AP Weather Updates : బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీలో మూడు రోజులు వర్షాలు-ap weather update depression affect rain in many areas latest forest report ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Weather Updates : బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీలో మూడు రోజులు వర్షాలు

AP Weather Updates : బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీలో మూడు రోజులు వర్షాలు

Bandaru Satyaprasad HT Telugu
Dec 21, 2024 07:13 PM IST

AP Weather Updates : బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి వాయుగుండం విశాఖకు ఆగ్నేయంగా 430 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.

బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీలో మూడు రోజులు వర్షాలు
బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీలో మూడు రోజులు వర్షాలు (unsplash.com)

AP Weather Updates : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 6 గంటలుగా వాయుగుండం గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని పేర్కొంది. ప్రస్తుతానికి వాయుగుండం విశాఖకు అగ్నేయంగా 430 కిలో మీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. అలాగే చెన్నైకు ఈశాన్యంగా 480 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 590 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాగల 12 గంటల పాటు వాయుగుండం తూర్పు ఈశాన్యం దిశగా కదులే అవకాశం ఉందన్నారు. ఆ క్రమంలో సముద్రంలోనే బలహీన పడే సూచనలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వాయుగుండం కారణంగా రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. వాయుగుండం ప్రభావంతో రానున్న మూడు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
yearly horoscope entry point

సీఎం చంద్రబాబు సమీక్ష

వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ఆదేశించారు. సీఎంవో అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై సీఎంకు వివరించారు. కలెక్టర్లు, జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలను సీఎంకు తెలియజేశారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసినట్లు, స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వర్షాలు తగ్గాక పంట నష్టంపై వివరాలు సేకరిస్తామన్నారు. రైతులకు తక్షణ సాయం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులు చేరేలా చూడాలన్నారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

మూడు రోజులు వర్ష సూచన

రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతారణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురుస్తాయని వెల్లడించింది. రాయలసీమలో నేడు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

Whats_app_banner

సంబంధిత కథనం