Hyderabad Crime News : మెట్రో స్టేషన్ల వద్ద చోరీలు, నిందితుడు అరెస్ట్ - 20 బైకులు స్వాధీనం-crime news man arrested for stealing bikes 20 vehicles recovered in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Crime News : మెట్రో స్టేషన్ల వద్ద చోరీలు, నిందితుడు అరెస్ట్ - 20 బైకులు స్వాధీనం

Hyderabad Crime News : మెట్రో స్టేషన్ల వద్ద చోరీలు, నిందితుడు అరెస్ట్ - 20 బైకులు స్వాధీనం

HT Telugu Desk HT Telugu
Jan 26, 2024 07:13 PM IST

Hyderabad Crime News : మెట్రో స్టేషన్ల వద్ద పార్క్ చేసిన బైకుల చోరీకి పాల్పడుతున్న ఓ పాత నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 20 బైకులను స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న బైకులు
స్వాధీనం చేసుకున్న బైకులు

Hyderabad Crime News :హైదరాబాద్ లో వివిధ మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని ఎల్బీనగర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి 20 బైకులను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎల్బీనగర్ డిసిపి ప్రవీణ్ కుమార్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.

ఒంగోలు జిల్లా కుడిపి మండలం కొయ్యవారి పొలం గ్రామానికి చెందిన పల్లెపోగు సిద్దయ్య ఒంగోలు మర్రి గూడ, సింగరాయకొండ ,కావలి టంగుటూరు తదితర పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడి రెండు సార్లు జైలుకు సైతం వెళ్ళాడు. 2020లో జైలు నుంచి విడుదలైన సిద్దయ్య.....అనంతరం కుటుంబంతో సహా మేడ్చల్ జిల్లా సుభాష్ నగర్ కాలనీకి వలస వచ్చి తాపీ మేస్త్రిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన అతడికి తాపీ మేస్త్రి పనితో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ద్విచక్ర వాహనాల చోరీలకు పథకం పన్నాడు. ఈ క్రమంలోనే నగరంలోని మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్లో ఉంచిన బైక్ల చోరీలకు పాల్పడుతు... వస్తున్నాడు.

చోరీ చేసిన వాహనాలను కొన్ని రోజులపాటు హైదరాబాద్ లోనే వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టి ఆ తర్వాత తన స్వస్థలానికి తరలించి అక్కడ విక్రయించేవాడు.మెట్రో స్టేషన్ ల వద్ద బైకులు చోరీలకు గురి అవుతున్నాయని బాధితుల నుంచి పోలీసులు ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో ఎల్బీనగర్ పోలీసులు మెట్రో స్టేషన్ వద్ద నిఘా ఏర్పాటు చేసి చోరీ కోసం వచ్చిన సిద్దయ్యను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని విచారించగా ఎల్బీనగర్ పిఎస్ పరిధిలో 5, ఉప్పల్లో 5 కూకట్పల్లిలో 3 ,మియాపూర్లో 2, కేపిహెచ్పి లో 1, ఇతర ప్రాంతంలో 3 బైకులు సహా మొత్తం 20 బైకులను చోరీ చేసినట్లు నిందితుడు సిద్దయ్య అంగీకరించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిద్దయ్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

రూ.35 లక్షలు టోకరా

వృద్ధులకు సేవ చేస్తున్నట్లు నటిస్తూ వారి నుంచి ఓ యువకుడు రూ. 35 లక్షలు కాజేసిన సంఘటన మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజేశ్వరి అనే మహిళ భర్త జన్మిత్ సింగ్ తో కలిసి రహమత్ నగర్ లో నివాసం ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన విక్రమాదిత్య అలియాస్ సందీప్ గత కొన్నేళ్లుగా తరచు వారి ఇంటికి వచ్చి పోతూ ఉండేవాడు. వృద్ధులైన వారికి ఇంటి పనులు సాయం చేసేవాడు. ఈ క్రమంలో 2020లో సందీప్ జన్నిత్ సింగ్ నుంచి రూ.10 లక్షలు అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వలేదు. అంతేకాకుండా కరోనా సమయంలో తమకు తెలియకుండా ఆన్లైన్ ఎకౌంటింగ్ ద్వారా రూ.35.52 లక్షలను తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన రాజేశ్వరి సందీప్ కు ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు గురువారం మధుర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హిట్ అండ్ రన్ కేసులో నిందితులు అరెస్ట్

Jjubilee hills hit and run Case: రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద జరిగిన హిట్ అండ్ రన్ కేసులో నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీసులు గురువారం రిమాండ్ తరలించారు. ఏసిపి హరి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..…

తుకారం గేట్ కు చెందిన కొవ్వూరు రిత్విక్ రెడ్డికి ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చింది.బుధవారం రిత్వీక్ రెడ్డి డ్యూటీలో చేరాల్సి ఉంది. దీంతో తన స్నేహితులు పూలసాని లోకేశ్వరరావు, బుల్ల అఖిలేష్, మోగడంపల్లి అనిల్,అనికేత్ లకు తన ఆఫీస్ చూపించాలనుకున్నాడు.అందుకోసం స్నేహితులను తీసుకుని తన బావ నాగచైతన్ రెడ్డికి చెందిన వెర్నా కారును మంగళవారం రాత్రి అడ్డగుడ్డ నుంచి బయలుదేరాడు.

అక్కడే ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో మద్యం కొనుగోలు చేసి కార్లోనే తాగుతూ అర్ధరాత్రి గచ్చిబౌలి చేరుకొని తన ఆఫీస్ చూపించాడు. అనంతరం కేబుల్ బ్రిడ్జి వద్దకు వెళ్ళిన వారు కాసేపు అక్కడే డాన్స్ చేసి తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మాదాపూర్ వచ్చారు. అక్కడ బిర్యాని పాయింట్ లో బిర్యాని తిని నాలుగున్నర గంటలకు మళ్ళీ కేబుల్ బ్రిడ్జి వచ్చారు. కాసేపు అక్కడే ఉండి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.ఈ క్రమంలో మాదాపూర్ మీదుగా రుత్విక్ రెడ్డి అతివేగంగా కారు నడుపుతూ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి కమాన్ వద్ద ఓ స్కోటర్ ను ఢీ కొట్టి ఆగకుండా పారిపోయాడు. ఈ ఘటనలో స్కూటర్ నడుపుతున్న తారక్ రామ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.... వెనక కూర్చున్న రాజు అని వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.ప్రస్తుతం బాధితుడు యశోద ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

దర్యాప్తు చేపట్టిన జూబ్లీహిల్స్ పోలీసులు వందకు పైగా సీసీ కెమెరాలను జల్లెడ పట్టగా పంజాగుట్టలో ఓ సీసీ కెమెరాలో గుర్తించి గురువారం నిందితులను అరెస్ట్ చేశారు. రీత్విక్ రెడ్డి బిహెచ్ఇఎల్ లో దాచిపెట్టిన కారును సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా కారులో ఒక యువతి కూడా ఉనట్లు పోలీసులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత రిత్విక్ రెడ్డి బాలనగర్ లో ఉంటున్న తన బంధువు గుడిమెట్ల సురేష్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు. అనంతరం వీరిద్దరూ కలిసి ప్రమాదానికి కారణమైన కారులోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.అక్కడ పోలీసులు ఉండడంతో అక్కడి నుంచి పరారయ్యారు. సురేష్ రెడ్డి తన కారులో యువతీతో పాటు మిగతా ముగ్గురిని వారి ఇంట్లో దింపేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో సురేష్ రెడ్డి పై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని అతడి కోసం గాలిస్తున్నామని తెలిపారు.

రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

IPL_Entry_Point