Jamili Elections Impact on AP : జమిలికి జై.. జోష్‌లో వైసీపీ.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
Jamili Elections Impact on AP : దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తాజాగా ఒకే దేశం.. ఒకే ఎన్నికకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది.
జమిలి ఎన్నికలకు కేంద్రం జైకొట్టింది. తాజాగా గురువారం జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అన్ని పొలిటికల్ పార్టీలు యాక్టివ్ అయ్యాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ పరిస్థితి ఎలా ఉన్నా.. ఏపీలో మాత్రం రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం ఉంది. అయితే.. ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే.. ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే చర్చ జరుగుతోంది.
ఆశగా వైసీపీ..
ఏపీలో ప్రస్తుతం మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటిల్లో టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కూటమిలో బీజేపీ ఉన్నా.. ఓట్లు, సీట్లు మాత్రం ఈ రెండు పార్టీల కంటే తక్కువే. మరోవైపు వైసీపీ ఉంది. వైసీపీ సింగిల్ పోటీ చేసి 2019లో ఘనవిజయం సాధించింది. 2024లో మాత్రం ఊహించని స్థాయిలో పరాజయం పాలైంది. ఓటమి తర్వాత కొన్నిరోజులు కామ్‌గా ఉన్న వైసీపీ నేతలు.. ఇటీవల యాక్టివ్ అయ్యారు. జమిలి ప్రకటనలపై ఆశగా ఎదురుచూస్తున్నారు.
జమిలి.. జగన్..
ఈ మధ్య మీడియాతో మాట్లాడిన జగన్ జమిలి ఎన్నికలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు, ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్న సమయంలో జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. జమిలి ఎన్నికలు జరిగితే.. వైసీపీకే లాభం అని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. జమిలి అంటున్నారు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆర్గనైజ్డ్‌గా ఉంటే మనం సన్నద్ధంగా ఉంటామని పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
వైసీపీ సానుకూలం..
అంటే.. జమిలి ఎన్నికల పట్ల వైసీపీ సానుకూలంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో.. జగన్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే పనిలో పడ్డారు. అటు కేడర్ కూడా గతంలో పోలిస్తే.. కాస్త యాక్టివ్ అయ్యింది. జమిలి ఎన్నికలు జరిగితే తప్పకుండా మేలు జరుగుతుందని వైసీపీ భావిస్తోంది.
టీడీపీలో చర్చ..
ఇక టీడీపీ విషయానికొస్తే.. జమిలిపై ఇప్పటివరకు ఆ పార్టీ స్పందించలేదు. అదే సమయంలో.. జమిలి వస్తే ఎంతోకొంత నష్టం జరగొచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. 2024 ఎన్నికల సమయంలో ఉన్న ఊపు, వైసీపీపై కోపం.. జమిలి ఎన్నికలు జరిగే నాటికి ఉంటుందా అనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ అనుకున్నట్టు జరిగితే.. 2027 మార్చి తర్వాత ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అప్పటికీ పరిస్థితి ఇలానే ఉంటుందా అని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.
32 పార్టీలు అనుకూలం..
జమిలి ఎన్నికలకు దేశంలోని 32 పార్టీలు అనుకూలంగా ఉన్నాయి. 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఎదుట 47 పార్టీలు వాదనలు వినిపించాయి. ఇండియా కూటమిలోని పలు పార్టీలు జమిలిని వ్యతిరేకిస్తున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతోపాటే స్థానిక ఎన్నికలనూ నిర్వహించాలని రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది. ఇందుకోసం రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టాలని సూచించింది.
రాష్ట్రాల ఆమోదం అవసరమా..
అయితే స్థానిక ఎన్నికల విషయాన్ని ప్రస్తుతానికి కేంద్రం పక్కనబెట్టింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై తీసుకొచ్చిన బిల్లులకు ఆమోదం తెలిపింది. దీనికి 50 శాతం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. లోకల్ బాడీ ఎన్నికలనూ వాటితో కలిపి నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ, 50 శాతం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుందని అంటున్నారు.
బలం సరిపోతుందా..
లోక్‌సభలో మొత్తం 542 మంది సభ్యులున్నారు. ఎన్డీయే కూటమికి 293 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇండియా కూటమికి 235 మంది సభ్యులున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 361 మంది సభ్యుల మద్దతు అవసరం. దీంతో సవరణకు ఇప్పటికైతే అవకాశం లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. మొత్తానికి జమిలి ఎన్నికల అంశం దేశవ్యాప్తంగా ఎలా ఉన్నా.. ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.