్రో (Hyderaba Metro)రైల్ మ్యానేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. దారుల్ పిషా, పురాని హవేలీ, ఏతేబార్ చౌక్, అలిజాకొట్ల, శాలిబండ, శంశీర్ గాంజ్, అలియాబాద్ నుంచి ఫలాక్ నుమా వరకు ఈ మెట్రో రైలు అందుబాటులోకి రానుంది.
ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
ఈ మార్గాల్లో సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ ఫలక్ నుమా స్టేషన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. చారిత్రక ప్రదేశాలకు 500 మీటర్ల దూరంలో ఒక స్టేషన్ ఉంటుంది. చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియంలో చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని రెండు స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ రూట్ లో రోడ్డు విస్తరణలో భాగంగా మొత్తం 1100 నిర్మాణాలపై ప్రభావం పడనుంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ల వరకు రోడ్డు విస్తరణ చేపడతారు. మెట్రో స్టేషన్ల వద్ద రోడ్డు విస్తరణ 12 ఫీట్ల వరకు ఉంటుంది. పాతబస్తీ మెట్రో నిర్మాణానికి సుమారు రూ. 2000 కోట్లు అవసరమని అంచనా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు సాధ్యమైనంత వరకు మతపరమైన నిర్మాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మెట్రో నిర్మాణం చేపట్టినట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
మొత్తం 70 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ నిర్మాణం
పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేయడంతో మెట్రో రెండో దశకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఫలక్ నుమా నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంద్రాయణ గుట్ట వరకు మెట్రోను పొడిగించి అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ చేపట్టనున్న సంగతి తెలిసిందే. అలాగే నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు అక్కడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో అందుబాటులోకి రానుంది. ఈ రూట్ లో చాంద్రయాణగుట్ట అతిపెద్ద ఇంటర్ చేంజ్ స్టేషన్ గా ఏర్పడనుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మెట్రో రెండో దశలో మొత్తం 70 కిలోమీటర్ల మార్గం నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో అధికారులు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు.
రెండో దశ మెట్రో నిర్మాణం కోసం రూ.18,900 వ్యయం అంచనా
ఇటు ఎయిర్ పోర్టు(Shamshabad Airport)మార్గంలో అధికారులు భూసార పరీక్షలు నిర్వహించి మెట్రో అలైన్మెంట్ ను ఎంపిక చేశారు. 29 కిలోమీటర్ల ఈ రూట్ లో భూసేకరణపై తాజాగా దృష్టి సాధించారు. మూడు నెలల్లో పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో రెండో దశకు రూ.18,900 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాంకులు, జైకా లాంటి సంస్థల నుంచి రుణాలు పొందేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జైకా ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. మెట్రో నిర్మాణం ఒప్పందం ప్రకారం కేంద్రం 35% నిధులు ఇవ్వాల్సి ఉండగా..... 20% నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చునుంది. మిగతా మొత్తాన్ని రుణాల రూపంలో సేకరిస్తారు. హైదరాబాద్ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి...... అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే ఆయన మూసీని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. మరోవైపు హెచ్ఎండీఏ, గ్రేటర్ హైదరాబాద్ విస్తరణపై కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టారు.
కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం