Revanth CM Swearing In: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం
Revanth CM Swearing In: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్‌బి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళసై రేవంత్‌తో ప్రమాణం చేయించారు.
Revanth CM Swearing In: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్‌బి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళ సై రేవంత్ రెడ్డితో ప్రమాణం చేయించారు. మధ్యాహ్నం 1.20నిమిషాలకు రేవంత్ ప్రమాణం చేశారు.
తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సరిగ్గా 1.02నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఎల్‌బి స్టేడియం కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులతో నిండిపోయింది.
మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు ముహుర్తాన్ని ఖరారు చేసినా ఆ సమయానికి గవర్నర్ ప్రాంగణానికి చేరుకోలేకపోయారు. ట్రాఫిక్ దాటుకుని మధ్యాహ్నం 1.17నిమిషాలకు వేదికపైకి గవర్నర్ చేరుకున్నారు. ఆ వెంటనే జాతీయ గీతాలాపనతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సరిగ్గా 1.20నిమిషాలకు అనుముల రేవంత్ రెడ్డి అనే నేను అంటూ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దైవ సాక్షిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు.
మధ్యాహ్నం 12.40కు తాజ్ కృష్ణ హోటల్ నుంచి ఒకే కారులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కలిసి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి బయల్దేరు.
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. సోనియా, రాహుల్, ప్రియాంక ఉదయమే ఢిల్లీ నుంచి తరలి వచ్చారు. విమానాశ్రయంలో సోనియా కుటుంబానికి రేవంత్ స్వాగతం పలికారు.
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి తరలి వస్తున్న వాహనాలు అమరవీరుల స్థూపం వద్ద చిక్కుకుపోయాయి. డికె.శివకుమార్, సిద్ధరామయ్యలు వాహనాలు విడిచి నడుచుకుంటూ స్టేడియం ప్రాంగణానికి చేరుకున్నారు.
మంత్రుల ప్రమాణ స్వీకారం
ముఖ్యమంత్రితో పాటు మరో 11మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. సిఎం రేవంత్ రెడ్డి తర్వాత డిప్యూటీ సిఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహాలు ప్రమాణం చేశారు.
ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దనసరి అనసూయ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల్లో దామోదర్ రాజనరసింహ ఒక్కరే ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం పూర్తైన తర్వాత రేవంత్ రెడ్డి భార్యతో కలిసి సోనియాకు పాదాభివందనం చేశారు. తన కుమార్తె, అల్లుడిని సోనియా, రాహుల్,ప్రియాంకలకు పరిచయం చేశారు.