Kieron Pollard retires from IPL: ఐపీఎల్‌కు పొలార్డ్ గుడ్‌బై.. ప్లేయర్ నుంచి కోచ్‌గా ప్రమోషన్
Kieron Pollard retires from IPL: ఐపీఎల్‌కు పొలార్డ్ గుడ్‌బై చెప్పాడు. 13 ఏళ్ల పాటు ముంబై ఇండియన్స్‌కు ఆడిన అతడు.. ఇక ఇప్పుడు ప్లేయర్ నుంచి కోచ్‌గా ప్రమోషన్ అందుకోవడం విశేషం.
Kieron Pollard retires from IPL: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్ ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010 నుంచీ ముంబై ఇండియన్స్ టీమ్‌కే ఆడుతున్న అతడు.. 13 సీజన్ల తర్వాత ఇక లీగ్‌లో ఆడబోనని స్పష్టం చేశాడు. ముంబై ఇండియన్స్ టీమ్ అతన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలియడంతో పొలార్డ్ ఇక తప్పుకోవడం మంచిదని నిర్ణయించుకున్నాడు.
ఐపీఎల్‌లో ముంబైకి తప్ప మరో టీమ్‌కు తాను ఆడబోనని పొలార్డ్ చెప్పడం విశేషం. అయితే ప్లేయర్‌గా రిటైరైనా అతడు ముంబై టీమ్ బ్యాటింగ్ కోచ్‌గా కొత్త అవతారంలో కనిపించనున్నాడు. 2009 ఛాంపియన్స్ లీగ్‌లో పొలార్డ్ ఆట చూసిన తర్వాత మరుసటి ఏడాదే అతన్ని టీమ్‌లోకి తీసుకుంది ముంబై ఇండియన్స్. అప్పటి నుంచీ ఆ టీమ్‌తోనే కొనసాగుతున్నాడు.
ఆ వేలంలో 2 లక్షల డాలర్లు బేస్‌ప్రైస్ ఉన్న పొలార్డ్‌ను 7.5 లక్షల డాలర్లకు ముంబై కొనుగోలు చేసింది. అతడు టీమ్‌లో ఉన్న సమయంలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. గతేడాది రూ.6 కోట్లకు పొలార్డ్‌ను ఆ టీమ్ రిటేన్ చేసుకుంది. అయితే ఈ సీజన్‌లో అతడు బ్యాట్‌తో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ఈసారి అతన్ని టీమ్ నుంచి రిలీజ్ చేయాలని ముంబై భావించింది.
ముంబై ఇండియన్స్ తరఫున పొలార్డ్ ఏకంగా 189 ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆడటం విశేషం. విరాట్ కోహ్లి తర్వాత ఒక ఫ్రాంఛైజీకి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు పొలార్డ్‌దే. ఈ 189 మ్యాచ్‌లలో పొలార్డ్ 3412 రన్స్ చేశాడు. అందులో 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో 69 వికెట్లు తీశాడు. ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ ఆల్‌రౌండర్స్‌లో ఒకడిగా పొలార్డ్‌కు పేరుంది.
ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు పొలార్డ్ ఓ ఎమోషనల్ స్టేట్‌మెంట్‌లో ప్రకటించాడు. ఇది కఠిన నిర్ణయమే అని, మరికొన్నేళ్లు ముంబై తరఫున ఆడాలని భావించినా.. టీమ్‌తో చర్చల తర్వాత ఇక రిటైరవ్వాలని నిర్ణయించినట్లు చెప్పాడు. ఒకసారి ముంబై ఇండియన్ అయిన తర్వాత ఇక ఎప్పుడూ ముంబై ఇండియనే అని పొలార్డ్ అనడం విశేషం.
అయితే ముంబై ఇండియన్స్‌కు ఇక నుంచి బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగనున్నట్లు కూడా ఈ సందర్భంగా పొలార్డ్ చెప్పాడు. ఈ కొత్త బాధ్యత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. అటు ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ టీమ్‌లోనూ పొలార్డ్ కొనసాగనున్నాడు. అతని ప్రకటన తర్వాత ముంబై ఇండియన్స్ తన ట్విటర్ ప్రొఫైల్ పిక్‌ను మార్చడం గమనార్హం. ఫరెవర్ ఎంఐ అంటూ పొలార్డ్ ఫొటోనే ప్రొఫైల్ ఫిక్‌గా ఉంచింది.
టాపిక్