Rahulgandhi: బిజెపి, బిఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటే..వాటిని నమ్మొద్దన్న రాహుల్ గాంధీ-rahulgandhi said brs bjp and mim are only one dont believe them ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Rahulgandhi: బిజెపి, బిఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటే..వాటిని నమ్మొద్దన్న రాహుల్ గాంధీ

Rahulgandhi: బిజెపి, బిఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటే..వాటిని నమ్మొద్దన్న రాహుల్ గాంధీ

Sarath chandra.B HT Telugu
Nov 28, 2023 01:33 PM IST

Rahulgandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు ప్రత్యర్థులపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బిఆర్‌ఎస్‌, బిజెపి, ఎంఐఎంలను నమ్మొద్దని పిలుపునిచ్చారు.

రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ (AICC )

Rahulgandhi: దేశంలో అన్ని రాజకీయ పార్టీల వెంట పడుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు బిఆర్‌ఎస్, ఎంఐఎం జోలికి ఎందుకు వెళ్లడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రశ్నించినందుకు తనపై 24కేసులు నమోదయ్యాయని బిఆర్‌ఎస్‌, ఎంఐఎంలను మాత్రం బిజెపి ఎందుకు ఏమి అనడం లేదో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

ఎంఐఎంతో పాటు, కేసీఆర్‌ వెనుక ఈడీ, సిబిఐ, ఐటీ శాఖలు ఎందుకు పడటం లేదని రాహుల్ ప్రశ్నించారు. జిఎస్టీ, నోట్ల రద్దు, రైతు చట్టాల విషయంలో బీజేపీకి బిఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో దొరల ప్రభుత్వం నడుస్తోందని, కాంగ్రెస్‌ ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోందన్నారు.

కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్‌ మాత్రం కీలక మంత్రిత్వ శాఖలను కేసీఆర్‌ తన వారికి ఇచ్చాడన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రుపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల డబ్బులు దోచుకోడానికి అధికారాన్ని వాడుకున్నారని రాహుల్‌ ఆరోపించారు.

కేసీఆర్ కుటుంబ సభ్యులు చదువుకున్న కాలేజీలు, యూనివర్శిటీలు కాంగ్రెస్ పార్టీ హయంలో ఏర్పాటు చేసినవేనని, కాంగ్రెస్‌ ఏం చేసిందో ప్రజలకు తెలుసన్నారు. హైదరాబాద్‌లో కట్టిన ఎయిర్ పోర్ట్‌, మెట్రో ప్రాజెక్టుల్ని, జాతీయ రహదారుల్ని కాంగ్రెస్ పార్టీ నిర్మించిందని గుర్తు చేశారు.

హైదరాబాద్‌కు గుర్తింపు తీసుకొచ్చిన ఐటీ రంగాన్ని ప్రారంభించింది కాంగ్రెస్‌ పార్టీ అని గుర్తు చేశారు. కేసీఆర్‌ కుటుంబ దోపిడీ తప్ప ప్రత్యేక రాష్ట్రంలో సాధించింది ఏమి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో ప్రజలకు భరోసా కల్పిస్తున్నట్లు చెప్పారు.

మహిళల కోసం రూ.2500నెలకు చెల్లిస్తామని, గ్యాస్ సిలిండర్ రూ.500కు అందిస్తామని, మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, రైతు భరోసా ద్వారా రూ.15వేలు, రూ.12వేలను రైతులకు అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని పక్కాగా అమలు చేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పారు. 200యూనిట్ల ఉచిత విద్యుత్‌, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్, విద్యా రంగంలో సమూల మార్పులు అమలు చేస్తామన్నారు.

జనతా స్కీమ్‌లో రూ.4వేల రుపాయలు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రతి నెల పెన్షన్ చెల్లిస్తామన్నారు. తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్‌ దోపిడి చేసిన మొత్తం డబ్బును ప్రజల చేతుల్లో పెడతామన్నారు.

ఎంఐఎం, కేసీఆర్‌లు లోపాయికారీగా బిజెపికు మద్దతిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. వారికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఓబీసీ సిఎం చేసే ముందు బీసీలకు ఏమి చేశారో చెప్పాల్సిందని ఎద్దేవా చేశారు. అంతకు ముందు రాహుల్‌ గాంధీ పారిశుధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, గిగ్ వర్కర్లతో ముచ్చటించారు. అధికారంలోకి వస్తే రాజస్థాన్ తరహాలో గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు.

Whats_app_banner