Prashant Kishor: ఉప ఎన్నికల్లో ‘ఎన్నికల వ్యూహకర్త’ ప్రశాంత్ కిషోర్ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు-prashant kishor reacts as his party candidates lose deposits in bihar bypolls ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Prashant Kishor: ఉప ఎన్నికల్లో ‘ఎన్నికల వ్యూహకర్త’ ప్రశాంత్ కిషోర్ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు

Prashant Kishor: ఉప ఎన్నికల్లో ‘ఎన్నికల వ్యూహకర్త’ ప్రశాంత్ కిషోర్ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు

Sudarshan V HT Telugu
Nov 23, 2024 08:39 PM IST

బిహార్ లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ‘ఎన్నికల వ్యూహకర్త’ ప్రశాంత్ కిషోర్ కు చెందిన పార్టీ ‘జన్ సురాజ్’ ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఓడిపోయారు. వారిలో ముగ్గురు డిపాజిట్లు కోల్పోయారు.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

బిహార్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ‘ఎన్నికల వ్యూహకర్త’ ప్రశాంత్ కిషోర్ కు చెందిన పార్టీ ‘జన్ సురాజ్’ అన్ని స్థానాల్లోనూ ఓడిపోయింది. నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే, మూడింటిలో డిపాజిట్లు కోల్పోయింది. ఈ ఓటమిపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు.

ఎన్డీఏ గెలవడం ఆందోళనకరం..

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని సంకీర్ణం తన దశాబ్దాల పాలనలో రాష్ట్ర దీర్ఘకాలిక వెనుకబాటుతనాన్ని అంతం చేయడంలో విఫలమైనప్పటికీ.. బీహార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించడం "ఆందోళన కలిగించే విషయం" అని జన్ సురాజ్ పార్టీ అధినేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిషోర్ పార్టీ జన సురాజ్ ఈ ఉప ఎన్నికల్లో అరంగేట్రం చేసింది. కానీ, ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులు ఓడిపోయారు. వారిలో ముగ్గురు డిపాజిట్లు కోల్పోయారు.

10% ఓట్లు సాధించాం

ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికి పాట్నాలో విలేకరులతో మాట్లాడిన ప్రశాంత్ కిశోర్ (prashant kishor) .. తమ పార్టీ పోటీ చేసిన నాలుగు స్థానాల్లో పోలైన మొత్తం ఓట్లలో 10 శాతం ఓట్లను గెలుచుకున్నామని తెలిపారు. అయితే వీటిలో మూడు స్థానాల్లో రాష్ట్రీయ జనతాదళ్ ఓటమి చెందడంలో తమ పార్టీ పాత్ర ఉందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ‘‘ఆర్జేడీ 30 ఏళ్ల పార్టీ. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి కుమారుడు మూడో స్థానంలో నిలిచాడు. అందుకు జన్ సూరజ్ ను తప్పుపట్టవచ్చా? బెలాగంజ్ లో ముస్లిం ఓట్లన్నీ జనతాదళ్ యునైటెడ్ అభ్యర్థికే పడ్డాయి. ఇమామ్ గంజ్ లో జన్ సురాజ్ ఎన్డీయే ఓట్లను చీల్చింది. లేదంటే కేంద్ర మంత్రి జితన్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామ్ మోర్చా విజయావకాశాలు ఎక్కువగా ఉండేవి’’ అని ప్రశాంత్ కిశోర్ వివరించాడు. రిజర్వ్డ్ స్థానం అయిన ఇమామ్ గంజ్ లో జితన్ మాంఝీ కోడలు దీప ఆర్జేడీ అభ్యర్థిని 6 వేల కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడించారు. జన్ సురజ్ అభ్యర్థి జితేంద్ర పాశ్వాన్ 37 వేల పైచిలుకు ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.

డిపాజిట్లు కోల్పోవడంపై..

నాలుగు సీట్లలో మూడింటిలో జన్ సురాజ్ అభ్యర్థులు మొత్తం ఓట్లలో ఆరో వంతు కంటే తక్కువ ఓట్లు సాధించి డిపాజిట్లు కోల్పోయారు. ఈ విషయంపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ.. ‘‘అది ఆందోళన కలిగించే విషయం కాదు. ఇంతకాలం బీహార్ ను పరిపాలించినప్పటికీ, రాష్ట్ర వెనుకబాటుతనాన్ని అంతం చేయడంలో ఎన్డీయే విఫలం కావడం ఆందోళన కలిగించే విషయం’’ అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ ఒంటరిగా పోటీ చేస్తుందని, మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు.

Whats_app_banner