Pawan Kalyan : గంజాయి పూర్తిగా వదిలేవరకు గిరిజనులను వదలను.. పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Pawan Kalyan : అల్లూరి సీతారామరాజు జిల్లా బల్లగరువులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంజాయి పూర్తిగా వదిలేవరకు గిరిజనులను వదలబోనని స్పష్టం చేశారు. సినిమాల కోసం ఎప్పుడూ కలలు కనలేదని చెప్పారు.
గంజాయి పూర్తిగా వదిలేవరకు గిరిజనులను వదలబోనని.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆడబిడ్డల జీవితాలు బాగుపడే వరకు రిటైర్ అవ్వబోనని చెప్పారు. పేదల జీవితాలు మెరుగుపరచడం తన కల అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అపార అనుభవం ఉందన్న పవన్.. సీఎం ఎవరనేది కాదు.. ఎవరు బాగా పని చేశారనేదే ముఖ్యం అని చెప్పారు. తనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారని వ్యాఖ్యానించారు.
గంజాయి వద్దు..
'గంజాయి సాగు ఆపేందుకు మాకు మీరు సహకరించండి, మీకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యామ్నాయంగా టూరిజం అభివృద్ది చేసి చూపిస్తాం. ప్రతీసారి పోలీసులతో గంజాయి అరికట్టడం కంటే మీరు భాధ్యత తీసుకుంటే ఇది సాధ్యం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జిల్లాకు వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఒక మహాత్ముడు నడిచిన నేల ఇది. గిరిజన ప్రజలకు అండగా ఉన్న మహానుభావుడి పేరు పెట్టిన నేల. ఆయన పోరాడిన నేల, ఈ నేల డోలి రహిత గ్రామాలుగా ఉండాలి' అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
డోలీలు లేని గ్రామాలు కావాలి..
'గిరిజన ప్రాంతాలు డోలీ రహిత ప్రాంతాలుగా ఉండాలి అని ముఖ్యమంత్రి సంకల్పించారు. 2017లో పోరాట యాత్రలో నేను పాడేరు, అరకు, ఆంధ్ర - ఒడిశా బార్డర్లో పర్యటిస్తూ గిరిజన కష్టాలను అర్థం చేసుకున్న వాడిని. ఆ రోజున నా దగ్గర అధికారం లేదు. అయినా మా గ్రామాల్లోకి రా.. మా తాండాల్లోకి రా.. నీ మనసులో పడితే ఏదోక రోజు చేస్తావు అని తీసుకుని వెళ్లారు' అని పవన్ వివరించారు.
మీరంతా భాగస్వాములే..
'పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడం అంటే.. ఇక్కడున్న సగటు గిరిజన యువకుడు, గిరిజన యువతి భాగస్వామ్యం అయినట్టే. పంచాయితీరాజ్ శాఖ తీసుకున్నందుకు నేను మీకు ఏదైనా చేయగలుగుతున్నాను అంటే కారణం.. ఇక్కడున్న మీరంతా మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఒకటి కాదు రెండు కాదు 164 సీట్లు ఇచ్చారు. 21 పార్లమెంటు సీట్లు ఇచ్చారు. ఇందాక జర్నలిస్టు సోదరులు అడుగుతున్నారు.. ఈ పార్లమెంటు మీ కింద లేదు అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను.. ప్రజలు మాకు ఓట్లు వెయ్యనప్పటికి వారికోసం పని చేస్తామని' అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
ఓట్ల కోసం కాదు..
'ఓట్ల కోసం మేము చెయ్యట్లేదు అనడానికి ఇదే ఉదాహరణ. రూ.105 కోట్లు పెడితే లబ్ధి పొందేది 4500 గిరిజనులు మాత్రమే. పైగా మాకు ఓట్లు వేయలేదు. ఇవన్నింటిని అధిగమించి మేము ఎందుకు వచ్చామంటే.. మాకు ఓటు బ్యాంక్ రాజకీయాలు అక్కర్లేదు. ఇదే రూ.100 కోట్లు ముఖ్యమంత్రి తన నియోజకవర్గంలో పెట్టుకోవచ్చు, నేను కాకినాడలోనో ఇంకో ప్రాంతంలోనో పెట్టుకోవచ్చు. కానీ ఎందుకు వచ్చాం అంటే.. మీ కష్టాల్లో మేము అండగా ఉన్నాం అని చెప్పడానికి' అని ఉప ముఖ్యమంత్రి వివరించారు.
బలంగా అనుకున్నారు..
'6 నెలల క్రితం యువత బలంగా అనుకున్నారు. మార్పు రావాలి అని. మార్పు వచ్చింది మీకు రోడ్లు పడ్డాయి. మార్పు వచ్చింది సర్పంచ్‌లకు విలువ లేని పరిస్థితుల్లో ఈరోజు తల ఎత్తుకుని మేము సర్పంచులం అని చెప్పుకునే స్థాయిలో మేము పెట్టాం. మొన్న నేను, ముఖ్యమంత్రి ఒక గంట సేపు చర్చించుకున్నాం. వేరే ఏం మాట్లాడలేదు., గిరిజన ప్రజల స్థితిగతుల గురించే మాట్లాడాను. మీకు ఆదాయం ఎలా పెరగాలి, రోడ్ల అనుసంధానం ఎలా ఉండాలి, నీటి ఇబ్బందులు ఎలా తీర్చాలి, ఇతరత్రా సమస్యలపైన చర్చించాం' అని పవన్ కళ్యాణ్ వివరించారు.
మీతోనే ఉంటా..
'కేవలం ఒక రోడ్డు వేయించి వెళ్ళిపోను. నేను మీకోసం ఈ 5 సంవత్సరాలు పని చేస్తాను. పని చేసిన తరువాత మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి. బాగుంటే సంతోషం, వచ్చే ఎన్నికలకు మీకు అండగా ఉంటాం అని చెప్పండి. కాఫీ గింజలు పండించే విధానం, చిరు ధాన్యం పండించడం చూస్తుంటే మీకు ఉపాధికి ఇబ్బంది లేదు. కానీ మీకోసం పని చేసే అధికారులు ఉండాలి. ముఖ్యమంత్రితో చర్చించి, నేను కనక మనసు పెట్టకపోతే ఈ రోజు ఈ ప్రాజెక్టు వచ్చేది కాదు. మనసు పెట్టే నాయకులు మీకు కావాలి' అని పవన్ వ్యాఖ్యానించారు.
ఎంతో ఇబ్బంది పడ్డా..
'నేను దశాబ్దం కష్టపడ్డాను. తిరిగాను, తిప్పలు పడ్డా, తిట్లు భరించా, కుటుంబాన్ని బెదిరించారు, ఇంట్లో ఆడపిల్లల్ని బెదిరించారు. ఇవన్నీ ఎందుకు భరించాం అంటే.. డోలీ మోత ఉండే ఒక గ్రామానికి ఒక రోడ్డు వెయ్యగలిగితే నాకు సంతోషం. ఇన్ని తిట్లు పడ్డా భరించినందుకు తృప్తి. బాధ్యత తీసుకున్న వాడికే తిట్లు పడతాయి. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యలకు పరిష్కారాలకు దొరుకుతాయి., అందుకు నేను మీతో మమేకం అవుతాను. కాబట్టి మీరు నా మీద పడకుండా నాతో సంబాషిస్తే మీకోసం ఇంకా ఎక్కువ పని చేస్తాను' అని పవన్ కళ్యాణ్ వివరించారు.