Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ - క్లారిటీ ఇచ్చిన బన్నీ టీమ్
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. పోలీసులు బన్నీని అరెస్ట్ చేసి చిక్కడపల్లి స్టేషన్‌కు తరలించారు. అయితే ఇది అరెస్టు కాదని అల్లు అర్జున్ టీమ్ అంటోంది.
Allu Arjun Arrest: సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ రోజు జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బన్నీ టీమ్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఎంక్వైరీ నిమిత్తమే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు పేర్కొన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్లు జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదని అల్లు అర్జున్ ప్రతినిధులు పేర్కొన్నారు.
బన్నీ అరెస్ట్ నిజమే...
పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ మాత్రం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. బన్నీ ఇంటికి వెళ్లి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్టు ధ్రువీకరించారు.
ఫొటోలు... వీడియోలు...
అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, సోదరుడు శిరీష్‌తో పాటు అల్లు అర్జున్ మేనమామ చంద్రశేఖర్ రెడ్డి చేరుకున్నట్లు సమాచారం.
అల్లు అర్జున్ రావడంతోనే..
పుష్ప 2 మూవీ ప్రీమియర్స్‌ను రిలీజ్‌కు ఒక రోజు ముందే తెలుగు రాష్ట్రాల్లో స్క్రీనింగ్ చేశారు. పుష్ప 2 ప్రీమియర్‌ను అభిమానులతో కలిసి వీక్షించేందుకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చాడు. ఈ సందర్భంగా అభిమానుల తాకిడి పెరిగిపోవడంతో తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాటలో రేవతి అనే అభిమాని మృతి చెందగా...ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ పాలయ్యాడు. ఈ కేసులో సంధ్య థియేటర్ మేనేజర్‌తో పాటు సెక్యూరిటీ మేనేజర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వస్తున్నట్లు తమకు సమాచారం ఇవ్వలేదని, థియేటర్ యాజమాన్యం కూడా సరైన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
బన్నీపై పోలీస్ కేసు...
అభిమాని మృతికి సంబంధించి హీరో అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇటీవలే అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ పిటీషన్‌ను దాఖలు చేశారు.
తాను థియేటర్‌కు వస్తున్నట్లు పోలీసులతో పాటు థియేటర్ యాజమాన్యానికి ముందుగానే తెలియజేసినట్లు బన్నీ తన పిటీషన్‌లో పేర్కొన్నాడు. తన రాక వల్లే తొక్కిసలాట జరిగిందని చెప్పడం సబబు కాదని చెప్పాడు. ఈ కేసు వల్ల తన గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉందని, అరెస్ట్‌ను నిలిపివేయడంతో పాటు కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ పిటీషన్‌లో బన్నీ పేర్కొన్నట్లు సమాచారం.
కుటుంబానికి అండగా...
పుష్ప 2 బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ కేసు కారణంగా సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేకపోయాడు బన్నీ. మృతి చెందిన అభిమానికి అండగా ఉంటానని మాటివ్వడమే కాకుండా ఇరవై ఐదు లక్షలు అందజేస్తానని చెప్పాడు. రేవతి కొడుకు హాస్పిటల్ ఖర్చుతో పాటు వారి పిల్లల చదువును తానే భరిస్తానని చెప్పాడు.