Hyderabad Old City Metro Rail : పాతబస్తీ మెట్రోకు అడుగడుగునా సవాళ్లే, డ్రోన్ సర్వేలో తెలిసిందేంటి?-hyderabad old city metro rail project hml conduct drone survey religious building main issue ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Old City Metro Rail : పాతబస్తీ మెట్రోకు అడుగడుగునా సవాళ్లే, డ్రోన్ సర్వేలో తెలిసిందేంటి?

Hyderabad Old City Metro Rail : పాతబస్తీ మెట్రోకు అడుగడుగునా సవాళ్లే, డ్రోన్ సర్వేలో తెలిసిందేంటి?

Bandaru Satyaprasad HT Telugu
Aug 28, 2023 08:17 PM IST

Hyderabad Old City Metro Rail : పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణానికి అధికారులు డ్రోన్ సర్వే చేశారు. ఈ సర్వే ద్వారా ప్రాజెక్టులో ఎదురయ్యే అడ్డంకులను అంచనా వేశారు.

పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు

Hyderabad Old City Metro Rail : హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో నిర్మాణానికి హెచ్ఎంఆర్ ఆదివారం డ్రోన్ సర్వే చేపట్టింది. ఇప్పటికే సర్వే, భూసామర్థ్య పరీక్షలకు టెండర్లను పిలిచింది. తాజాగా ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు దాదాపు మూడు గంటల పాటు హెచ్ఎంఆర్ అధికారులు డ్రోన్ సర్వే చేశారు. దారుల్‌షిపా జంక్షన్‌ నుంచి శాలిబండ మధ్య ఇరుకైన మార్గంలో రోడ్డు విస్తరణ, మెట్రో స్టేషన్ల నిర్మాణంతో ప్రభావితమయ్యే ఆస్తుల కచ్చితమైన కొలతలను డ్రోన్‌ ద్వారా అధికారులు సేకరించారు. ఈ సర్వేలో కీలకమైన ఆటంకాలను మెట్రో అధికారులు గుర్తుంచారు. ఈ మార్గంలో 103 మతపరమైన, సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయి. ఇవి మెట్రో నిర్మాణానికి ప్రధాన సవాళ్లుగా ఉన్నాయన్నారు. మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను రక్షించేలా తగిన ఇంజినీరింగ్ పరిష్కారాలను రూపొందించడంలో ఈ డ్రోన్ సర్వే సాయపడుతుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రో అలైన్‌మెంట్, పిల్లర్ లోకేషన్ వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావం లేకుండా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. డ్రోన్ సర్వే లో రియల్ టైమ్ డేటా, హై రిజల్యూషన్ ఫొటోలు, త్రీడి మోడలింగ్, జీఐఎస్ డేటా త్వరితగతిన సేకరించవచ్చన్నారు.

103 మతపరమైన నిర్మాణాలు

పాతబస్తీ మెట్రో మార్గంలో... ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు మొత్తం ఆరు స్టేషన్లు నిర్మించాలని హెచ్ఎంఆర్ భావిస్తుంది. ఎంజీబీఎస్‌ స్టేషన్‌ తర్వాత సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, శంషేర్‌గంజ్‌, జంగంమెట్‌, ఫలక్‌నుమా వద్ద స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 5.5 కిలోమీటర్ల మెట్రో పనుల్లో 21 మసీదులు, 12 హిందూ దేవాలయాలు, 12 అషూర్‌ఖానాలు, 33 దర్గాలు, 7 సమాధి యార్డులు, 6 చిల్లాలతోపాటు మొత్తంగా 103 మతపరమైన, సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయని సర్వేలో తెలిసింది. ఈ నిర్మాణాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా మెట్రో ప్రాజెక్టు చేపట్టాల్సి ఉందని ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. డ్రోన్ సర్వే డేటా విశ్లేషిస్తున్నామన్నారు. ఇప్పటికే భూసామర్థ్య పరీక్షలకు టెండర్ల గడువు ముగిసిన కారణంగా త్వరలో క్షేత్రస్థాయిలో పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.

చారిత్రక కట్టడాలకు సమీపంలో

హైదరాబాద్ పర్యాటక రంగంలో అత్యంత ముఖ్యమైన సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌ మీదుగా పాతబస్తీ మెట్రో నిర్మించనున్నారు. ఈ చారిత్రక కట్టడాలకు 500 మీటర్ల దూరంలో మెట్రో స్టేషన్లు నిర్మించేందుకు హెచ్ఎంఆర్ ప్రణాళికలు రూపొందిస్తుంది. పాతబస్తీకి మెట్రో పూర్తి అయితే నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడడంతో పాటు పర్యాటకంగా హైదరాబాద్ మరింత ముందుగా సాగుతుందని విశ్లేషకులు అంటున్నారు. నగరానికి వచ్చే పర్యాటకులు మెట్రోను సద్వినియోగం చేసుకునే విధంగా ఈ నిర్మాణాలు ఉండనున్నాయి. పాతబస్తీ మెట్రో నిర్మాణంలో అంచనాల మేరకు వంద మీటర్లకు ఒక పిల్లర్‌తోపాటు వయాడక్టులు, స్టేషన్ల కోసం మొత్తంగా రూ.2000 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది.

IPL_Entry_Point