Tomato Price Drop: ఒక్కసారిగా పడిపోయిన టమాటా, మిర్చి ధరలు, చెత్తలో పారబోస్తున్న రైతులు
Tomato Price Drop: నిన్న మొన్నటి వరకు చుక్కల్ని తాకిన టమాటా, మిర్చి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని ధరలు అమాంతం పెరిగితే ఇప్పుడు కొనేవాళ్లు లేక పారబోయాల్సి వస్తోంది.
Tomato Price Drop: నిన్న మొన్నటి వరకు రూ.60-70 ఓ దశలో రూ.100 రుపాయలకు చేరువైన కిలో టమాటాను ఇప్పుడు వ్యవసాయ మార్కెట్లలో కనీసం రుపాయి ధరకి కూడా కొనడం లేదు. ఏపీతో పాటు తెలుగు రాష్ట్రాల మార్కెట్లకు కర్నూలు, మదనపల్లి మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున టమాటా విక్రయాలు జరుగుతుంటాయి. మూడు నెలల క్రితం అకాల వర్షాలతో పంటలు నష్టపోవడంతో ధరలు అమాంతం పెరిగాయి. కొత్త పంట చేతికి వచ్చే సరికి ధరలు పడిపోయాయి. దీంతో కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో గురువారం టమాటా రైతులు ఆందోళనకు దిగారు. పత్తికొండ- గుత్తి రహదారిలో రైతుల ఆందోళనకు దిగారు.
వ్యవసాయ మార్కెట్లలో టమాటా, మిర్చి ధరలు గురువారం ఒక్కసారిగా పడిపో యాయి. కిలో టమాటా రూపాయి కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు హతాశులై మార్కెట్లలో పారబోశారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
దళారుల దోపిడీని నిరసిస్తూ పత్తికొండ- గుత్తి ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. నాణ్యత ఉన్న పంటకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహంతో రగిలిపోయారు. మార్కెట్లలో వ్యాపారులు కుమ్మక్కై తక్కువకు ధరలకు వేలం పాడుతుండటంపై రైతులు రగిలిపోయారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో టమాటా పంట ఒక్కసారిగా రావడంతో ధరలు ఒక్కసారి పడిపోయినట్టు మార్కెట్ యార్డు కార్యదర్శి చెబుతున్నారు. వారం రోజు లుగా టమాటా ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా పూర్తిగా పడి పోలేదని నాణ్యతలేని పంటకు మాత్రమే వ్యాపారులు తక్కువ ధరకు అడిగారని తోటల్లో సాగు చేసిన టమాటా క్వింటాలు ధర రూ.1,800 వరకు పలికిందని మెట్ట భూముల్లో సాగు చేసిన పంట నాణ్యత దెబ్బతినడంతో తక్కువ ధర పలుకుతోందని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రైతు బజార్లలో కిలో టమాటా ధర 25 గా ఉంది. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో మాత్రం గురువారం కిలో ధర రుపాయి నుంచి 8 రూపాయల వరకు పలికింది. పత్తి కొండ వ్యవసాయ మార్కెట్‌లో నిత్యం 200 టన్నుల కొనుగోళ్లు జరుగుతాయి. పత్తికొండలో కొనుగోలు చేసిన వ్యాపారులు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.
ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో కూడా పంటలు అందుబాటులోకి రావడంతో పత్తికొండ నుంచి ఎగుమతి అయ్యే టమాటాకు డిమాండ్ తగ్గింది. దీంతో వ్యాపారులు ధర తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. గురువారం మార్కెట్లో కనీస ధరలు కూడా లేకుండా కొనడంపై రైతులు ఆగ్రహంతో టమాటాలను మార్కెట్లోనే పారబోసి వెళ్లిపోయారు. కొందరు పత్తికొండ రహదారిపై ఆందోళనకు దిగారు.
బాపట్ల జిల్లా సంతమాగులూరులో మిర్చి ధరను తగ్గించడంతో రైతులు రోడ్డుపై పారబోశారు. బహిరంగ మార్కెట్లో క్వింటాలు ధర రూ.3వేలు ఉంటే వ్యవసాయ మార్కెట్లో రూ.1200మాత్రమే చెల్లిస్తుండటంతో రైతులు పంటను చెత్తలో పారబోశారు. సంతమాగలూరు మండలం కొమ్మాలపాడులో చేలలో కోసిన పంటను చెత్త కుప్పలో పారబోశారు.