AP DGP On Pawankalyan: రాజ్యాంగం, చట్టాల ప్రకారం పనిచేస్తాం, రాజకీయ ఒత్తిళ్లతో కాదన్న ఏపీ డీజీపీ
AP DGP On Pawankalyan: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పనితీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ ద్వారకా తిరుమల రావు స్పందించారు. రాజ్యాంగం, చట్టాల ప్రకారమే పోలీసులు పనిచేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. రాజకీయ విమర్శలకు తాము సమాధానం చెప్పకూడదన్నారు.
AP DGP On Pawankalyan: ఏపీ పోలీసుల పనితీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ ద్వారకా తిరుమల రావు స్పందించారు. పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు తాను స్పందించలేనని చెప్పిన డీజీపీ రాజ్యంగం ప్రకారమే పోలీసులు పనిచేస్తారన్నారు. చట్టం, రాజ్యాంగం ప్రకారమే పోలీసుల విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, రాజకీయ ఒత్తిళ్లతో విధులు నిర్వర్తించలేరన్నారు. గతంలో కొన్ని పొరపాట్లు జరిగాయని గుర్తు చేశారు.
నేర చరితులను గుర్తించేందుకు 2015లో ఎంతో కష్టపడి ఫింగర్ ప్రింట్ డేటా బేస్‌ను సమకూర్చుకుంటే దానిని నిర్వహణలోపంతో కోల్పోవాల్సి వచ్చిందన్నారు. వ్యవస్థలో సమస్యలను పరిష్కరించుకుంటూ పోవాల్సిందేనన్నారు. కేసుల నమోదు, నేరాల కట్టడి విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని చట్ట ప్రకారమే పోలీస్ శాఖ పనిచేయాల్సి ఉంటుందని డీజీపీ స్పష్టం చేశారు. పోలీస్ శాఖపై గొల్లప్రోలు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తానేమి స్పందించనన్నారు. నేరాల నియంత్రణ, పోలీస్ శాఖ పనితీరు, గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటామన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను పునరావృతం కానివ్వకుండా చూస్తామన్నారు.