Minister Atchannaidu : ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, జనవరి నుంచి మధ్యాహ్న భోజన పథకం-మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన
Minister Atchannaidu : ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన నాలుగు గంటల్లోనే రైతుల డబ్బులు చెల్లిస్తున్నామన్నారు.
Minister Atchannaidu : జనవరి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విద్యా కిట్లు అందజేస్తామన్నారు. గతంలో 117 జీవో తెచ్చి విద్యా వ్యవస్థను నాశనం చేశారని, ఆ జోవోను రద్దు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లలో వ్యవస్థలు నిర్వీర్యం చేశారని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయేలా చేశారన్నారు. కూటమి ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దుతోందన్నారు. మూలపేట పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. జూన్ నాటికి మొదటి షిప్ రావడానికి ప్రయత్నం చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే 5 వేల ఎకరాల సాల్ట్ ల్యాండ్ తీసుకుంటామని వెల్లడించారు.
నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు
ధాన్యం కొనుగోలు చేసిన నాలుగు గంటల్లోనే రైతుల డబ్బులు చెల్లిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. నేటికి 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 3.20 లక్షల మంది రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేశామన్నారు. గత ఐదేళ్లు రైతులను మభ్యపెట్టారని వైసీపీపై మండిపడ్డారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఐదేళ్లలో లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన పథకాలను వైసీపీ ప్రభుత్వం సరిగ్గా వినియోగించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి....రైతులకు రూ.1600 కోట్లు బకాయిలు పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపడుతుందన్నారు. యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 24 శాతం ఉన్న తేమను 14 శాతానికి తగ్గించామని చెప్పారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులు కొనసాగుతున్నాయన్నారు. రూ.4,600 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
కక్ష సాధింపు మా విధానం కాదు
వైసీపీ ప్రభుత్వం తనను జైలులో పెట్టి ఇబ్బంది పెట్టిందని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యర్థులపై కొరడా ఝుళిపిస్తానని అందరూ భావిచారని, కానీ కక్ష సాధింపు తమ విధానం కాదన్నారు. తాను కక్షసాధింపునకు దిగుతున్నానని పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మె్ల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. తాను తలచుకుంటే ఒక్కడు మిగలడన్నారు. తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు. వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా రైతులను మోసం చేసిందన్నారు. వైసీపీ గత ఐదు సంవత్సరాల్లో రూ. 13 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఆరు నెలల వరకు డబ్బులు వేసేవారు కాదన్నారు. తుపాను కారణంగా నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు.