Phubbing: భార్యాభర్తల బంధాన్ని దెబ్బతీసే 'ఫబ్బింగ్'.. ఏంటిది? ఇలా చేస్తుంటే మానేయండి!-what is phubbing and how its effecting relationships ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Phubbing: భార్యాభర్తల బంధాన్ని దెబ్బతీసే 'ఫబ్బింగ్'.. ఏంటిది? ఇలా చేస్తుంటే మానేయండి!

Phubbing: భార్యాభర్తల బంధాన్ని దెబ్బతీసే 'ఫబ్బింగ్'.. ఏంటిది? ఇలా చేస్తుంటే మానేయండి!

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 13, 2024 12:30 PM IST

Phubbing: భార్యభర్తల బంధంలో చిన్న విషయాలే ఒక్కోసారి బాధపట్టే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఒకరు చేసే పనుల వల్ల మరొకరు నొచ్చుకుంటారు. ఈ మధ్య కాలంలో ఫబ్బింగ్ వల్ల బంధాలు దెబ్బ తింటున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Phubbing: భార్యాభర్తల బంధాన్ని దెబ్బతీసే 'ఫబ్బింగ్'.. ఏంటిది? ఇలా చేస్తుంటే మానేయండి!
Phubbing: భార్యాభర్తల బంధాన్ని దెబ్బతీసే 'ఫబ్బింగ్'.. ఏంటిది? ఇలా చేస్తుంటే మానేయండి!

భార్యభర్తల బంధంలో ఒకరిపై ఒకరు ప్రేమ, శ్రద్ధ చూపించడం చాలా ముఖ్యం. ఇలా ముందుకు సాగితే బంధం ప్రశాంతంగా, ఆనందకరంగా ఉంటుంది. ఇద్దర్లో ఎవరైనా తన భాగస్వామిపై నిర్లక్ష్యం చేసినట్టు అనిపిస్తే అది మరొకరిని బాధిస్తుంది. ఇలానే కొనసాగిస్తే బంధంపై తీవ్ర ప్రభావం పడుతుంది. రిలేషన్ దెబ్బ తింటుంది. ఇటీవలి కాలంలో ఫబ్బింగ్ అనేది కొందరు భార్యభర్తల బంధానికి ముప్పుగా మారుతోంది. ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తోంది.

ఫబ్బింగ్ అంటే..

మీకు దగ్గరగా ఉన్న వ్యక్తితో మాట్లాడుకుండా, వారిని విస్మరించి ఫోన్‍లో లీనమై పోవడాన్ని ఫబ్బింగ్ అంటారు. అంటే మీ పక్కన ఓ వ్యక్తి ఉన్నా పట్టించుకోకుండా ఫోన్‍లో సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం, వీడియోలు చూడడం, వేరే వాళ్లతో ఫోన్‍లో మాట్లాడడం ఇలా చేయడం అనేది ఫబ్బింగ్ కిందికి వస్తుంది.

భార్యభర్తల బంధంలో ఇది ఎక్కువైపోతుంది. కొందరు భాగస్వామిని పక్కనే పెట్టుకొని ఫోన్‍లో లీనం అయిపోతుంటారు. వారిని కనీసం పట్టించుకోకుండా మొబైల్‍నే చూస్తుంటారు. సోషల్ మీడియా చూడడం, వేరే ఎవరితోనే ఫోన్‍లో ఎక్కువసేపు మాట్లాడడం, వీడియోలు చూస్తుండడం చేస్తూ భాగస్వామిని చాలాసేపు పట్టించుకోకుండా ఉంటారు. దీంతో తమను పట్టించుకోవడం లేదంటూ జీవిత భాగస్వామి నొచ్చుకుంటారు. ఈ ఫబ్బింగ్ అనేది ఇటీవలి కాలంలో ఎక్కువవుతోంది.

ఫబ్బింగ్ దుష్ప్రభావాలు

ఫబ్బింగ్ వల్ల భార్యభర్తల బంధంపై దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. తమను పట్టించుకోకుండా జీవిత భాగస్వామి ఫోన్ వాడుతుంటే నొచ్చుకుంటారు. తాము ముఖ్యం కాదేమోనని ఫీల్ అవుతారు. దీనివల్ల ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడరు. ఇలాగే కొనసాగుతుంటే ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. రిలేషన్‍లో డిస్‍నెక్ట్ అయినట్టు భావిస్తుంటారు. ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే బంధానికి మరింత ఇబ్బంది ఎదురవుతుంది.

ఫబ్బింగ్ వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. పట్టించుకోవడం లేదంటూ వాదనలు వస్తాయి. ఫబ్బింగ్ చేసే వారికి అది పొరపాటు అని తెలియకపోయినా.. ఎదుటి వారిని అది బాధపెట్టేలా ఉంటుంది. నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావనను కలిగిస్తుంది. కొందరు విడాకులు తీసుకునేందుకు కూడా ఫబ్బింగ్ కారణంగా మారుతోందని ఇటీవల కొన్ని అధ్యయనాలు కూడా వెల్లడించాయి.

ఫబ్బింగ్ మానేసేందుకు టిప్స్

ఫబ్బింగ్ అలవాటును మానుకునేందుకు కొన్ని సూచనలు పాటించవచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామి పక్కన ఉన్నప్పుడు ఫోన్‍ చరచూ చేతులో పట్టుకోకుండా, దాని లీనం కాకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవండి.

ఆ నోటిఫికేషన్లు ఆపేయండి: ఫోన్‍ను ఎక్కువగా చేతులో తీసుకునేది సోషల్ మీడియా, మేసేజింగ్ నోటిఫికేషన్లు వచ్చేటప్పుడే. మీ జీవిత భాగస్వామితో ఉన్నప్పుడు ఆ నోటిఫికేషన్లు ఆపేయండి. ముఖ్యమైనవి మినహా మరేవి నోటిఫికేషన్లు రాకుండా సెట్టింగ్ చేసుకోండి. దీనివల్ల ఫోన్‍పై మీ దృష్టి మరలకుండా భాగస్వామితో నాణ్యమైన సమయం గడిపే అవకాశం ఉంటుంది.

ఎందుకో స్పష్టంగా చెప్పండి: ఒకవేళ ఫోన్‍లో లీనమై పక్కనే ఉన్న భాగస్వామిని పట్టించుకోకపోతే వెంటనే ఆ విషయాన్ని గుర్తించండి. ఎందుకు అలా చేశారో స్పష్టంగా చెప్పండి. ఆ తర్వాత వారితో సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించండి. వారే ముఖ్యమనే ఫీలింగ్‍ను కల్పించాలి.

బయటికి వెళ్లినప్పుడు..: ముఖ్యంగా ఇద్దరూ కలిసి బయటికి వెళ్లినప్పుడు.. ఒకరు ఫోన్‍లో లీనమైతే మరొకరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అందుకే బయటికి వెళ్లిన సమయాల్లో తప్పనిసరిగా ఫోన్ వాడకం తగ్గించాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫబ్బింగ్ అనేది భార్యభర్తలతో పాటు ప్రేమికులు, స్నేహితులు ఇలా చాలా బంధాలకు ఇబ్బందే. అందుకే దీన్ని మానుకోవడం మంచిది.

Whats_app_banner