CM Revanth vs Akbaruddin : అక్బరుద్దీన్ కామెంట్స్.. సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ - సభలో ఆగని మాటల యుద్ధం
Telangana Assembly Session Updates: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. విద్యుత్ పై చర్చ జరగగా..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగింది.
Akbaruddin Owaisi Vs CM Revanth Reddy: విద్యుత్ అంశంపై ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన ప్రసంగాన్ని తప్పుబట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గురువారం విద్యుత్ పై చర్చ సందర్భంగా… పలు అంశాలను ప్రస్తావించారు అక్బరుద్దీన్. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని చెప్పారు. పాతబస్తీలో గత ప్రభుత్వ హయాంలో రూ. 25 వేల కోట్ల అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. 2014తో పోలిస్తే తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి భారీగా పెరిగిందని చెప్పారు. నిరంతర విద్యుత్ అందించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా… పాతబస్తీలో విద్యుత్ బిల్లుల అంశాలను కూడా ప్రస్తావించారు అక్బరుద్దీన్.
ఇక అక్బరుద్దీన్ మాట్లాడుతున్న సందర్భంలో… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అక్బరుద్దీన్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని… కానీ ప్రభుత్వాన్ని తప్పుబట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఓల్డ్ సిటీ, న్యూసిటీ అనే తేడా మాకు లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను మాట్లాడని అక్బరుద్దీన్… కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓల్డ్ సిటీ, న్యూసిటీ అనే తేడా మాకు లేదన్నారు. గజ్వేల్, సిద్ధిపేటతో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ బకాయిలు ఎక్కువగా ఉన్నాయని… వాటిని వసూలు చేసే విషయంలో అక్కడ్నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
అక్బరుద్దీన్ కేవలం మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాత్రమే అని… ముస్లింలందరికీ నాయకుడు కాదన్నారు. జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్‌కు టికెట్ ఇస్తే మజస్లిస్ ఓడించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీని ఓడించడానికి కేసీఆర్, అక్బరుద్దీన్ కలిసి పని చేశారని కామెంట్స్ చేశారు. కామారెడ్డిలో అభ్యర్థిని నిలబెట్టని ఎంఐఎం… అజారుద్దీన్ పోటీ చేస్తున్న జూబ్లీహిల్స్ లో మాత్రం అభ్యర్థిని పోటీకి పెట్టారని గుర్తు చేశారు. శ్రీశైలంలో చోటు చేసుకున్న విద్యుత్ ప్రమాదంపై కూడా ఎంఐఎం మాట్లాడలేదన్నారు. ఈ ప్రమాదంలో ఫాతిమా అనే అమ్మాయి చనిపోతే కాంగ్రెస్ ఆదుకుందని గుర్తు చేశారు. కానీ ఆనాటి సీఎం, విద్యుత్ శాఖ మంత్రి కనీసం ఆ కుటుంబాలను పరామర్శించలేదన్నారు. బీఆరెస్ ప్రభుత్వం దుర్మార్గాలను సభలో ఎంఐఎం కనీసం ప్రస్తావించలేదని చెప్పారు. తన పాత స్నేహితుడిని రక్షించుకునేందుకు అక్బరుద్దీన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అలాంటి వారితో స్నేహం ఎంఐఎం కు మంచిది కాదని హితవు పలికారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్దిని శంకించాల్సిన పనిలేదన్నారు.
ఆ తర్వాత మళ్లీ మాట్లాడిన అక్బరుద్దీన్… సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. అనేక పార్టీల్లో తిరిగి వచ్చిన రేవంత్ రెడ్డి… హుందాగా వ్యవహరించాలని కోరారు. కాంగ్రెస్ మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఈ విషయంలో స్పందించిన రేవంత్ రెడ్డి… ఎంఐఎం కూడా అనేక పార్టీలతో కలిసి పని చేసిందని కౌంటర్ ఇచ్చారు. నాదెండ్ల భాస్కర్ రావు, చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్, కిరణ్ కుమార్ రెడ్డి అంటూ పలువురి ముఖ్యమంత్రుల పేర్లను ప్రస్తావించారు. దీంతో సభలో వాగ్వాదం నెలకొంది. ఓ దశలో ఎంఐఎం సభ్యులు వెల్ లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి కలుగజేసుకొని శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
సంబంధిత కథనం