One nation one election : జమిలి ఎన్నికలపై మోదీ ఫోకస్​- ఈ టర్మ్​లోనే అమలు!-one nation one election plan on agenda for current term of nda ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  One Nation One Election : జమిలి ఎన్నికలపై మోదీ ఫోకస్​- ఈ టర్మ్​లోనే అమలు!

One nation one election : జమిలి ఎన్నికలపై మోదీ ఫోకస్​- ఈ టర్మ్​లోనే అమలు!

Sharath Chitturi HT Telugu
Sep 16, 2024 08:15 AM IST

One nation one election : ఒకే దేశం- ఒకే ఎన్నికల (జమిలి ఎన్నికలు) వ్యవహారం మరోమారు వార్తల్లోకి ఎక్కింది. ఈ టర్మ్​లోనే జమిలి ఎన్నికల పద్ధతిని అమలు చేయాలని మోదీ సర్కార్​ కసరత్తులు చేసుకుంటోందని సమాచారం.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..

జమిలి ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఫోకస్​ చేసినట్టు తెలుస్తోంది. ఈ టర్మ్​లోనే “ఒకే దేశం- ఒకే ఎన్నికల”ను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమచారం. అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ప్రణాళికలను కూటమిలోని ఇతర పార్టీలు విభేదించాయన్న వార్తలను బీజేపీకి చెందిన ఓ సీనియర్​ సభ్యుడు కొట్టివేశారు.

ఒకే దేశం- ఒకే ఎన్నికలు..

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో సుస్థిర విధానాలు, సాక్ష్యాల ఆధారిత సంస్కరణలపై కేంద్రం దృష్టి సారించడం ఆర్థిక వ్యవస్థకు ఆజ్యం పోసిందని, దేశ వృద్ధి కథను నడిపించిందని అన్నారు.

ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే వన్ నేషన్, వన్ ఎలక్షన్ అమలు చేస్తామని బీజేపీ సీనియర్ నేత తెలిపారు.

గత నెలలో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ ఒకే దేశం- ఒకే ఎన్నికలపై ప్రధాని మోదీ గట్టిగా గళమెత్తారు. తరచుగా ఎన్నికలు జరగడం దేశ పురోగతికి అడ్డంకులు సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఏకకాల ఎన్నికల వల్ల ఖర్చులు తగ్గుతాయని, ఎన్నికలకు ముందు విధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు భారం తగ్గుతుందని, అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించకుండా అడ్డుకుంటుందని జమిలి ఎన్నికలకు మద్దతుగా బీజేపీ వాదిస్తోంది.

జనతాదళ్ (యునైటెడ్) ఈ చర్యకు మద్దతు ఇస్తుండగా, ఎన్డీయేలో మరో కీలక మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) దేశంలో ఏకకాలంలో ఎన్నికల సాధ్యాసాధ్యాలను అన్వేషించడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీపై స్పందించలేదు.

మిత్రపక్షాల నుంచి బీజేపీ ఒత్తిడికి లోనవుతోందని, లోక్​సభలో ఆ పార్టీ బలం తగ్గడం (2019లో 303 స్థానాల నుంచి ప్రస్తుతం 240కి), విధానపరమైన విషయాల్లో, నిర్ణయాల్లో భాగస్వామ్య పక్షాలకు మరింత అవకాశం కలుగుతోందన్న ఊహాగానాలకు.. సీనియర్​ నేత ప్రకటనతో ముగింపు పడింది!

బ్యూరోక్రసీలో లేటరల్ ఎంట్రీని రద్దు చేయడం, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) అమలు చేయడం, ఆస్తులపై ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించాలనే బడ్జెట్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడం వంటి చర్యలు.. మిత్రపక్షాల ఒత్తిడితోనే కేంద్రం తీసుకుందని వాదనలు వినిపించాయి.

ఈ ఏడాది మార్చ్​లో ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తొలి అడుగుగా లోక్​సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను సమకాలీకరించాలని సిఫార్సు చేసింది. అయితే ఏకకాల ఎన్నికల నిర్వహణకు ఎలాంటి కాలపరిమితిని కమిటీ పేర్కొనలేదు.

ఈ వేసవిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ మార్క్​కి (272) దూరంలో నిలిచిపోయిన బీజేపీ తన మిత్రపక్షాలపై - ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ), 28 మంది సభ్యులున్న ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ - కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

అభివృద్ధి ఎజెండాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు ప్రధాని దిశానిర్దేశం చేశారని, వివిధ రంగాలకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు ఆయన అధ్యక్షతన జరిగిన ప్రగతి సమావేశాలను సదరు బీజేపీ నేత ప్రస్తావించారు.

Whats_app_banner

సంబంధిత కథనం