TG Assembly Session: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ పిలుపు-telangana assembly sessions to begin today steamy sessions to be held ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Assembly Session: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ పిలుపు

TG Assembly Session: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ పిలుపు

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 09, 2024 07:00 AM IST

TG Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజు పలు కీలక బిల్లులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సభలో ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ఏడాది పాలన విజయాలను వివరించేందుకు సిద్ధమవుతుంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్‌ రెడీ అయ్యింది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (https://legislature.telangana.gov.in/)

TG Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10.30కు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు 5 కీలక బిల్లులతో పాటు.. 2 నివేదికలను సభలో ప్రవేశ పెడతారు. తెలంగాణలో ఉద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హ తల తొలగింపు బిల్లు (సవరణ), తెలంగాణ పురపాలక సంఘాల సవరణ బిల్లు, హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు, తెలంగాణ జిఎస్టీ సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులు, 2022-23 సంవత్సరానికి గాను ఎలక్ట్రిసిటీ ఫైనాన్స్‌ 9వ వార్షిక నివేదిక, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదికను సభ ముందు ప్రవేశపెడతారు.

yearly horoscope entry point

బిల్లుల్ని ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన తదితర అంశాలపై అసెంబ్లీలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారు. ఈ అంశంపై స్వల్ప కాలిక చర్చ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అనంతరం సంతాప తీర్మానాలు ప్రవేశ పెడతారు. సంతాప తీర్మానం తర్వాత తొలిరోజు సభ వాయిదా పడే అవకాశాలున్నాయి.

అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే రైతు భరోసా విది విధానాలపై చర్చిస్తారు. ఇప్పటికే రైతు భరోసాపై మంత్రి వర్గ ఉప సంఘం జిల్లాల్లో పర్యటించి.. రైతులు, రైతు సంఘాలు, కూలీలు తదితర వర్గాల నుంచి రైతులకు అందించాల్సిన సాయంపై అభిప్రాయాలు సేకరించింది. వాటిని క్రోడీకరించి.. నివేదిక కమిటీ సిద్ధం చేసింది.

మంత్రి వర్గ ఉపసంఘం రూపొందించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి.. అన్ని పార్టీల ఎమ్మెల్యేల నుంచి సూచనలను ప్రభుత్వం స్వీకరించాలని భావిస్తోంది. తొలి రోజు సోమవారం సభ ముగిసిన తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సభా కార్యక్రమాలపై శిక్షణ నిర్వహించాలని భావిస్తున్నారు. 2-3 రోజుల శిక్షణ అనంతరం తిరిగి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. బీఏసీలో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

సమావేశాలకు రెడీ అవుతున్న అధికార విపక్షాలు…

శాసనసభ సమావేశాల్లో హైదరాబాద్‌‌‌కు సంబంధించిన అంశాలు కాక రేపనున్నాయి. మూసీ పునరుజ్జీవం అంశంతో పాటు హైడ్రా, మెట్రో విస్తరణ, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం శాసనసభ సమావేశాల వేదికగా చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకోవడంతో శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం కీలక అంశాలపై ప్రజలకు స్పష్టత ఇచ్చేందుకు ఉపయోగించుకోనుంది.

మూసీ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఖరిని ప్రకటించనుంది. హైదరాబాద్‌లో చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఇప్పటికే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ చేసి హైడ్రా ఏర్పాటుకు సంబంధించిన ఆర్డినె న్స్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో హైడ్రా ఏర్పాటు కోసం ఆర్థి నెన్స్ స్థానంలో చట్టం తీసుకు వచ్చేం దుకు బిల్లును ప్రవేశ పెట్టనుంది

హైదరాబాద్లో మెట్రో విస్తరణ రెండో దశపై కూడా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నారు. మరోవైపు మూసీ పునరుజ్జీవం- మూసీలో ఆక్రమణల తొలగింపు, హైడ్రా ఏర్పాటు అంశాలపై నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మూసీ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు పర్యటించి వారికి సంఘీ భావం తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి పలు అంశాలపై స్పష్టత కోరనున్నాయి.

ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ పిలుపు…

సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గొంతు విప్పాలని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాక ప్రభుత్వం కొనసాగిస్తున్న అణచివేత విధానాలను సభలో ఎండగట్టాలని చెప్పారు. ఎర్రవల్లి నివాసంలో జరిగిన బీఆర్ఎస్ శాసనసభా పక్షం సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. సుమారు రెండున్నర గంటల పాటు ఈ భేటీ సాగింది.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయాలని కాంగ్రెస్ చూస్తోందని నమ్మి ఓట్లు వేసిన రైతులు, గిరిజనులు, దళితులను వేధిస్తోందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న బీఆర్ఎ ఎస్ నేతలు, కార్యకర్తల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తోందని బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లడానికి కాళేశ్వరం అంశాన్ని ముందుకు తెచ్చిందని ఉద్యోగులకు మొండి చేయి చూపుతూ కేవలం ఒకేఒక్క డీఏను విడుదల చేశారని కేసీఆర్‌ విమర్శించారు. గురుకుల విద్యా సంస్థల్లో వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగట్టాలి...' అని కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు.

Whats_app_banner