YS Jagan District Tours : ఆ సమయం వచ్చేసింది... ఇక జనంలోకి వెళ్దాం - వైఎస్ జగన్
జనవరి మూడో వారం నుంచి జిల్లాల పర్యటన చేస్తానని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో బుధ, గురువారం నిద్ర చేస్తానని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలతో మమేకమవుతానని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నేతలతో భేటీ అయిన ఆయన.. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. గురువారం శ్రీకాకుళం జిల్లా స్ధానిక ప్రజా ప్రతినిధులతో భేటీ అయిన జగన్ ప్రసంగించారు.ప్రభుత్వ ఖజానాకి రూపాయి కూడా ఆదాయం రావడం లేదని.. వేలం వేసి మరి బెల్ట్ షాపులు నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'సూపర్-6 పథకాలు ఎలా ఉన్నాయని… కూటమి ప్రభుత్వంలోని నేతలు ఫోన్ చేసి అడుగుతారంట.. అసలు పథకాలు ఉంటే కదా ప్రజలు సమధానం చెప్పడానికి..? అంటూ ఎద్దేవా చేశారు. అన్ని రంగాల్లోనూ అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందన్నారు.
సమయం వచ్చింది - వైఎస్ జగన్
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఆర్నేళ్లు పూర్తి అయిందన్నారు. ఇక మనం ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఇసుక రేట్లను భారీగా పెంచి దండుకుంటున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులను వేలం వేసి నడుపుతున్నారని ఆరోపించారు. అందరమూ కలిసి ప్రజల్లోకి వెళ్దామని పిలుపునిచ్చారు. సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని ప్రకటించారు.
జనవరి మూడో వారం నుంచి జిల్లాల పర్యటన చేస్తానన్న జగన్… ప్రతి పార్లమెంట్ పరిధిలో బుధవారం, గురువారం నిద్ర చేస్తానని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలతో మమేకమవుతానని చెప్పుకొచ్చారు. వైసీపీ కేడర్ ప్రజల్లోకి సగర్వంగా వెళ్లొచ్చని దిశానిర్దేశం చేశారు. ప్రజల తరపున పోరాడాలని పిలుపునిచ్చారు.
సంక్రాంతి తర్వాత జగన్ జిల్లాల పర్యటన కార్యక్రమం మొదలవుతుంది. ప్రతి బుధవారం, గురువారం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశం అవుతారు. ‘ కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. జగన్ పర్యటనకు సంబంధించి జిల్లాల వారీగా నేతలు కసరత్తు చేస్తున్నారు. అధినాయకత్వం కూడా దిశానిర్దేశం చేసే పనిలో పడింది.
జగన్ జిల్లాల పర్యటనల లోపు జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల నియామకాలు పూర్తి చేయనున్నారు. ప్రతి కార్యకర్తకు ఫేస్ బుక్ , ట్విట్టర్, యూట్యూబ్ అకౌంట్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో జరిగే అన్యాయాన్ని ప్రతి కార్యకర్త ప్రశ్నించాలని… క్షేత్రస్థాయిలో ప్రజల తరపున పోరాడేందుకు సమయాత్తం కావాలని సూచిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన వైసీపీ కేవలం 11 సీట్లతో సరిపెట్టుకుంది. మరోవైపు కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. ఈ క్రమంలోనే పలువురు నేతలు పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఇందులో పలువురు రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. అయితే పార్టీ నుంచి బయటికి వెళ్లే నేతల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని జగన్ చెబుతూ వచ్చారు. పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో ప్రక్షాళన చర్యలు కూడా చేపట్టారు. చాలా నియోజకవర్గాల బాధ్యులను కూడా మార్చారు.