Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్‌డేట్.. తెలంగాణ ప్రజలకు కొత్త సంవత్సరం కానుక!
Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈనెల ఆఖరు వరకు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఆ వెంటనే లబ్ధిదారుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. తాజాగా మంత్రి పొంగులేటి ఈ పథకంపై సమీక్ష నిర్వహించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎలాంటి ఆరోపణలు రాకుండా.. తప్పులు జరగకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. క్షేత్రస్థాయిలో సర్వే చేసి.. లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. తాజాగా ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
'ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల సర్వేను పూర్తిచేసి యాప్‌లో నమోదుచేయాలి. అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహించే సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేయాలి. ఒక్క దరఖాస్తును కూడా వదలొద్దు. ఎలాంటి తప్పులకు తావు లేకుండా సర్వే చేపట్టాలి. గ్రామాల్లో జరుగుతున్న సర్వే తీరును కలెక్టర్లు రోజూ సమీక్షించాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు, సలహాల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలి' అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
ప్రక్రియ వేగవంతం..
ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపు 80 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. దీంతో లబ్ధిదారులను గుర్తించేందుకు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. దరఖాస్తుదారుల వివరాలను ఎంట్రీ చేసి.. లబ్ధిదారులను గుర్తిస్తారు. యాప్ అందుబాటులోకి రావటంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు ప్రక్రియ వేగవంతం అయ్యింది.
సర్వేలో ఏం చేస్తారు..
క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించే అధికారులు.. దరఖాస్తుదారుడి అన్ని వివరాలను సేకరిస్తారు. గతంలో ఏదైనా ఇంటి స్కీమ్‌లో లబ్ధి పొందారా..? ఎలాంటి వాహనాలు ఉన్నాయి..? స్థలం ఎవరి పేరుపై ఉంది..? కుటుంబంలో ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారా..? ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లింపుతో పాటు ఇతర వివరాలను సేకరిస్తారు. దరఖాస్తుదారుడు ఇచ్చే సమాచాన్ని యాప్‌లో నమోదు చేసిన తర్వాత అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తారు. ఇందులో ఏఐ టెక్నాలజీ కీలకంగా పని చేయనుంది. అన్నింటిని పరిశీలించిన తర్వాతే అసలైన అర్హులకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తారు.
వెసులుబాటు..
మొదటి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లను కేటాయిస్తారు. మొత్తంగా 4.5 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను ధపాలు వారీగా ఇస్తారు. లబ్ధిదారులకు మరో వెసులుబాటును కూడా రేవంత్ సర్కార్ కల్పించింది. ప్రభుత్వం అందించే 400 చదరపు అడుగుల డిజైన్ ను అనుసరించాల్సిన పని లేదు. ఇంకా స్థలం ఉంటే 500 చదరపు అడుగుల్లోనూ ఇల్లు కట్టుకునేందుకు వెసులుబాటు కల్పించింది.